‘కొల్లు’ ప్రోద్బలంతోనే మోకా హత్య | Kollu Ravindra Arrest In Moka Bhaskar Rao Assassination case | Sakshi
Sakshi News home page

‘కొల్లు’ ప్రోద్బలంతోనే మోకా హత్య

Published Sun, Jul 5 2020 3:51 AM | Last Updated on Sun, Jul 5 2020 10:04 AM

Kollu Ravindra Arrest In Moka Bhaskar Rao Assassination case - Sakshi

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను గూడూరు పోలీస్‌స్టేషన్‌ నుంచి బందరు సబ్‌జైలుకు తరలిస్తున్న పోలీసులు

కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం)/ గూడూరు (పెడన): టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. ఆయన కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారామపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. అనం తరం ఆయనను కృష్ణా జిల్లా గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు, కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించారు. నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మచిలీపట్నం రెండో అసిస్టెంట్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు కొల్లు రవీంద్ర, మిగిలిన నిందితులను 14 రోజుల రిమాండ్‌ నిమిత్తం భారీ బందోబస్తు నడుమ మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ–4, ఏ–5గా ఉన్న నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణలను అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన విషయాలను ఎస్పీ ఎం.రవీంద్ర నాథ్‌బాబు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం..

‘నా పేరు బయటకు రాకుండా చంపేయండి’
టీడీపీ మాజీ కౌన్సిలర్‌ చింతా నాంచారయ్య అలియాస్‌ చిన్నీకి మోకా భాస్కరరావుతో విభేదాలు ఉండటంతో అతడిని అడ్డు తొలగించు కోవాలనుకున్నాడు. 
► కొల్లు రవీంద్రను కలిసి మోకాను అం తమొందిస్తే తప్ప తనకు స్థానికంగా బలం ఉండదని, సహకరించాలని చిన్నీ కోరగా.. స్థానిక ఎన్నికలు ముగిశాక ఆలోచిద్దామని కొల్లు చెప్పారు.
► కొన్ని రోజుల క్రితం చిన్నీ మరోసారి రవీంద్రను కలిసి మోకాను హతమా ర్చేందుకు సహకరించాలని కోరాడు. 
► అందుకు అంగీకరించిన మాజీ మంత్రి రవీంద్ర ‘నా పేరు ఎక్కడా బయటకు రాకుండా చంపేయండి. ఈ విషయమై మాట్లాడటానికి నాకెలాంటి ఫోన్లు చేయకండి. ఏదైనా ఉంటే నా పీఏలతో మాట్లాడండి’ అని సూచించారు.
► దీంతో చింతా చిన్నీ గతనెల 29న మోకా భాస్కరరావు చేపల మార్కెట్‌లో ఒంటరిగా ఉండగా.. చింతా పులి, చింతా కిషోర్‌ (మైనర్‌)లతో కలిసి కత్తులతో పొడిచి చంపారు.

‘నేనున్నా.. ఏం జరిగినా చూసుకుంటా’
► భాస్కరరావును హత్య చేసిన చిన్నీ నిందితులిద్దరితో కలిసి ఊరి చివరకు వెళ్లి కొల్లు రవీంద్ర పీఏకి ఫోన్‌ చేశాడు. 
► కలెక్టరేట్‌లో ఉన్న రవీంద్ర పీఏ నుంచి ఆ ఫోన్‌ తీసుకుని మాట్లాడగా.. ‘అన్నా.. పని పూర్తయ్యింది. మోకాను వేసేశాం’ అని చిన్నీ చెప్పాడు. 
► ‘సరే జాగ్రత్త. నేనున్నా.. ఏం జరిగినా నేను చూసుకుంటా. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి’ అని చిన్నీకి మాజీ మంత్రి అభయమిచ్చారు. 
► నిందితుల వాంగ్మూలం, ఫోన్‌ కాల్స్‌ డేటా ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కేసులో కొల్లు రవీంద్రను నాలుగో (ఏ–4) నిందితునిగా నిర్ధారించినట్టు ఎస్పీ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement