అమరావతి కేంద్రంగా కూచిపూడి అభివృద్ధి
నగరంలో తొలిసారిగా శనివారం తెలుగు భాషా దినోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఈ ఉత్సవాలు నిర్వహించాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరై మాట్లాడుతూ అమరావతి కేంద్రంగా కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తెలుగు భాషా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ కల్చరల్ : అమరావతి కేంద్రంగా కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాంతానికి చెందిన కూచిపూడి నృత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసమే రూ.100 కోట్లు కేటాయించామని వివరించారు. గోదావరి పుష్కరాల్లోనూ కూచిపూడి నృత్యానికి తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంయుక్తంగా తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 132వ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాయి. వేడుకలకు హాజరైన సీఎం మాట్లాడుతూ నగరంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహనీయులకు పురస్కారాలు
తెలుగు భాషా వైభవానికి కృషిచేసిన మహనీయులు 11 మందికి తెలుగు భాషా కోవిద పురస్కారాన్ని ప్రకటించి రూ.25 వేల నగదు బహుమతితో పాటు సత్కారాన్ని అందించారు. కోరాడ మహదేవ శాస్త్రి, పోరంకి దక్షిణామూర్తి, ఎల్బీ శంకరరరావు, జొన్నవిత్తుల రామలింగశాస్త్రి, పొట్లూరి హరికృష్ణ, భాషా సేవకుడు వెలిమల సిమన్న, సామల రమేష్ బాబు, రాధాశ్రీ, నూర్ బాషా, హనుమారెడ్డి, గుత్తికొండ సుబ్బారావు, సుద్దాల అశోక్ తేజ ఈ పురస్కారాలు అందుకున్నారు.
అంతకుముందు విద్యార్థులు ఘంటసాల సంగీత కళాశాల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. సినీ నటుడు ప్రదీప్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.గోవిందరాజన్ నాయకత్వం వహించారు. నగరంలో తొలిసారిగా జరిగిన భాషా ఉత్సవాలకు తెలుగు భాషా అభిమానులు పెద్దసంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకలకు మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ రామకృష్ణ, మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, సాంస్కృతికశాఖ సంచాలకుడు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషా వైభవం ఉద్యమంలా సాగాలి
తెలుగు భాషా వైభవం ఉద్యమంలా సాగాలని వక్తలు అభిప్రాయ పడ్డారు. తొలుత వేడుకలను భాషా పండిత సదస్సుల సంస్థ గౌరవాధ్యక్షుడు కె.వి.వి.వి.సత్యనారాయణరాజు ప్రారంభించారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి రామ్ప్రకాష్ సిసోడియా తదితరులు మాట్లాడారు. మాతృభాషలో విద్యాబోధన-మానవతా విలువలు అంశంపై ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, రాష్ట్రీయ పండిత పరిషత్ అధ్యక్షుడు టి.గిరిరాజ్ తదితరులు ప్రసంగించారు. 13జిల్లాల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.