బుధవారం కర్నూలు జిల్లా గూడూరులోని ఎస్‌బీఐ వద్ద నగదు తీసుకునేందుకు కిక్కిరిసిన ఖాతాదారులు...
ఇప్పటి దాకా 22 మంది మృతి
• క్యూలో నిల్చోలేక అస్వస్థత.. ఆపై గుండెపోటు
• అలసి సొమ్మసిల్లిన వందలాది మంది
• పెద్ద నోట్ల రద్దుతోనే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటున్న మృతుల కుటుంబ సభ్యులు
సాక్షి నెట్‌వర్క్
పెద్ద నోట్ల రద్దు పండుటాకుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పింఛన్ సొమ్ము తెచ్చుకునేందుకు వెళ్లి ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది వృద్ధులు పిట్టల్లా రాలిపోయారు. వీరిలో ముగ్గురు బుధవారం మృతి చెందారు. ఇన్నాళ్లూ పెద్దగా కష్టపడకుండానే చేతికందిన పింఛన్ సొమ్ము.. ఇపుడు చుక్కలు చూపిస్తోంది. నోట్ల రద్దుదెబ్బకు పింఛన్ సొమ్మును నగదుగా చేతికివ్వ లేక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దీంతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి, జమ అయిన డబ్బు తీసుకోవడానికి వెళ్లి తీవ్ర ఇక్కట్ల నడుమ తుది శ్వాస విడిచారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం తూంపాయనపల్లెకు చెందిన బి.రామన్నబోయుడు భార్య లక్షుమమ్మ(66) రెండేళ్లుగా సామాజిక పింఛన్ తీసుకుంటోంది. ఖాతా ప్రారంభించేందుకు 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. బుధవారం కుమారుడు సుబ్రమణ్యంతో కలసి బంగారుపాళెంలోని సిండికేట్ బ్యాంకు వద్దకు వచ్చింది. బ్యాంకు మెట్లు ఎక్కుతూ కళ్లు తిరిగి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదే రోజు గుంటూరు జిల్లా మాచర్లలోని రామాటాకీస్ లైనులో ఉన్న ఎస్‌బీఐలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి షేక్ మౌలాలి(73) నగదు కోసం క్యూలో నిల్చొని అస్వస్థతకు గురయ్యాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి డేరంగుల రంగయ్య (67) పింఛన్ కోసం బుధవారం నూనెపల్లె ఆంధ్ర బ్యాంకుకు వచ్చాడు. డబ్బు పొందలేక దిగాలుగా వెళుతూ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లగానే అస్వస్థతకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ‘నో క్యాష్’ బోర్డు పెట్టడంతో గత నెల 25వ తేదీన బాలరాజు(68) అనే వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అంతకు ముందు మూడు రోజులుగా ఇతను డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామానికి చెందిన కనకమేడల విజయలక్ష్మి (71) రూ.500 నోట్లు మార్చుకునేందుకు నవంబర్ 25వ తేదీన ఉయ్యూరులోని ఎస్‌బీఐ వద్దకు వచ్చి గుండెపోటుతో మృతి చెందింది.
గత నెల16న చిత్తూరులో రత్న పిళ్లై (62)అనే రిటైర్డు ఉపాధ్యాయులు ఇండియన్ బ్యాంకు వద్ద కిందపడి మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ అడ్డతీగల మండలం వేటమామిడి సమీపాన పణుకురాతిపాలేనికి చెందిన మామిడిలక్ష్మి(72) ఈ నెల 6వ తేదీన పింఛన్ కోసం వస్తూ కన్నేరువాగులో పడి మృతి చెందింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఆంధ్రాబ్యాంకు వద్ద ఫిరంగిపురంకు చెందిన రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్ పూలంకి ఇన్నయ్య (63) గతనెల 15వ తేదీన నగదు కోసం క్యూలో నిల్చొని గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంత’కు చెందిన ముగ్గురు..
