మాజీ ఎంపీ మోదుగుల వాహనంపై బండ రాయితో దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్త
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ వేళ తెలుగుదేశం పార్టీ బరి తెగించింది. ఓటమి భయంతో టీడీపీ నేతలు, శ్రేణులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. దాడుల్లో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు గాయాల పాలయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌లకు యత్నించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు సైతం వెనుకాడలేదు.
పోలింగ్ జరుగుతుండగానే ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వీరంగం సృష్టించారు. 25వ వార్డు జలాల్ పేట పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో కలిసి వెళ్తున్న రవీంద్రను పోలీసులు వారించబోగా.. విధుల్లో ఉన్న పోలీసులను కొట్టి అక్కడే ఉన్న ఎస్సైను నెట్టేశారు. ‘ఏయ్.. ఎస్‌ఐ. నన్నే ఆపుతావా’ అని బెదిరించడమేకాక, ‘చంపుతావా.. చంపు’ అంటూ ఎస్‌ఐని రెచ్చగొట్టారు.
మోదుగులపై రాళ్లదాడి.. రిగ్గింగ్‌కు యత్నం
గుంటూరులో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం అందడంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు బండరాళ్లతో దాడి చేశారు. మోదుగుల కారుతోపాటు మరో రెండు కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ నేతలు 10కి పైగా డివిజన్లలో ఓ సామాజిక వర్గానికి చెందిన హాస్టల్‌లో ఉన్న యువతులు, విద్యార్థులను రంగంలోకి దించారు.
ఈ క్రమంలోనే 38వ డివిజన్ పరిధిలో స్తంభాల గరువు మున్సిపల్ పాఠశాలలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ముగ్గురు యువతులను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మరో యువతిని పట్టుకున్నారు.
వారి కోసం టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మారణాయుధాలతో ఓటర్లను బెదిరించారు. 6వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సమత కుమారుడు గౌతమ్ రైలుపేటలోని పోలింగ్ కేంద్రం వద్ద కత్తితో హల్‌చల్ చేస్తూ ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానిక యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే జిల్లాలోని సత్తెనపల్లిలో ఓటమి భయంతో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు ప్రయత్నించాయి. 24వ వార్డులో మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా.. ఓటమి పాలవుతామనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ నేత చౌటా శ్రీనివాసరావు పార్టీ నేతలను రప్పించి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారు.
మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం, డబ్బుతో నేరుగా పోలింగ్ కేంద్రానికి కారులో వచ్చారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి చేతికి గాయం కాగా, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారు వెనుక అద్దం ధ్వంసమైంది. సత్తెనపల్లిలోని 7వ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావును జనసేన కార్యకర్తలు కొట్టారు. ఎల్లో మీడియాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు ప్రచారం జరిగింది.
తిరుపతిలో దొంగ ఓట్లు వేయించే యత్నం
తిరుపతి 43వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేయించబోయిన టీడీపీ అడ్డంగా బుక్కయ్యింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అడ్డుకోగా.. ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15వ డివిజన్‌లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు.
విజయవాడలో ప్రలోభాల పర్వం
విజయవాడలో పలుచోట్ల పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రలోభాలకు తెరలేపారు. 8వ డివిజన్‌లో టీడీపీ కార్యకర్తపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త దాడి చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. వాస్తవానికి ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారి ప్రలోభాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త అడ్డుకోవడంతో దుష్ప్రచారానికి తెరతీశారు. అనంతపురంలోని 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోగా.. వారితో టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూదన్‌ను దుర్భాషలాడారు. ప్రకాశం జిల్లా అద్దంకి 20వ వార్డులో టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లా గుత్తిలోని 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి సునీల్ తరఫున ఆ పార్టీ నాయకుడు శ్రీనివాసులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
విశాఖలో టీడీపీ ఓవరాక్షన్
ఎమ్మెల్యే వెలగపూడి హల్‌చల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరపాలక సంస్థలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఏయూ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిబంధనల మేరకు కేంద్రానికి 100 మీటర్ల దూరంలో తన వాహనాన్ని నిలిపి కారులోనే ఉన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం కారులో నేరుగా పోలింగ్ కేంద్రం గేటు వద్దకు వచ్చి ఓటర్లు వద్దకు వెళ్లారు. దీనిపై స్థానికులతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెలగపూడిని బయటకు తీసుకొచ్చారు. స్థానికులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల డిమాండ్‌తో వెలగపూడిని అరెస్ట్ చేశారు.
పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు హల్‌చల్ చేశారు. గోపాలపట్నం పోలింగ్ బూత్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నేతలు చోడవరం ప్రాంతం నుంచి కొందర్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయారు. నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం 300 మంది ఓటు వేసినట్లుగా అనుమానం వ్యక్తం చేసిన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేకే రాజు 10, 11 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment