
'అత్యాచారాలకు ఆనవాళ్లు'
ఐఎస్‌ఐఎస్ కామాంధులకు చేతికి చిక్కి నరకయాతన అనుభవిస్తున్న ఏ యువతి వెల్లడించిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది.
ఇస్లామిక్ రాజ్యం స్థాపన లక్ష్యంగా ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ సభ్యులు సాగిస్తున్న లైంగిక అకృత్యాలు నివ్వెరపరుస్తున్నాయి. బాలికలు, మహిళలను లైంగిక బానిసలుగా చేసుకుని వారు చేస్తున్న దారుణాలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయి. ఐఎస్‌ఐఎస్ కామాంధులకు చేతికి చిక్కి నరకయాతన అనుభవిస్తున్న ఏ యువతి వెల్లడించిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది.
ఇజ్ది తెగకు చెందిన మయత్(ఇది ఆమె అసలు పేరు కాదు) అనే 17 ఏళ్ల యువతిని సింజార్ ప్రాంతం నుంచి ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అపహరించారు. కిడ్నాపర్ల కన్నుగప్పి ఆమె తన బాధను ఫోన్ లో వెళ్లబోసుకుంది. తాను పేరు మాత్రం రాయొద్దని దీనంగా వేడుకుంది. తన పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరుతో సిగ్గుతో చచ్చిపోతున్నానని చెప్పింది. ఇప్పటికిప్పుడే చనిపోవాలని ఉన్నా మళ్లీ తన తల్లిదండ్రులను కలుసుకుంటానన్న ఏకైక ఆశే తనను బతికిస్తోందని తెలిపింది. ఆ అభాగ్యురాలి ఆమె మాటల్లోనే....
'40 మంది మహిళలు, బాలికలను తీవ్రవాదులు ఇక్కడికి ఎత్తుకొచ్చారు. వారి వయసు 12 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. మా పట్ల వాళ్లు ప్రవర్తించే తీరు చెప్పడానికి నోరు రావడం లేదు. ఆ నరకయాతనను ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఓ ఇంట్లో బంధించి సాయుధులను కాపలా పెట్టారు. ఈ ఇంట్లో ఉన్న మూడు గదులు నరకానికి నకళ్లు, అత్యాచారాలకు ఆనవాళ్లు. మమ్మల్ని బానిసలుగా చూస్తారు. కిమ్మనకుండా మానాన్ని రోజుకో మగాడికి అర్పించుకోవాల్సివుంటుంది. ప్రతిఘటిస్తే బెదిరిస్తారు. ఒక్కోసారి కొడతారు. ఇలాంటప్పుడు ప్రాణాలు పోతే పీడ వదులుతుందని అనుకుంటాం. కాని పిరికిపందలు.. మేము ఎదుర్కొంటున్న నరకాన్ని తప్పించే ధైర్యం ఎవడికీ లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం- ఇప్పటికే నా దేహాన్ని చంపేశారు. ఇప్పుడు నా ఆత్మను హత్యచేస్తున్నారు' అంటూ మయత్ ముగిసించింది.