ముంబై వీధుల్లో మొదటి ఏసీ సబర్బన్!
ముంబై: త్వరలో ముంబై నగర వీధుల్లో మొదటి సబర్బన్ ఏసీ రైలు పరుగులు పెట్టనుంది. మార్చి 31న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఈ రైలు మంగళవారం ముంబై చేరుకుంది. ప్రస్తుతం కుర్లా కార్ షెడ్లో ఉన్న ఈ కోచ్‌ను రైల్వే టెక్నికల్ ఇంజనీర్లు రెండు మార్లు పరిశీలించిన తర్వాత వారం పాటు సీఆర్లోని ట్రాన్స్ హార్బర్ లైన్లో ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు.
ఒక్క రైలు నిర్మణానికి రూ.54 కోట్లు ఖర్చవుతుంది. సిల్వర్-బ్లూ రంగుల్లో ఉండే ఈ లోకల్ రైలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది రంగ ప్రవేశం చేస్తే 2012-13 బడ్జెట్లో ప్రవేశపెట్టిన లోకల్ ఏసీ ట్రెయిన్ సర్వీసుల అంశం త్వరలో అమలుకానుంది. మొత్తం 12 కొత్త సబర్బన్ లోకల్ రైళ్లు మంజూరు కాగా, రెండింటిని మహిళల కోసం ప్రత్యేకంగా నడపనున్నారు. ఆర్డీఎస్ఓకు చెందిన జాయింట్ టీమ్ ఏసీ లోకల్ ట్రెయిన్‌ను పరీక్షించనున్నారని సమాచారం.