పింఛన్‌పై ఆందోళనతో వృద్ధుల హఠాన్మరణం
క్లాక్‌టవర్, అమరచింత : పింఛన్ రాలేదని స్థానిక కుమ్మరివాడకు చెందిన పోలేమోని కిష్టప్ప (80) అనే వృద్ధుడు బుధవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. వారం రోజుల కిందట పింఛన్ జాబితాలో పేరులేదని పగలూరాత్రి మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయం చుట్టు తిరిగితిరిగి వేసారిపోయాడు. చివరికి గురువారం తెల్లవారుజాము ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చెర్మన్ రాములుతోపాటు, పలువురు నేతలు పరామర్శించారు.
అలాగే ఆత్మకూర్ మండలం పాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కడ్మూర్ కురుమన్న (66) అనే వృద్ధుడు కూడా పింఛన్ రాలేదని మనస్తాపానికి గురై గురువారం ఉదయం హఠాన్మరణం పొందాడు. నాలుగు రోజుల నుంచి తన పింఛన్ కోసం ఆత్మకూరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. బుధవారం రాత్రినుంచి అస్వస్థతకు గురై ఇంట్లోనే గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్యతోపాటు ఐదుగురు కుమారులు ఉన్నారు.