Kurnool road
-
గ్రానైట్ నిక్షేపాలు కొంతే..
- కర్నూలు రోడ్డు కింద గ్రానైట్ విలువ రూ.1125 కోట్లే - నివేదికలో తేల్చిన ఏపీఎండీసీ - తొలుత అంచనా వేసింది రూ.30 వేల కోట్లు - 3.5 కి.మీ పొడవున 30 మీటర్ల వెడ ల్పు, 60 మీటర్ల లోతున విలువైన రాళ్లు - 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాళ్లున్నట్లు ధ్రువీకరణ చీమకుర్తి : రామతీర్థంలోని కర్నూల్‌రోడ్డు కింద రూ.1125 కోట్ల విలువ చేసే గ్రానైట్ నిక్షేపాలు మాత్రమే ఉన్నట్లు హైదరాబాద్‌లోని ఏపీఎండీసీ జీఎం ప్రసాద్ గురువారం రాత్రి ధ్రువీకరించారు. కర్నూల్‌రోడ్డు కింద 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ నిక్షేపాలున్నట్లు తెలిపారు. ఒక్కో క్యూబిక్ మీటర్ రాయి సరాసరిన రూ.45 వేలు వంతున మొత్తం రూ.1125 కోట్ల విలువ చేస్తుందని అంచనా. కర్నూల్‌రోడ్డు కింద ఒకప్పుడు 12 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి ఉందని, దాని విలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసి ఇటీవల మైన్స్ అధికారులతో పాటు హైదరాబాద్ నుం చి వచ్చిన ఉన్నతాధికారులు కర్నూల్‌రోడ్డును పరిశీలించారు. ఆ నిక్షేపాలను వెలికి తీయాలంటే కర్నూల్‌రోడ్డును తవ్వాలని, ప్రత్యామ్నాయం రోడ్డును చీమకుర్తి నుంచి మర్రిచెట్లపాలెం మీదుగా వేసేందుకు చర్యలు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. దాని మీద చీమకుర్తి వాసులు అడ్డం తిరిగి గ్రానైట్ రాళ్లకోసం కర్నూల్‌రోడ్డును తవ్వుతుటే ఊరుకోమని స్పష్టం చేశారు. శాంపిల్స్ సేకరణ: ఎంత మేర గ్రానైట్ నిక్షేపాలున్నాయో అంచనా వేసేందుకు ఏపీఎండీసీ ఆధ్వర్యంలో గత జూలై నెలలో చీమకుర్తి నుంచి మర్రిచెట్లపాలెం వరకు రామతీర్థం మీదుగా 24వ కి.మీ రాయి నుంచి 28వ కి.మీ రాయి వరకు రోడ్డు మార్జిన్లలో డైమండ్ కోర్ డ్రిల్లింగ్ చేసి భూమి లోపలున్న గ్రానైట్ శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని ప్రత్యేక ల్యాబ్‌లో పరిశీలించి ఎంత లోతులో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి, వాటి నాణ్యత ఎంత అనే అంశాలను తేల్చారు. గ్రానైట్ నిక్షేపాలున్నది ఇలా... - ల్యాబ్‌లో పరిశీలించిన నివేదిక ప్రకారం ఏపీఎండీసీ అధికారులు కర్నూలు రోడ్డు కింద ఉన్న గ్రానైట్ నిక్షేపాల వివరాలు వెల్లడించారు. - 24వ కి.మీ రాయి నుంచి 28వ కి.మీ రాయి వరకు మధ్యలో ఉన్న 3.5 కి.మీల పొడవున మాత్రమే గ్రానైట్ నిక్షేపాలున్నాయి. - అటు, ఇటు చెరి అరకిలోమీటరు పొడవులో గ్రానైట్ రాళ్లు లేవు. అది కూడా కర్నూలు రోడ్డుకి 30 మీటర్ల వెడల్పున, 65 మీటర్ల లోతున మాత్రమే నాణ్యమైన నిక్షేపాలున్నాయి. - వాటిని కూడా 25 అడుగుల వరకు తవ్వితే గానీ గ్రానైట్ నిక్షేపాలను వెలికి తీయలేమని నివేదికలో తేలింది. దానిని బట్టి కర్నూల్‌రోడ్డులో 30 అడుగుల వెడల్పు, 3.5 కి.మీ పొడవునా, 65 మీటర్లు లోతున 2.50 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి ఉందని చివరగా ధ్రువీకరించారు. దాని విలువ రూ.1125 కోట్లు ఉంటుందని ఏపీఎండీసీ అధికారులు తేల్చారు. దాని ప్రకారం వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతంలో క్వారీ నిర్వహించటం సాధ్యం కాదని అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
హత్య కేసులో 8 మంది నిందితుల అరెస్టు
బేతంచెర్ల: గత నెల 20న రుద్రవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకుడు వంకందిన్నె బంగారురెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో 8 మంది నిందితులను శుక్రవారం అంబాపురం గ్రామ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు..