కుప్పం తమ్ముళ్ల రగడ
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడుకు సొంత నియోజకవర్గంలో ‘స్థానిక’ గండం పొంచి ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ దళిత ఓటర్లు, బలహీనవర్గాల వారు టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇప్పుడు వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు ఆశిస్తున్న వారి నుంచి ఈ ప్రమాదం తలెత్తింది. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు టీడీపీ ఓటు బ్యాంకుకు చాపకింద నీరులా గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోనూ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా బహిర్గతం కాలేదని అంటున్నారు. కుప్పం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణలో తమ్ముళ్ల వైఖరి ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగించింది. కుప్పం జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఈ స్థానాన్ని కుప్పం సర్పంచ్ వెంకటేష్ ఆశిస్తున్నారు. కిందటి ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
అప్పట్లో కుప్పం పంచాయతీని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీనికోసం వెంకటేష్‌తో పాటు మరో నాయకుడు రాజ్‌కుమార్ పోటీపడ్డారు. నియోజకవర్గ నాయకులు సమన్వయం కుదిర్చి రాజ్‌కుమార్‌కు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని సర్దిచెప్పారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో సర్పంచ్‌గా ఎన్నికైన వెంకటేష్ కూడా ఆ పదవిని తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాను గతంలో ఎంపీపీగా పనిచేశానని సర్పంచ్‌గా పనిచేయడం తనవల్ల కాదని కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో కొందరు ముఖ్యనేతలు వెంకటేష్ వైపు మొగ్గు చూపారు. అప్పట్లో తనకు హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు సబబంటూ రాజ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంకటేష్‌కు జెడ్పీటీసీ సీటు ఇస్తే పార్టీ అభ్యర్థిని ఓడించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తడాఖా చూపిస్తామని రాజ్‌కుమార్ వర్గం హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. కాగా కుప్పం ఎంపీపీ విషయంలోనూ పెద్ద ఎత్తున విభేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పం ఎంపీపీ, జెడ్పీటీసీగా వ్యవహరించిన సాంబశివం, చౌడప్ప ఇప్పుడు పోటీ పడుతున్నారు. అయితే ఈ పదవిని కుప్పం అర్బన్ అధ్యక్షులు సాగర్, కుప్పం ఉప సర్పంచ్ సుధాకర్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ యువకులు.
ఎంపీపీ స్థానాన్ని యువకులకు ఇవ్వాలన్న డిమాండ్‌ను వారు తెరపైకి తెచ్చారు. అన్ని పదవులు మాజీలకే ఇస్తూ పోతే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యేలోగా కొన్ని వర్గాల నుంచి చంద్రబాబు వ్యతిరేకత ఎదుర్కోక తప్పదనే భావన వ్యక్తమవుతోంది.