అనునిత్యం ఉద్రిక్తతలతో, అల్లకల్లోలంగా ఉండే ప్రాంతం సిరియా. అక్కడ అమెరికా, ఇతర అగ్ర రాజ్యాలు రాజేసిన నిప్పు ఇప్పట్లో చల్లారే సూచనలు కనబడటం లేదు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ఆ దేశాలు ఎనిమిదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. అమెరికా వెదజల్లిన డాలర్లు, ఆయుధాలు సొంతం చేసుకున్న గ్రూపులు కొన్ని అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద ముఠాగా అవతరించాయి. దాన్ని ఏదో మేరకు నియంత్రించగలిగినా అటు సిరియా సంక్షోభం మాత్రం సజీవంగా ఉంది.
అమెరికా, టర్కీలు మిత్ర దేశాలైనా సిరియాపై అమెరికా ఎగదోస్తున్న కుర్దులంటే టర్కీకి ససేమిరా పడదు. వారికి మద్దతు ఆపకపోతే మైత్రి సాగదని అమెరికాను ఇప్పటికే టర్కీ హెచ్చరించింది. ఉత్తర సిరియావైపు మోహరించిన కుర్దులను వెళ్లగొట్టేందుకు ఆదివారం సైనికదాడులకు దిగుతామని చెప్పడంతో ఆదరాబాదరాగా అమెరికా రంగంలోకి దిగింది. టర్కీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసేందుకు వీలుగా సుస్థిర భద్రతా యంత్రాంగాన్ని నెలకొల్పడానికి ఇరు దేశాల మధ్యా అంగీకారం కుదిరింది. కుర్దులను టర్కీ ఉగ్రవాదులుగా పరిగణిస్తుంటే.. అమెరికా మాత్రం వారిని పోరాట యోధులుగా చూస్తోంది. అలాగే టర్కీ క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్400ను రష్యా నుంచి కొనుగోలు చేసి అమెరికాకు షాక్ ఇచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా పునరుద్దరించుకొనే పనిలో ఉన్నాయని ఈ చర్యల ద్వారా తెలుస్తోంది. ఏతావాతా సిరియా సంక్షోభం మాత్రం యధాతథం!
Comments
Please login to add a commentAdd a comment