ఇచ్చిన మాట కోసమే నటించడం మానేశా!
బాలనటిగా అరంగేట్రం... కథానాయికగా అయిదు భాషల్లో పేరు ప్రతిష్ఠలు... మహామహుల కాంబినేషన్లో సినిమాలు... హీరో కాంతారావుకు హిట్ పెయిర్... ముగ్గురు ముఖ్యమంత్రులతో నటించిన ఘనత... విదేశాల్లో నృత్య ప్రదర్శనలు...ఇన్ని మలుపులు... ఇన్నిన్ని మెరుపులు రాజశ్రీకే సొంతం. నటిగా ఆమెకిది వజ్రోత్సవ సంవత్సరం. తిరుగులేని స్టార్డమ్ చూసిన ఈ తెలుగింటి ఆడపడుచు చెన్నైలో స్థిరపడ్డారు. చాలా ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉన్న ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ...
మీరేంటి... చాలాకాలంగా సినిమాలకు దూరంగా?
అవును. సినిమాలకు దూరమై దాదాపు 33 ఏళ్లు అయ్యింది పెళ్లి తర్వాత నేనసలు ఇటు వైపే రాలేదు. అసలు నేను ఎక్కడున్నానో పరిశ్రమలో చాలా మందికి తెలీదు. వాళ్లు దాదాపు నన్ను మరిచిపోయారు. బయట జనంలో తిరిగినా, ఎవ్వరూ నన్ను గుర్తు పట్టేవారు కాదు.
కథానాయికగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే సినిమా పరిశ్రమ నుంచి రిటైర్ కావడం ఎలా అనిపించింది?
మా వారిది రాజకీయ రంగం. మా ఇంట్లో ఎప్పుడూ రాజకీయాలు, ఎన్నికల టాపిక్లే. ఎప్పుడైనా సినిమాలకు తీసుకెళ్తుండేవారు. కానీ జనాలు గుర్తు పట్టేసి ఇబ్బందిగా అనిపించేది. మా పెళ్లయిన కొత్తలో ‘ప్రేమించి చూడు’ సినిమాకి వెళ్లాం. ఇంటర్వెల్లో నన్ను జనాలు గుర్తు పట్టేసి, నా చుట్టూ మూగిపోయారు. మావారు వెళ్లిపోదా మంటారు. నేను బలవంతంగా ఆపాను. తర్వాత నుంచి సెకండ్ షోలకు మాత్రమే వెళ్లేవాళ్లం. సినిమా ప్రపంచానికి దూరమైన తొలిరోజుల్లో దూరదర్శన్ నాకు టైమ్‌పాస్. సినిమా వాళ్లు కనపడితే ప్రాణం లేచి వచ్చేది. బాబు పుట్టాక వాడే లోకమయ్యాడు.
మీది ప్రేమ వివాహమా?
కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. మావారి పేరు తోట పాంచజన్యం. ఆయనది చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్లది గుంటూరు దగ్గర పురుషోత్తమ పట్నం. మా బావగారు తోట లక్ష్మయ్యగారు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. మా వారు జలగం వెంగళరావు గారి టైమ్‌లో చీఫ్ విప్‌గా పనిచేశారు. మా వారు తొలుత వేరే కథానాయికను చేసుకుందామనుకుని, తర్వాత నన్ను చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటించవద్దని ముందే షరతు విధించారు. నేను కూడా ఒప్పుకున్నా. 1973లో మా అమ్మ చనిపోయాక నేను కూడా సినిమాలు చేయడం తగ్గించేశాను.
పెళ్లయ్యాక ఆయనతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయాను. 1977 నుంచి నేను పూర్తిగా సినిమాలకు దూరంగా జరిగిపోయా. 1983లో ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆయన పోయాకా ఇచ్చిన మాట మీదే నిలబడ్డా.మాకు ఒక్కడే కొడుకు. నాగ శేషాద్రి శ్రీనివాస్. వాడి చదువు కోసం హైదరాబాద్, వైజాగ్ల్లో ఉండి, తర్వాత చెన్నై వచ్చేశాం. వాడిప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చెన్నైలో నేను, మా అక్క ఉంటాం. అప్పుడప్పుడూ అమెరికా వెళ్లి వస్తుంటాను.
ఇకపై మీరు నటించరా?
