హత్య కేసులో 8 మంది నిందితుల అరెస్టు
బేతంచెర్ల: గత నెల 20న రుద్రవరం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ గ్రామ నాయకుడు వంకందిన్నె బంగారురెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో 8 మంది నిందితులను శుక్రవారం అంబాపురం గ్రామ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు..డోన్ పట్టణానికి చెందిన కాల్వ మద్దయ్య 1998వ సంవత్సరంలో రుద్రవరం గ్రామానికి చెందిన బాల తిమ్మయ్య కుమార్తె కళావతిని వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత 2001వ సంవత్సరంలో అదే గ్రామంలో 3 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ పొలానికి మంచి ధర లభించడంతో మద్దయ్య అమ్మకానికి పెట్టాడు. అయితే తన మామ బాల తిమ్మయతో పాటు బంగారురెడ్డి పొలం అమ్మకానికి అడ్డుతగలడంతో వారిపై కసి పెంచుకున్నాడు. గత నెల 19న ఏపీ 21 ఏకే 4646 స్కార్పీయో వాహనంలో డోన్‌కు చెందిన కాల్వ మద్దయ్య, ఎరుకలి కావడి రాజు, షేక్ మస్తాన్‌వలి, పులికొండ రంగస్వామి, కంప కత్తి రాముడు, నాగసాని రమేష్, రాజా బాలకృష్ణ, కోటకొండ బాలమద్దయ్య బేతంచెర్లకు వచ్చి పట్టణంలోని పాతబస్టాండులో నిలబడి ఉన్న బంగారురెడ్డిని పట్ట పగలే ఎత్తుకెళ్లిపోయారు.
మొదట కర్నూలు రహదారిలోని కొమ్ముచెర్వు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోకి అతన్ని తీసుకెళ్లి దాడి చేశారు. అనంతరం పాణ్యం, బనగానపల్లె మీదుగా డోన్‌కు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దాడిలో గాయపడిన బంగారురెడ్డిని డోన్ పట్టణంలోని తారక రామనగర్‌లోని ఓ ఇంట్లో బంధించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని గమనించిన కాల్వ మద్దయ్య సమీప బంధువులు డోన్ ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో క్షతగాత్రుడిని కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
విషయం తెలుసుకున్న మద్దయ్య బంగారురెడ్డిని ఆటోలో కర్నూలుకు తీసుకెళ్తానని చెప్పి డోన్ శివారు ప్రాంతంలో హత్యచేసి రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. 20వ తేదిన రైల్వే పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు. అదే రోజు బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో బంగారురెడ్డి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వ్యక్తి బంగారురెడ్డిగా గుర్తించి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. రిపోర్టులో హత్య చేసినట్లు వెల్లడికావడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రమణ్యం తెలిపారు.
పొలం తగాదా విషయంలో డోన్‌కు చెందిన కాల్వ మద్దయ్య బంగారురెడ్డిని హత్య చేసినట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేసిడోన్ కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసును డోన్ డీఎస్పీ పీఎన్ బాబు ఆధ్వర్యంలో డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ సుబ్రమణ్యంరెడ్డి, బేతంచెర్ల ఎస్‌ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ గోవిందనాయక్, పోలీసులు సుబ్బరాయుడు, సురేష్ ప్రత్యేక చొరవ తీసుకొని ఛేదించినట్లు సీఐ సుబ్రమాణ్యం తెలిపారు.