314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో మెన్స్ క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. చైనాలోని హోంగ్జూలో నేపాల్- మంగోలియాతో బుధవారం తొలి టీ20 మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 19, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుట్ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్ మల్లా దిగగానే సీన్ రివర్స్ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ
34 బంతుల్లోనే శతకం బాదిన అతడు.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో ఏకంగా 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కుశాల్, దీపేంద్ర ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన నేపాల్ 314 పరుగులు స్కోరు చేసింది.
ప్రపంచ రికార్డులు బద్దలు
తద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. తద్వారా అఫ్గనిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది.
సిక్సర్ల జట్టుగా
ఇక ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మరో అరుదైన ఘనత కూడా ఖాతాలో వేసుకుంది నేపాల్ క్రికెట్ జట్టు. టీ20 ఫార్మాట్ హిస్టరీలో సింగిల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్‌గా నిలిచింది. నేపాల్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 26 సిక్స్‌లు బాదగా.. గతంలో అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ మీద 22 సిక్స్‌లు కొట్టింది.
సంచలన విజయం
మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!