సీరియల్స్ చేయమని అడుగుతున్నారు. ఆసక్తి లేదు.
గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసుకున్నానని ఫీల్ కాలేదా?
ఎప్పుడూ లేదు. మా బాబు పుట్టాక నేను పూర్తిగా ఆ ప్రపంచం గురించి ఆలోచించడం మానేశాను. మా అబ్బాయే నా ప్రపంచం అయిపోయాడు. మా బాబు 20 ఏళ్ల వయసులో అమెరికాలో డిగ్రీ చదవడానికి వెళ్లిన ప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. మా అక్క, నేను టీవీ పెట్టుకుని అలా చూస్తూ కూర్చుండే వాళ్లం. ఇంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఉండేవాళ్లం. అన్ని తలుపులకీ తాళాలు వేసుకుని అలా ఇంట్లోనే ఉండేవాళ్లం. అలా చాలా జీవితం గడిచిపోయింది.
మరి మీ గురించి బయటి ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది?
ఓసారి యాదృచ్ఛికంగా జయలలిత గారిని కలిశా. ఇద్దరం చాలాసేపు పాత విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 2004లో ఎమ్జీఆర్ అవార్డు ఇస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది. ఆ ఫంక్షన్లోనే నా గురించి మళ్లీ అందరికీ తెలిసింది.
మీ సొంత ఊరు వైజాగ్ కదూ!
అవును. కానీ, అక్కడ ఉన్నది తక్కువ. మా నాన్న గారు ఎం. సూర్యనారాయణరెడ్డి రైల్వేలో స్టేషన్ మాస్టర్. అందుకే, విజయవాడ, ఏలూరుల్లో ఎక్కువ పెరిగాను. అమ్మ పేరు లలితాదేవి. నాకో అక్క. పేరు నిర్మలాదేవి. తనకీ నాకూ 20 ఏళ్ల గ్యాప్. ఆమెకి ఇప్పుడు 90 ఏళ్లు. మా అక్కకి పెళ్లయ్యి ఇద్దరు కొడుకులు పుట్టాక, నేను పుట్టాను. అందుకే వాళ్లని నేను బ్రదర్స్ అనే పిలుస్తాను.
అసలు మీరు సినిమా ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు?
అదంతా ఓ పెద్ద కథ. అక్క వాళ్ల అత్తయ్యగారికి ఆరోగ్యం బాగోకపోతే అనుకోకుండా మేమంతా మద్రాసు వచ్చేశాం. అప్పటికే నాన్న చనిపోయారు. నన్ను మద్రాసులోని కేసరి హైస్కూల్లో చేర్పించారు. ఇప్పటి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అప్పట్లో స్కూల్లో నాకు సీనియర్. అల్లు రామలింగయ్యగారు, జమునగారు, చలం గారు, కృష్ణకుమారి వీళ్లంతా మా వీధిలోనే ఉండేవాళ్లు. జమున గారింట ఏటా జరిగే బొమ్మల కొలువుకి నేను వెళ్తుండే దాన్ని.
ఊహించని విధంగా 1955లో ‘నాగుల చవితి’ (1956లో విడుదలైంది)లో చిన్నప్పటి జమునగా అవకాశం వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయి. సరదాగా బంధువులతో కలిసి ఏవీయమ్ స్టూడియోకి వెళ్తే, ఏవీయమ్ చెట్టియార్కి నేను నచ్చి, ఈ వేషం ఇచ్చారు. తర్వాత ఏవీయమ్ వారు నన్ను స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకుని స్టూడియోలోనే నాట్యం, డైలాగ్ కోచింగ్ ఇచ్చారు. వాళ్లు తీసిన సినిమాల్లో చిన్నా చితకా వేషాలు వేశాను.
‘మహామంత్రి తిమ్మరుసు’లో చిన్నవేషం వేసినట్లున్నారు...
అప్పటికి నేను హీరోయిన్ను కాలేదు. నాది చిన్న వయసు. అందులో నాది సోది చెప్పే అమ్మాయి పాత్ర. మాంగల్యం, నిత్య కల్యాణం - పచ్చతోరణం, శబరి, ఇంద్రజిత్, సతీ సులోచన’... ఇలా చాలా సినిమాల్లో నావి చిన్న చిన్న వేషాలే. ‘శబరి’లో సీతగా కనిపిస్తా. ‘సతీ సులోచన’లో కాంతారావు శ్రీరామునిగానూ, నేను సీతగానూ చేశాం. అప్పట్లో నేను కాంతారావు గారిని ‘అన్నయ్యా’ అని పిలిచేదాన్ని. ఎక్కువ ఆయనకు చెల్లెలి పాత్రలు చేసేదాన్ని కదా. హీరోయిన్గా చేసినప్పుడు కూడా ‘అన్నయ్యా’ అని పిలు స్తుంటే, ‘అలా పిలవకు ఇప్పుడు... సీన్ మూడ్ పాడవుతుంది’ అనేవారు. ఆ తర్వాత ‘ఏవండీ’ అని పిలవడం మొదలుపెట్టా.
హీరోయిన్గా ఛాన్సెప్పుడొచ్చింది?
గౌరీ ఫిలివ్ు్స అధినేత భావనారాయణగారు ‘తోటలో పిల్ల - కోటలో రాణి’ (1964)లో హీరోయిన్గా తొలి అవకాశం ఇచ్చారు. అందులో కాంతా రావుగారు హీరో. ‘‘నా పక్కన చెల్లెలి వేషాలు వేసింది. హీరోయిన్గా బావుంటుందా?’’ అని కాంతారావుగారన్నారట. భావ నారాయణగారు మాత్రం ఏం ఫరవాలేదన్నారట! ఆ తర్వాత విఠలాచార్య ‘అగ్గి పిడుగు’లో ఛాన్సిచ్చారు.
మీ అసలు పేరును ‘రాజశ్రీ’గా మార్చింది ఎవరు?
నా అసలు పేరు - కుసుమకుమారి. తమిళ దర్శక, నిర్మాత ఆర్.ఆర్. చంద్రన్ మార్చారు. అప్పట్లో కుసుమకుమారి పేరుతో మరో తమిళతార ఉండేది. శ్రీ, రా... ఇలా కొన్ని అక్షరాలు చెప్పి వాటితో మొదలయ్యే పేరు పెట్టుకోమంటే, ‘రాజశ్రీ’ అని పెట్టుకున్నా.
దక్షిణాదిలో అప్పటి టాప్ స్టార్సందరితో నటించారు...
దక్షిణాదిలోనే కాదు, హిందీలో కూడా టాప్‌స్టార్స్‌తో మూడు సినిమాలు చేశాను. ‘ప్యార్ కియే జా’, ‘పాయల్ కీ ఝంకార్’, ‘నసీహత్’. తమిళ ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమానే శ్రీధర్‌గారు హిందీలో ‘ప్యార్ కియే జా’గా తీశారు. కిశోర్ కుమార్ హీరో. ‘పాయల్ కీ ఝంకార్’లో శశికపూర్ హీరో. ఈ రెండు సినిమాల షూటింగ్స్ మద్రాసులోనే జరిగాయి. ‘నసీహత్’ మాత్రం పూర్తి బొంబాయి సినిమా. దారాసింగ్ హీరో.
మరెందుకని బాలీవుడ్‌పై శ్రద్ధ చూపలేదు?
అప్పట్లో నా కెరీర్ నిర్ణయాలన్నీ అక్క తీసుకునేది. తను ఎలా చెబితే, నేనలా చేసేదాన్నంతే. చిన్నా పెద్దా చూసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశమూ అక్క ఒప్పేసు కునేది. ఇక్కడ పెద్ద హీరోలతో అవకాశం వచ్చిన ప్పుడు, నేను ఎక్కడో మలయాళంలో చేస్తుండేదాన్ని. దాంతో వేరే హీరోయిన్ని పెట్టేసుకునేవారు. అలా తమిళ, హిందీల్లో చాలా మిస్సయిపోయాయి.
విదేశాల్లో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చినట్టున్నారు?
అవును. చిన్నతనంలో నరసింహారావు మాస్టారి దగ్గర నాట్యం అభ్యసించాను. ఏవీయమ్ వారి సినిమాలకు పని చేసే దండాయుధ పాణిగారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నా. అది సినిమాలకు చాలా ఉపయోగపడింది. ‘కోవలన్ కన్మణి’ అనే తమిళ సినిమాలో కరుణానిధి గారితో నటించా. అది పూర్తిగా డాన్స్ కేరెక్టర్. నాకు చాలా పేరొచ్చింది. నేను సినిమా రంగం నుంచి విరమించే ముందు మలయాళ నటీ నటులతో కలిసి విదేశాల్లో అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. 1977లో నటనతో పాటు నృత్యాన్నీ వదిలేశా.
