‘హుదూద్’ ఎఫెక్ట్ నలుగురిని బలిగొన్న చెట్లు
కుమరాం, జాగరం (జామి): హుదూద్ తుఫాన్ బీభత్సంతో చెట్లు కూలిపోయి వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా గ్రామాల్లో పెను విషాదం నెలకొంది. తుపాను సందర్భంగా జరిగిన విషాదంపై స్థానికులు, పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన కర్రి రమేష్ (23) అనే యువకుడు ఆదివారం పశువుల పాకలోకి వెళ్తున్న సమయంలో గ్రామం సమీపంలోని తాటి చెట్టు మీద పడి అక్కడి కక్కడే మృతిచెందాడు. మృతుడు గ్రామానికి చెందిన రాము,లక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు. మృతు డి సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. రమేష్ ఇంటర్మీడియెట్ పూర్తిచేసి కుటుంబఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. తండ్రి గీత కార్మికుడు కావడంతో అతనికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అప్పటివరకు తన దగ్గరే ఉండి ఇంటికి వెళ్లివస్తాను నాన్నా.. అని చెప్పి బయల్దేరిన కుమారుడు కొద్దినిమషాల్లోనే మృతి చెందాడన్న వార్త తెలియగానే ఆ తల్లిదండ్రుల రోదన ఎవరికీ ఆపతరం కాలేదు. తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.
పడిపోయిన చెట్టును ఢీకొని..
జామి మండలంలోని జాగరం గ్రామానికి చెందిన శింగిడి రమేష్ (30) అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున బైక్‌పై జామి వైపు వస్తున్న సమయం లో లక్ష్మీపురం జంక్షన్ సమీపంలో తుఫాన్ వల్ల రహదారికి అడ్డంగా పడిఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉదయ్, కుమార్తె లిఖిత ఉన్నారు. జామి ఎస్సై ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృతితో భార్యాపిల్లలు దిక్కులేని వారయ్యారు.
చెట్టుకింద తలదాచుకుని..
విజయనగరం క్రైం : పట్టణంలోని కెఎల్.పురం సమీపంలో ఈదురుగాలులకు చెట్టు కూలి మీద పడిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ద్వారపూడి గ్రామానికి చెందిన ఎస్.సత్తిబాబు (35) జేఎన్టీయూ సమీపంలో ఉన్న ఎఫ్‌సీఐ గొడౌన్లో కలాసీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు సైకిల్‌పై వెళ్లాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చెట్టు కింద తల దాచుకునేందుకు సైకిల్‌ను ఆపాడు.
ఆ సమయంలో అదే చెట్టు సత్తిబాబుపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం ఆ మార్గంలో వెళ్తున్న గ్రామానికి చెందిన వ్యక్తులు చూసి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అం దించారు. మృతునికి భార్య శ్యామల, కుమార్తె జయంతి, కుమారులు రామచరణ్, చిట్టిబాబు, సోదరుడు చిన్న ఉన్నారు.
కోమాలోకి వెళ్లిపోయి..
డెంకాడ మండలంలోని బంటుపల్లి పంచాయతీకి చెం దిన బమ్మిడి సూరిబాబు ఆదివారం ఉదయం పొలానికి వెళ్తుండగా రోడ్డు పక్కనున్న చెట్టు అతనిపై పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.