ఇసుక క్వారీలపై అధికారుల ఆకస్మిక దాడులు
వర్ధన్నపేట టౌన్ : ఇన్నాళ్లు ఆకేరువాగు ఒడ్డున యథేచ్ఛగా ఇసుక క్వారీలను నిర్వహిస్తున్న వారిని చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు బుధవారం ఏడు క్వారీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు ఆధ్వర్యంలో వరంగల్, హన్మకొండ, రాయపర్తి తహసీల్దార్లు రాజ్‌కుమార్, రవి, మూర్తితోపాటు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ, రాయపర్తి, జఫర్గడ్ ఎస్సైలు శ్రీధర్, సంపత్, ప్రొబేషనరీ ఎస్సై వెంకటకృష్ణ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు ఒడ్డున గాడిపెల్లి రాజేశ్వర్‌రావుకు చెందిన యంత్రసామగ్రి సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇల్లంద శివారులో కమ్మగోని ప్రభాకర్, సోల్తి రాజబాబు, సోల్తి రాంబాబు, సోల్తి ఉప్పలయ్య, తాళ్లపెల్లి సాంబరాజు ఇసుక క్వారీలు నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను విక్రయిస్తున్నారని వర్ధన్నపేట తహసీల్దార్ కనకయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏడుగురిపై దొంగతనం కేసు నమోదు చేశారు. దాడులు జరుగుతున్నపుడు చిక్కిన మూడు ట్రాక్టర్ల ను సీజ్ చేసి, యజమానులపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.