Kurds
-
అమెరికా–టర్కీ రాజీ
అనునిత్యం ఉద్రిక్తతలతో, అల్లకల్లోలంగా ఉండే ప్రాంతం సిరియా. అక్కడ అమెరికా, ఇతర అగ్ర రాజ్యాలు రాజేసిన నిప్పు ఇప్పట్లో చల్లారే సూచనలు కనబడటం లేదు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ఆ దేశాలు ఎనిమిదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. అమెరికా వెదజల్లిన డాలర్లు, ఆయుధాలు సొంతం చేసుకున్న గ్రూపులు కొన్ని అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద ముఠాగా అవతరించాయి. దాన్ని ఏదో మేరకు నియంత్రించగలిగినా అటు సిరియా సంక్షోభం మాత్రం సజీవంగా ఉంది. అమెరికా, టర్కీలు మిత్ర దేశాలైనా సిరియాపై అమెరికా ఎగదోస్తున్న కుర్దులంటే టర్కీకి ససేమిరా పడదు. వారికి మద్దతు ఆపకపోతే మైత్రి సాగదని అమెరికాను ఇప్పటికే టర్కీ హెచ్చరించింది. ఉత్తర సిరియావైపు మోహరించిన కుర్దులను వెళ్లగొట్టేందుకు ఆదివారం సైనికదాడులకు దిగుతామని చెప్పడంతో ఆదరాబాదరాగా అమెరికా రంగంలోకి దిగింది. టర్కీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసేందుకు వీలుగా సుస్థిర భద్రతా యంత్రాంగాన్ని నెలకొల్పడానికి ఇరు దేశాల మధ్యా అంగీకారం కుదిరింది. కుర్దులను టర్కీ ఉగ్రవాదులుగా పరిగణిస్తుంటే.. అమెరికా మాత్రం వారిని పోరాట యోధులుగా చూస్తోంది. అలాగే టర్కీ క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్400ను రష్యా నుంచి కొనుగోలు చేసి అమెరికాకు షాక్ ఇచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా పునరుద్దరించుకొనే పనిలో ఉన్నాయని ఈ చర్యల ద్వారా తెలుస్తోంది. ఏతావాతా సిరియా సంక్షోభం మాత్రం యధాతథం! -
‘కుర్దు ఉగ్రవాదులను తరిమికొట్టాం’
అఫ్రిన్, సిరియా : సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. దేశానికి ఆఫ్రిన్ నగరంలోని కుర్దులను టర్కీ దన్నుతో సిరియాలో పోరాటం సాగిస్తున్న సేనలు వెళ్లగొట్టాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. టర్కీ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో టర్కీ సేనలు వరుసగా దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణిచారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. అంతకుముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ ఫ్రీ సిరియా ఆర్మీ సేనలు ఆఫ్రిన్‌ను ఆదివారం ఉదయం స్వాధీనం చేస్తున్నాయని ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని అన్నారు. -
ఇరాక్‌లో కుర్దులపై రసాయన దాడులు!
ఇరాక్‌లో అమానుషాలకు ఒడిగడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా రసాయన దాడులకు సైతం తెగబడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్‌లోని కుర్దిష్ సేనలపై ఐఎస్ఐఎస్ గ్రూప్ నిషేధిత రసాయన ఆయుధ దాడులు జరుపుతున్నట్టు దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సల్ఫర్ మస్టర్డ్ దాడులు జరిగాయా? లేదా? అన్నది ధ్రువీకరించాలని అవి అంతర్జాతీయ పర్యవేక్షకులను కోరాయి. ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల కుర్దిష్ బలగాలకు చెందిన 35 దళాలపై అజ్ఞాత దాడులు జరిపారు. ఈ దాడుల్లో పలువురు సైనికులకు విపరీతమైన గాయాలయ్యాయి. వీరి గాయాలను పరిశీలిస్తే.. ఇవి నిషేధిత రసాయన వాయువులతో చేసిన దాడులు అయి ఉంటాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రసాయన ఆయుధాలపై నిషేధం కోసం కృషిచేస్తున్న ఓపీసీడబ్ల్యూ సంస్థ బృందం ఇరాక్‌లో పర్యటించి.. ఈ దాడులకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసుకురానుంది. మరోవైపు వరుస వైమానిక దాడులతో బలహీనపడుతున్న ఐఎస్ఐఎస్ 14 ఏళ్ల బాలురను సైతం ఉగ్రవాద గోదాలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నది. తన అధీనంలో ఉన్న 14 ఏళ్లు, ఆ పైచిలుకు బాలురను సమీకరించేందుకు యత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తర జిల్లాలోని రఖ్కా నగరంలో 14 ఏళ్ల పైచిలుకు అబ్బాయిలు తమ పేర్లను నమోదుచేయించుకోవాలని ఆ గ్రూప్ సర్క్యులర్ జారీ చేసింది.