డోన్ పట్టణానికి చెందిన కాల్వ మద్దయ్య 1998వ సంవత్సరంలో రుద్రవరం గ్రామానికి చెందిన బాల తిమ్మయ్య కుమార్తె కళావతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో అదే గ్రామంలో 3 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ పొలానికి మంచి ధర లభించడంతో మద్దయ్య అమ్మకానికి పెట్టాడు. అయితే తన మామ బాల తిమ్మయతో పాటు బంగారురెడ్డి పొలం అమ్మకానికి అడ్డుతగలడంతో వారిపై కసి పెంచుకున్నాడు. గత నెల 19న ఏపీ 21 ఏకే 4646 స్కార్పీయో వాహనంలో డోన్‌కు చెందిన కాల్వ మద్దయ్య, ఎరుకలి కావడి రాజు, షేక్ మస్తాన్‌వలి, పులికొండ రంగస్వామి, కంప కత్తి రాముడు, నాగసాని రమేష్, రాజా బాలకృష్ణ, కోటకొండ బాలమద్దయ్య బేతంచెర్లకు వచ్చి పట్టణంలోని పాతబస్టాండులో నిలబడి ఉన్న బంగారురెడ్డిని పట్ట పగలే ఎత్తుకెళ్లిపోయారు. మొదట కర్నూలు రహదారిలోని కొమ్ముచెర్వు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోకి అతన్ని తీసుకెళ్లి దాడి చేశారు. అనంతరం పాణ్యం, బనగానపల్లె మీదుగా డోన్‌కు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దాడిలో గాయపడిన బంగారురెడ్డిని డోన్ పట్టణంలోని తారక రామనగర్‌లోని ఓ ఇంట్లో బంధించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని గమనించిన కాల్వ మద్దయ్య సమీప బంధువులు డోన్ ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో క్షతగాత్రుడిని కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న మద్దయ్య బంగారురెడ్డిని ఆటోలో కర్నూలుకు తీసుకెళ్తానని చెప్పి డోన్ శివారు ప్రాంతంలో హత్యచేసి రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. 20వ తేదిన రైల్వే పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు. అదే రోజు బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో బంగారురెడ్డి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వ్యక్తి బంగారురెడ్డిగా గుర్తించి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. రిపోర్టులో హత్య చేసినట్లు వెల్లడికావడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రమణ్యం తెలిపారు. పొలం తగాదా విషయంలో డోన్‌కు చెందిన కాల్వ మద్దయ్య బంగారురెడ్డిని హత్య చేసినట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేసిడోన్ కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసును డోన్ డీఎస్పీ పీఎన్ బాబు ఆధ్వర్యంలో డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి, బేతంచెర్ల ఎస్ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ గోవిందనాయక్, పోలీసులు సుబ్బరాయుడు, సురేష్ ప్రత్యేక చొరవ తీసుకొని ఛేదించినట్లు సీఐ సుబ్రమాణ్యం తెలిపారు. -
కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి
ఒంగోలు, న్యూస్‌లైన్ : కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్, నగర పాలకసంస్థ ప్రత్యేకాధికారి విజయకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మిని ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు వరకూ 1230 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా కేవలం ఉత్తరం వైపు 960 మీటర్లు, దక్షిణం వైపు 740 మీటర్లు మాత్రమే రోడ్డు ఎందుకు నిర్మించారని కలెక్టర్ ప్రశ్నించారు. కేవలం మార్జిన్ ఉన్నంత వరకే సిమెంట్ రోడ్డు నిర్మించడం సరికాదంటూ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్డు ఆక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు 3 రోజుల్లో నోటీసులు అందించాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే నోటీసులు ఇస్తున్నామని యజమానులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒంగోలు ఊరచెరువులో నూతనంగా నిర్మిస్తున్న చేపల మార్కెట్ పనులు ప్రారంభించి రెండేళ్లయినా పనులు పూర్తికాకపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యమేనన్నారు. బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్‌ను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో లీజుకు ఇచ్చిన షాపులు యజమానుల ఆధీనంలో కాకుండా బినామీ చేతుల్లో ఉంటే లీజులు రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థలో నిర్మించే రోడ్లకు సైడు కాల్వలు అనుసంధానం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. చెత్త చెదారాలను రహదారుల వెంట వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జాతీయ రహదారి వెంబడి ఉన్న చెత్తను 3 రోజుల్లో తొలగించాలని చెప్పారు. నగరపాలక సంస్థలో ఎంతమంది సిబ్బంది ఉండాలి.. ఎంతమంది ఉన్నారనే విషయాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.