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పూజారితండాకు చెందిన లక్ష్మీబాయి (65) ఈ నెల ఐదో తేదీన పింఛన్ కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ధర్మవరం పట్టణంలోని తేరువీధికి చెందిన కె.లక్ష్మినారాయణ (68) నవంబర్ 15న హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో నగదు కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో మృతి చెందాడు. రాయదుర్గం పట్టణంలోని ముచ్చిగవీధికి చెందిన ఎం.బసమ్మ (80) ఈనెల 7న ఎన్టీఆర్ భరోసా పింఛన్ బ్యాంకు ఖాతా ద్వారా అందలేదన్న బెంగతో చనిపోయింది. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగుంటపల్లెకు చెందిన నాగలింగప్ప ఈ నెల 7న పింఛన్ డబ్బులు తీసుకొనేందుకు బ్యాంకుకు వస్తూ ఆటో ఢీకొట్టడంతో మృతిచెందాడు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేటకు చెందిన మహాలక్ష్మమ్మ(70) గుండెపోటుతో మృతి చెందింది. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన ఎస్‌కె షరీఫ్(43) నెల్లూరు బారకాస్ ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేసేవారు. నవంబర్ 19వ తేదీన పనిఒత్తిడితో గుండెపోటుకు బలయ్యారు. నాయుడుపేట పట్టణానికి చెందిన నయనప్పగారి నారాయణరావు(63) ఈ నెల 2న పింఛన్ కోసం ఎస్‌బీఐ చుట్టూ తిరిగుతూ గుండెపోటుతో చనిపోయాడు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం బత్తివానిపాలెం గ్రామానికి చెందిన బత్తి పెదకొండడు(70) ఈనెల 7న పింఛను కోసం వచ్చి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
పింఛన్ రాలేదని తెలిసి..
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పాతవరక గ్రామానికి చెందిన ఖగో బెహరా (69) వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఇదే మండలంలోని బొరివంక గ్రామంలోని ఏపీజీవీబీకి వెళ్లారు. క్యూలైన్లో అతి కష్టంపై లోనికి వెళ్లాడు. పింఛన్ డబ్బులు రాలేదని చెప్పడంతో బ్యాంకు బయటకువచ్చి కుప్పకూలి చనిపోయాడు. వీరఘట్టం జనావీధికి చెందిన జన వీరమ్మ (85)కు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. కుటుంబ సభ్యులు స్థానిక స్టేట్‌బ్యాంకుకు వెళ్లి పింఛన్ డబ్బు గురించి ఆరా తీయగా.. సిబ్బంది రాలేదని చెప్పారు. ఆదే విషయాన్ని ఆమెకు చెప్పగా మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన చనిపోయింది.వీరఘట్టం పట్టణం బర్నాల వీధికి చెందిన గేదెల నారాయణమ్మ (93)కు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. కుటుంబ సభ్యులు స్థానిక స్టేట్‌బ్యాంకుకు వెళ్లి పింఛన్ డబ్బులు వచ్చాయో లేదా అని ఈ నెల 8న ఆరా తీయగా..రాలేది సిబ్బంది చెప్పారు. ఈ విషయం నారాయణమ్మ చెప్పగానే ఆమె మనస్తాపంతో చనిపోయింది.
⇔ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన కాకర్లమూడి రాములమ్మ (65)అనే వృద్ధురాలు ఈ నెల 1న పింఛను సొమ్ము కోసం కన్నాపురం ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లింది. గంటల తరబడి క్యూలో నిలబడినా పింఛను అందలేదు. ఇంటికి రాగానే అస్వస్థతకు గురై మృతి చెందింది. నిడదవోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బైనే ఏసేబు (75) పింఛను డబ్బు కోసం మూడు రోజులపాటు బ్యాంకు చుట్టూ తిరిగి.. ఈనెల 9న గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన బొర్రా వెంకట్రావు (65) పింఛను కోసం అదే గ్రామంలోని ఎస్‌బీఐ కియోస్క్ బ్రాంచ్ వద్ద క్యూలో నిలబడగా.. గుండెపోటు రావడంతో ఈనెల 13న కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మరణించాడు. పెద్ద నోట్ల రద్దు వల్లే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని ఆయా ప్రాంతాల్లో మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వందలాది మంది వృద్ధులు క్యూలో నిల్చోలేక అనారోగ్యం పాలయ్యారు.