మనిషిని నిలువెల్లా కాల్చేసే తెల్ల భాస్వరం
బాంబుల వర్షం, గ్రెనేడ్ల దాడులు, క్షిపణి ప్రయోగాలు.. రసాయన దాడులు ఏ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వచ్చినా వీటి గురించే మనం వింటూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా తెల్ల భాస్వరంతో (వైట్ ఫాస్పరస్) దాడులు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్నాయి. మనిషిని నిలువెల్లా కాల్చేసే ఈ తెల్ల భాస్వరం అంటే ఏమిటి? దాడుల్లో దీన్ని వినియోగించడంతో మానవాళికి వచ్చే ముప్పేంటి ?
ఉత్తర సిరియాలో కుర్దులపై టర్కీ చేస్తున్న ఏకపక్ష దాడులు బీభత్సం సృష్టిస్తున్నాయి. స్వతంత్ర కుర్దిస్తాన్ కోసం వీరు చేస్తున్న పోరాటానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా హఠాత్తుగా తమ బలగాల్ని ఉపసంహరించింది. దీంతో రెచ్చిపోయిన టర్కీ సేనలు ఉత్తర సిరియాలో సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్‌పై గత కొద్ది రోజులుగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాయపడిన వారిని పరీక్షిస్తే వెల్లడైన నిజాలు అంతర్జాతీయ సమాజం తెల్లబోయేలా చేస్తున్నాయి.
తెల్ల భాస్వరం అంటే..
తెల్ల భాస్వరం ఒక రసాయనం. దీనికి స్వతహాగా మండే గుణం ఉంటుంది. చర్మాన్ని, బట్టల్ని, ఇంధనాన్ని, మారణాయుధాల్ని మండించగలదు. దీని నుంచి దట్టమైన పొగ కూడా వ్యాపిస్తుంది. గ్రెనేడ్లు, లాంచర్లు, మోర్టార్లు వంటి ఆయుధాల్లో పేలుడు కోసం దీనిని వాడతారు. కదన రంగంలో సైనికుల కదలికలు ప్రత్యర్థులకు కనిపించకుండా పొగ వ్యాపించడం కోసం కూడా తెల్ల భాస్వరంతో తయారు చేసిన పొగ బాంబుల్ని విసురుతుంటారు. ఇవాళ రేపు ఎన్నో దేశాలు దాడుల సమయంలో ఈ తరహా రసాయన దాడులకు దిగుతున్నాయి. టర్కీ కూడా ఇప్పుడు నేరుగా కుర్దులపై తెల్ల భాస్వరంతో రసాయన దాడులు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. టర్కీ దాడుల్లో కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన బాధితుల్ని చూస్తూ ఉంటే మనసు పిండేస్తోంది.
మనుషులపై పడే ప్రభావం
తెల్ల భాస్వరం రసాయన దాడులు ప్రాణాంతకమైనవి. మూడు రకాలుగా ఇది మనిషి ప్రాణాలు తోడేస్తుంది. శరీరంలో కణజాలాన్ని కాల్చి మనిషిని ఒక మాంసం ముద్దగా మార్చేస్తుంది. ఇక దీని నుంచి వెలువడే దట్టమైన తెల్లని పొగ పీల్చడం వల్ల శరీరంలో ఊపిరితిత్తుల వ్యవస్థ సర్వనాశనమై ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. తెల్ల భాస్వరం నోటి నుంచి శరీరంలోకి వెళ్లినా కిడ్నీ, కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాలు పోతాయి. తెల్ల భాస్వరం నుంచి వచ్చే ఆవిరి కొన్నేళ్లు పీలిస్తే దవడలన్నీ వాచిపోయి నోరు తెరవడానికి వీలు కాదు. దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
గతంలో ఎప్పుడు వాడారు ?
19వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా అమెరికా, ఐర్లాండ్‌కు చెందిన తిరుగుబాటు జాతీయ సంస్థ , ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్హుడ్గా పిలిచే ఫెనియన్ పోరాటదారులు తెల్ల భాస్వరంతో బాంబులు చేసి వాడారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో ఆ తర్వాత కొరియా, వియత్రాం యుద్ధాల్లో కూడా దీనిని వినియోగించారు. 1988లో సద్దాం హుస్సేన్‌ను నిర్బంధించడానికి అమెరికా చేసిన దాడుల్లో తెల్ల భాస్వరం వినియోగించారు. మళ్లీ ఇన్నేళ్లకు టర్కీ తెల్ల భాస్వరం బాంబులతో కుర్దుల స్థావరాలపై దాడులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. టర్కీ దీనిని ఖండిస్తున్నప్పటికీ క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రం కాలిన గాయాలకు తెల్లభాస్వరమే కారణమని తేల్చి చెబుతున్నారు
అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయ్!
జెనీవా ఒప్పందంలోని ప్రోటోకాల్ త్రీలో ఆర్టికల్ 1 ప్రకారం రసాయన ప్రక్రియ ద్వారా మంటలు రేగే గుణం కలిగే ఆయుధాలతో దాడి జరపడం నిషిద్ధం. అయితే తెల్ల భాస్వరంతో తయారయ్యే రసాయన ఆయుధాలు ఆ నిషిద్ధ జాబితాలో లేవు. అంతే కాకుండా సైనిక స్థావరాలను లక్ష్యంగా జరిపే దాడుల్లో తెల్ల భాస్వరం ప్రయోగం నిషేధంపైన అంతర్జాతీయంగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అయితే 1993 నుంచి రసాయ ఆయుధాల తయారీ, సరఫరా వంటి వాటిపై అంతర్జాతీయ సమాజం నిషేధం విధించింది. మనుషులపైనా, పౌరులు నివసించే ప్రాంతాలపైనా రసాయన దాడులు జరపకూడదని తీర్మానించింది.