పింఛన్ ఆగిపోయిందనే మనోవ్యధతో వృద్ధురాలి మృతి
దోమ: పింఛన్ రాలేదంటూ తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడ గ్రామానికి చెందిన హరిజన కిష్టమ్మ(67)కు గతంలో పింఛన్ వచ్చేది. ఇటీవల నిర్వహించిన ఆసరా పథకం సర్వేలో భాగంగా కిష్టమ్మ పేరును జాబితానుంచి తొలగించారు. దీంతో తనకు పింఛన్ పునరుద్ధరించాలంటూ ఆమె మండల కార్యాలయం, అధికారుల చుట్టూ తిరిగింది. అయినా ఫలితం లేకపోయింది.
తన తోటి వారికి పింఛన్ రావడం, తనకు రాకపోడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. సోమవారం రాత్రి కూడా ఈ విషయమై తీవ్ర మనస్తాపానికి గురైంది. అయితే అదే రాత్రి తనకు ఛాతిలో నొప్పిగా ఉందంటూ భర్త హరిజన్ చిన్న రామయ్యతో కిష్టమ్మ చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళుదామని కుటుంబీకులు ప్రయత్నిస్తుండగానే గుండెపోటుతో ఆమె మృతిచెందింది.
పింఛన్ రావడం లేదనే మనోవ్యథతోనే కిష్టమ్మ కన్నుమూసిందని కుటుంబీకులు తీవ్రంగా రోదించారు. మంగళవారం ఉదయం స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు మండల కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుండెపోటుతో మృతి చెందిన కిష్టమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.