ఆర్టిస్టుగా మీరు హ్యాపీయేనా? అసంతృప్తులున్నాయా?
ఎలాంటి అసంతృప్తులూ లేవు. మనిషి ఎంతో సాధించినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఏదైనా ఈ వయసులో ఇంకా ఏం చేయగలం. అయినా అప్పటి ఫీల్డ్ వేరు. ఇప్పటి ఫీల్డ్ వేరు. సీనియర్లని ఇప్పటి పరిశ్రమ గుర్తు పెట్టుకోవడంలేదు. అదొక్కటే బాధ. అదే తమిళ పరిశ్రమ వాళ్లయితే బాగా గౌరవిస్తారు. మొన్న వందేళ్ల భారతీయ సినిమా ఫంక్షన్‌కి కూడా పిలిచి సత్కరించారు.
తెలుగు నాట జరిగిన 75 ఏళ్ల వేడుకకు పిలిచారా?
లేదు. అదే నా బాధ. కృష్ణ కుమారిగారి తర్వాత జానపద సినిమాలు ఎక్కువ చేసింది నేనే. పిలిచి చిన్న సత్కారం కూడా చేయలేదు. ఏం చేసినా బతికుండగా చేయాలి. చనిపోయాక వాళ్ల పేరు పెట్టి అవార్డు ఇస్తే లాభమేంటి?
⇒ నేను చేసిన చిత్రాలు సుమారు 200 వరకు ఉంటాయి. కాంతారావుగారితో, ఎన్టీఆర్ గారితో ఎక్కువ నటించా. శోభన్‌బాబు, హరనాథ్, రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు... ఇలా అందరు హీరోల పక్కనా చేశాను. ఏయన్నార్ గారితో మాత్రం ‘ప్రేమించి చూడు, గోవుల గోపన్న, ఆత్మగౌరవం’ చేయగలిగా. వచ్చిన ప్రతి సినిమా చేసేయడంతో చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయగలిగాను.
⇒ తమిళంలో 50 సినిమాల వరకూ చేశాను. ‘కాదలిక్క నేరమిల్లై’ (1965) నా తొలి సినిమా. శివాజీ గణేశన్, ఎమ్జీఆర్, జెమినీ గణేశన్, రవిచంద్రన్, జయశంకర్, ముత్తు రామన్... ఇలా అక్కడి అగ్రనటులు అందరితో నటించాను.
⇒ కన్నడంలో సుమారు 30 సినిమాలు చేశా. రాజ్‌కుమార్, ఉదయ్ కుమార్, కల్యాణ్ కుమార్, శ్రీనాథ్ లాంటి హేమాహేమీల పక్కన నటించా. కన్నడంలో నా తొలి సినిమానే రాజ్ కుమార్‌తో చేశాను. ‘కంతెర దనోడు’లో ఆయన చెల్లెలిగా కనిపిస్తా. ప్రసిద్ధ దర్శకులు బీఆర్ పంతులు, బి.ఎస్.రంగా, పుట్టణ్ణ గారి సినిమాల్లో నటించే అదృష్టం దక్కింది.
⇒ మలయాళంలో మధు, సత్యన్, ప్రేమ్ నజీర్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. అక్కడి వాళ్లకి రాజశ్రీ అంటే తెలీదు. గ్రేసీ అంటేనే గుర్తు పడతారు. నా తొలి మలయాళ సినిమాలో నా పాత్ర పేరు అది. అప్పట్లో నా పేరుని అలాగే ప్రచారం చేయడంతో అదే పాపులరైంది.
హిందీలో కూడా టాప్‌స్టార్స్‌తో మూడు సినిమాలు చేశా. కిశోర్‌కుమార్‌తో ‘ప్యార్ కియే జా’, శశికపూర్‌తో‘పాయల్ కీ ఝంకార్’, దారా సింగ్‌తో ‘నసీహత్’ చేశా. మూడూ మంచి పేరు తెచ్చాయి.
- పులగం చిన్నారాయణ