వాతావరణంలో అనిశ్చితి వల్లే వడగళ్ల వర్షం
సాక్షి, విశాఖపట్నం: మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు ఒకేసారి భూమికి దగ్గరగా రావడం వల్ల వాతావరణంలో అనిశ్చితి పెరిగి వడగళ్ల వర్షం కురుస్తోందని విశాఖలోని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ‘భూమ్మీద ఉన్న తేమ ఎక్కువగా ఆకాశంలోకి వెళ్లటం వల్ల ఎక్కువ ప్రభావం చూపే మేఘాలు ఏర్పడతాయి. దీనినే క్యూములోనింబస్ అంటారు. వేడి ప్రాంతాలు, అరణ్యాలు, కొండలు విస్తరించిన చోట్ల ఇవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఎక్కువగా ఉన్నాయి.
దీని వల్ల తేమ ఎక్కువై భూమి నుంచి ఆకాశానికి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు మేఘాలు ఏర్పడుతున్నాయి. సాధారణ వర్షాల సమయంలో మే ఘాలు భూమి నుంచి అయిదు కిలోమీటర్ల వరకే విస్తరిస్తే, ఈ మేఘాలు అంతకుమించి దూరం ప్రయాణిస్తాయి. ఇవి ఎత్తుకు వెళ్లేకొద్దీ పైనున్న వాతావరణం మైనస్ డిగ్రీలకు చేరుకుని వడగళ్లుగా మారతాయి. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు ఇవే కారణమ’ని విశాఖ వాతావరణ నిపుణులు భానుప్రకాశ్ విశ్లేషించారు. క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డానికి గంట పడుతుంది. ఇవి చినుకులు రూపంలో పడ్డానికి మరో గంట పడుతుంది. కాని ఈ ప్రక్రియ వేగంగా జరగడంతో వడగళ్లు పడుతున్నాయని విశాఖలోని విశ్రాంత వాతావరణ నిపుణులు అచ్యుతరావు విశ్లేషించారు.