ఆగ్రహ జ్వాలలు
=రెండో రోజూ పలుచోట్ల బంద్
=జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినేట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో బంద్ పాటించారు. వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ,ఏపీ ఎన్జీవోలు, విద్యార్థి సం ఘాలు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ప్ర భుత్వ కార్యాలయాలు స్తంభించాయి. విద్యా సంస్థ లు, దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ధర్నా లు, రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధం, బైటాయింపు వంటి కార్యక్రమాలతో గ్రామీణ జిల్లా హోరెత్తింది.
అరకులోయలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కుంబా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు, సియ్యారి దొన్నుదొరలతోపాటు ఎమ్మెల్యే సివిరి సోమ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. అరకులోయలో రోడ్లన్నీ దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, గిడ్డి ఈశ్వరిల ఆధ్వర్యంలో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వద్ద బైఠాయించారు. ఈమేరకు పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు మత్స్యరాస మణికుమారి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు బొర్రా నాగరాజు ఆధ్వర్యంలో కూడా రాస్తారోకో, ర్యాలీ తదితర నిరసన కార్యక్రమాలు జరిగాయి.
నర్సీపట్నంలో టీడీపీ నేతలు రావాడ నాయుడు, రుత్తల బాబ్జీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు కేడీ పేటలో రెండో రోజూ బంద్ జరిగింది. వైఎస్సార్సీపీ నేతలు చిటికెల భాస్కరనాయుడు, లగుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో రోడ్డుకు అడ్డంగా కంచె ఏర్పాటుచేసి నిరసన తెలిపారు.
మాడుగులలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చోడవరం నియోజకవర్గ పరిధిలో బుచ్చయ్యపేటలో పలువురు యువకులు బంద్ నిర్వహించారు.అనకాపల్లిలో టీడీపీ నేత బుద్ద నాగజగధీశ్వరరావు ఆధ్వర్యాన బంద్ జరిగింది.
యలమంచిలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయరహదారి దిగ్బంధం చేపట్టారు. ఇందులో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు పాల్గొన్నారు. కొక్కిరాపల్లి జంక్షన్‌వద్ద జాతీయరహదారిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద రాస్తారోకో నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ నాయకుడు బోదెపు గోవింద్ ఆధ్వర్యంలో యలమంచిలి మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ హాజరయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలోనూ మునగపాక, రాంబిల్లిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యులు చిక్కాల రామారావు ఆధ్వర్యంలో వైజంక్షన్ వద్ద జాతీయ రహ దారి దిగ్బంధించారు. మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. నక్కపల్లిలోడీసీసీబీ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ అధ్వర్యంలో కళాశాల విద్యార్దులు, పార్టీకార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట, కోటవురట్లలో టీడీపీ ఆధ్వర్యంలో కూడా రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి.