మరో మూడు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్: ఎండ వేడిమికి అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణతాపం తగ్గు ముఖం పట్టింది. మార్చి నుంచే మొదలైన భానుడి భగభగలు ఇప్పడిప్పుడే కాస్త తగ్గుతున్నాయి. ఏపీ తెలంగాణలో గత మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటమే ఇందుకు కారణం. ఈ ద్రోణి ప్రభావం మరో మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ' కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణ అంతటా క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో గంటకు వంద కిలో మీటర్ల వరకూ ఈదురు గాలులు వీస్తాయి. ఓ మోస్తారు వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. ఏపీలో కన్నా తెలంగాణలోనే క్యుములోనింబస్ మేఘాలు బలంగా ఉన్నాయి. అందువల్లే మధ్యాహ్నం తర్వాత ఎక్కువ జిల్లాల్లో గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ ప్రభావం వల్లే రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది' అని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.