‘మహానటి’లో కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌..! | Srinivas Avasarala As LV Prasad And Krish As KV Reddy In Mahanati | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 11:19 AM | Last Updated on Sun, May 6 2018 11:28 AM

Srinivas Avasarala As LV Prasad And Krish As KV Reddy In Mahanati - Sakshi

టాలీవుడ్‌ తెలుగు ప్రేక్షకుల దాహాన్ని ఈ వేసవిలో తీరుస్తోంది. వరుసగా పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ ప్రేక్షకుల మనసులను గెల్చుకుంటున్నాయి. రంగస్థలం, భరత్‌ అనే నేను, నా పేరు సూర్యలు స్టార్‌ హీరోల సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్‌ హంగులను కూడా జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్స్‌ఫీస్‌ రికార్డులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు మరొక సినిమాపై ఉంది. ఆ చిత్రమే ‘మహానటి’. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

రెండు తరాలకు చాలా దగ్గరైన నటి సావిత్రి. ఒక హీరోయిన్‌ ఇంత మందికి దగ్గరవ్వడం, అభిమానాన్ని సంపాదించడం, ఇంతటి ఉన్నత స్థానాన్ని అందుకోవటం ఒక్క సావిత్రికే చెల్లింది. ఇంకా సినిమాపై అంచనాలను పెంచేట్టుగా రోజుకో పోస్టర్‌ను, ఒక్కో పాత్రధారునికి సంబంధించిన లుక్స్‌ను రిలీజ్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. సావిత్రి జీవితం ఎంతో మంది దిగ్గజాలతో ముడిపడి ఉంటుంది. ఎల్వీ ప్రసాద్‌, ఎస్వీ రంగారావు, కేవీ రెడ్డి, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ఇలా మహామహుల గురించి కూడా ప్రస్థావించాల్సి ఉంటుంది. 

ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌ బాబు, ఏఎన్నార్‌ పాత్రలో నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే. తాజాగా కేవీరెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ పాత్రలకు సంబంధించిన ప్రోమో వీడియోలను మహానటి చిత్ర బృంధం విడుదల చేసింది. నాని వాయిస్‌ఓవర్‌ ఇస్తూ రిలీజ్‌చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంట్లోనే ఉండి షూటింగ్‌ తీసేసి, ప్రపంచంలో ఏ మూలో తీశామని ప్రేక్షకులను నమ్మించవచ్చు. గ్రాఫిక్స్‌ , విజువల్‌ఎఫెక్ట్స్ అంటూ సినిమా రూపురేఖలనే మార్చేశాయి. మరి ఇవేవి లేని ఆ కాలంలోనే మాయాబజార్‌ అంటూ సినిమా తీసి నిజంగానే మాయ చేసేశాడు కేవీ రెడ్డి.

తెలుగు సినిమా గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో మాయాబజార్‌ గురించి చెప్పుకోవాల్సిందే. మాయాబజార్‌ను తీసిన విధానం, కథనం, పాండవులే లేని మహాభారతాన్ని ఒక్క మాయాబజార్‌లో చూడగలం. అది కేవీ రెడ్డికే సాధ్యమైంది. అంతటి మేధావి కేవీ రెడ్డి పాత్రను ఈ తరంలో ఎవరు ఉన్నారు అన్న ప్రశ్నకు.. సమాధానం మహానటి డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ ఇచ్చేశాడు.  గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్‌ .. కేవీ రెడ్డి పాత్రలో అలరించనున్నారు. ఇప్పుడు రిలీజైన ప్రోమోలో క్రిష్‌ అచ్చం కేవీ రెడ్డిలానే ఉన్నాడు. 

తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన మహానుభావుడు ఎల్వీ ప్రసాద్‌. మొదటి తరం హీరో, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్నింట్లో తన సత్తా చాటుకున్నారు ఎల్వీ ప్రసాద్‌. ఎన్టీఆర్‌, సావిత్రిని వెండితెరకు పరిచయం చేశారు. మిస్సమ్మగా సావిత్రిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలాంటి మహానుభావుడి పాత్రను ఈ తరం యువ కథానాయకుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ పోషించారు. నాని వాయిస్‌ఓవర్‌ ఇస్తూ విడుదల చేసిన రెండు ప్రోమోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement