ముగ్గురి ఉసురుతీసిన కుటుంబ కలహాలు...
గద్వాల: మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలకు తోడు ఇరుగు పొరుగు వారి సూటి మాటలు భరించలేని ఓ తండ్రి తన ముగ్గురు ఆడ పిల్లలకు విషమిచ్చి తానూ తీసుకున్నాడు. ఈ ఘటనలో కురుమన్న (35), కురుమక్క (9), ఇందు (5) మృతి చెందగా, మరో కుమార్తె మణెమ్మ (7) పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా గద్వాల పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
కురుమన్న(35) ప్లాస్టిక్ బిందెల వ్యాపారం చేస్తూ పట్టణంలోని రెండో రైల్వే గేటు వద్ద ఉంటున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. అయితే, భార్య సరిగా ఇంటి పట్టున ఉండకపోవడం, దానిపై ఇరుగు పొరుగు వారు చేసే వ్యాఖ్యలతో అతడు మనోవేదన చెందాడు. శనివారం రాత్రి భార్య ఇంటిలో లేని సమయంలో తన పిల్లలు కురుమక్క(9), ఇందు(5), నాని(7)కి పురుగుల మందు ఇవ్వడంతో పాటు తానూ తాగాడు. వాంతులు అవుతుండడంతో వారిని బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కురుమన్న, కురుమక్క, ఇందు మృతి చెందారు. నానికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.