'ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోంది'
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. శనివారం టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రైతులకు సమస్యలు లేవని, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకోవట్లేదని మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడటం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించాలని మంత్రులు చూస్తున్నారని మండిపడ్డారు.
రైతులకు రుణమాఫీ చేయడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం 28 కోట్లు ఖర్చు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు సీఎం హామీ ఇచ్చిన మేరకు రూ.100 కోట్లు విడుదల చేయాలన్నారు.