
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్‌సీపీ సీనీయర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు మచిలీపట్నం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గురు అరవింద్ ఆదేశాలు జారీ చేశారు. గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద పట్టపగలు వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరరావును హతమార్చడం సంచలనం సృష్టించింది.
ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్ చేశారు. వీరందర్ని వీడియో కాన్ఫరెన్స్‌లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, బెయిల్ కోసం కొల్లు రవీంద్రతో పాటు ఇతర నిందితులు జిల్లా కోర్టులో వేర్వేరుగా ఫైల్ చేసిన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి.