
సాక్షి, కర్నూలు: దళిత న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాయుడుని దారుణంగా హత్య చేయడాన్ని ఎమ్మెల్యే శిల్ప రవీంద్ర కిషోర్ ఖండిస్తూ.. టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టీడీపీ నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే చంద్రబాబు ఈరోజు దళిత న్యాయవాది టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైతే ఎక్కడున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాలలో చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు.
ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది హత్య కేసుపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి హత్య కుట్ర వెనక ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. సుబ్బరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మనోహర్ గౌడ్ భూమా కుటుంబానికి ఆర్థికంగా, రాజకీయంగా నమ్మిన బంటు అన్నారు. ఈ హత్యకు భూమా కుటుంబం ఆజ్యం పోసిందనేది ప్రజలందరూ గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment