బాలీవుడ్ తెరపై అజారుద్దీన్ గా అజయ్ దేవగన్?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథా చిత్రాల జోరు పెరిగింది. ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీవిత కథతో బాలీవుడ్ లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విజయం సాధించడంతో మరికొంత మంది 'బయోపిక్'లపై దృష్టి సారించారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
అయితే అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ లో ఏ హీరోతో చేయించాలనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నారు. తెరపై అజారుద్దీన్ పాత్రను పోషించడానికి బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ పాత్ర అజయ్, ఇమ్రాన్ లలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.