L V Prasad
-
ఎల్వీ ప్రసాద్‌గారు ఎందరికో స్ఫూర్తి
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ ఆయన రాణించారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అందుకే ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. గతాన్ని ఎవరూ మర్చిపోకూడదు. భావి తరాలకు చెప్పాలి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్(ఎల్వీ ప్రసాద్) 111వ జయంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ– ‘‘నన్ను అందరూ సీతమ్మ అని పిలుస్తున్నారంటే కారణం పెద్దాయన ఎన్టీఆర్‌గారే. ‘సీతారామకల్యాణం’ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇల్లాలు’. అప్పట్లో ఎల్వీ ప్రసాద్‌గారి మెప్పు పొందాను’’ అన్నారు. ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నకి సినిమా తప్ప మరేమీ తెలియదు. నన్ను నటుణ్ని చేయాలన్నది ఆయన కోరిక. అయితే ఓ సారి ‘సంసారం’ సినిమా షూటింగ్లో అంత సేపు స్టూడియోలో కూర్చోవడం ఇష్టం లేక ఆయన్ని విసిగించాను. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తిలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను’’ అన్నారు. ‘‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్... ఇద్దరూ మహావృక్షాలు. తాము సంపాదించినదాన్ని సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు రమేష్ ప్రసాద్‌గారు ఓ మంచి బయోపిక్ తీయాలి’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. -
‘మహానటి’లో కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్..!
టాలీవుడ్ తెలుగు ప్రేక్షకుల దాహాన్ని ఈ వేసవిలో తీరుస్తోంది. వరుసగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్ ప్రేక్షకుల మనసులను గెల్చుకుంటున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్యలు స్టార్ హీరోల సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్స్‌ఫీస్ రికార్డులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు మరొక సినిమాపై ఉంది. ఆ చిత్రమే ‘మహానటి’. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తరాలకు చాలా దగ్గరైన నటి సావిత్రి. ఒక హీరోయిన్ ఇంత మందికి దగ్గరవ్వడం, అభిమానాన్ని సంపాదించడం, ఇంతటి ఉన్నత స్థానాన్ని అందుకోవటం ఒక్క సావిత్రికే చెల్లింది. ఇంకా సినిమాపై అంచనాలను పెంచేట్టుగా రోజుకో పోస్టర్‌ను, ఒక్కో పాత్రధారునికి సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సావిత్రి జీవితం ఎంతో మంది దిగ్గజాలతో ముడిపడి ఉంటుంది. ఎల్వీ ప్రసాద్, ఎస్వీ రంగారావు, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా మహామహుల గురించి కూడా ప్రస్థావించాల్సి ఉంటుంది. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు, ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే. తాజాగా కేవీరెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రలకు సంబంధించిన ప్రోమో వీడియోలను మహానటి చిత్ర బృంధం విడుదల చేసింది. నాని వాయిస్ఓవర్ ఇస్తూ రిలీజ్చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంట్లోనే ఉండి షూటింగ్ తీసేసి, ప్రపంచంలో ఏ మూలో తీశామని ప్రేక్షకులను నమ్మించవచ్చు. గ్రాఫిక్స్ , విజువల్ఎఫెక్ట్స్ అంటూ సినిమా రూపురేఖలనే మార్చేశాయి. మరి ఇవేవి లేని ఆ కాలంలోనే మాయాబజార్ అంటూ సినిమా తీసి నిజంగానే మాయ చేసేశాడు కేవీ రెడ్డి. తెలుగు సినిమా గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో మాయాబజార్ గురించి చెప్పుకోవాల్సిందే. మాయాబజార్‌ను తీసిన విధానం, కథనం, పాండవులే లేని మహాభారతాన్ని ఒక్క మాయాబజార్లో చూడగలం. అది కేవీ రెడ్డికే సాధ్యమైంది. అంతటి మేధావి కేవీ రెడ్డి పాత్రను ఈ తరంలో ఎవరు ఉన్నారు అన్న ప్రశ్నకు.. సమాధానం మహానటి డైరెక్టర్ నాగ్అశ్విన్ ఇచ్చేశాడు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ .. కేవీ రెడ్డి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు రిలీజైన ప్రోమోలో క్రిష్ అచ్చం కేవీ రెడ్డిలానే ఉన్నాడు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన మహానుభావుడు ఎల్వీ ప్రసాద్. మొదటి తరం హీరో, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్నింట్లో తన సత్తా చాటుకున్నారు ఎల్వీ ప్రసాద్. ఎన్టీఆర్, సావిత్రిని వెండితెరకు పరిచయం చేశారు. మిస్సమ్మగా సావిత్రిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలాంటి మహానుభావుడి పాత్రను ఈ తరం యువ కథానాయకుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పోషించారు. నాని వాయిస్ఓవర్ ఇస్తూ విడుదల చేసిన రెండు ప్రోమోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
నేడు తెలుగు సినిమా పుట్టినరోజు
మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట టాకీ వేళ్లూనుకోవడానికి ఈ సినిమానే శ్రీకారం చుట్టింది. అందుకే ఈ చిత్రం విడుదలైన రోజుని తెలుగు సినీ ప్రియులందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నిన్న మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి, ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు 1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సంపాదించారు. మొత్తం 9,762 అడుగుల నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా సగర్వంగా ప్రకటించుకున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్లో తొలుత విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి. హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సురభి నాటక కళాకారులే అధిక పాత్రలు పోషించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాబాయి, మాస్టర్ కృష్ణారావు, ఎల్వీ ప్రసాద్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రధారులు. ‘తెలుగు సినిమా పుట్టినరోజు’ని ప్రతి ఏటా పరిశ్రమ ఓ వేడుకగా ఘనంగా నిర్వహిస్తే బావుంటుంది.