
సాక్షి,సత్తుపల్లి(ఖమ్మం): బతికున్న వృద్ధురాలు చనిపోయినట్టుగా రికార్డుల్లో నమోదు చేయడంతో పింఛన్ నిలిచిపోయిన ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీలో వెలుగుచూసింది. పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి జాబితాను రూపొందించే క్రమంలో కొమ్మేపల్లికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు రఫీమోనిషా కూడా మృతి చెందిందని నమోదు చేసినట్లు తెలుస్తోంది. చనిపోయినా పింఛన్ పొందుతున్న వారి వివరాల పరిశీలనకు చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో పొరబాటు జరిగినట్లు సమాచారం.
గంగారంలో కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు నమోదు కాగా, మళ్లీ పొరబాటును సరిచేశారని తెలిసింది. అయితే కిష్టారం పంచాయతీలో సుమారు 20 మందికి పైగా చనిపోయినా పింఛన్ పొందినట్టు విచారణలో తేలడంతో కుటుంబీకుల నుంచి రికవరీ కోసం నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై సత్తుపల్లి ఎంపీడీఓ సుభాషిణిని సోమవారం వివరణ కోరగా రఫీమోనిషాకు ఒక నెల మాత్రమే పింఛన్ ఆగిందని.. సమగ్రంగా విచారించి పునరుద్ధరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment