రోగులతో ఫుట్‌బాల్ వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులను అటూ ఇటూ తిప్పుతూ వారితో ఫుట్‌బాల్ ఆడొద్దు.. వారికి మెరుగైన వైద్య సేవలను అందించండి.. సిబ్బంది మధ్య దాగుడుమూతలను కట్టిపెట్టండి.. ప్రభుత్వ వైద్యాన్ని కాల ప్రవాహంలో కలిపేయకండి..ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. రాష్ర్ట విభజన తరువాత తొలిసారిగా ఆయన గురువారం జిల్లాకు వచ్చారు. తొలుత పాలకొండ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన వివిధ ఆస్పత్రుల వైద్యాధికారులతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియూ ఆస్పత్రులకు వచ్చే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేసే విధానంలో పూర్తిస్థారుులో మార్పులు తీసుకురావాలన్నారు. రిఫర్ చేసేముందు అందుకు కారణాలు, పూర్తిస్థారుు వివరాలు, అప్పటి వరకూ జరిగిన వైద్యసేవలు, పూర్తిస్థాయి కేస్ స్టడీని పొందుపరచాలని స్పష్టం చేశారు.
గతంతో ఆస్పత్రుల వ్యవస్థలు వేర్వేరుగా ఉండేవన్నారు. ప్రస్తుతం కుటుంబ సంక్షేమం, వైద్యవిధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ తదితర వైద్య విభాగాలన్నీ ఒకే గూటికి చేరాయని..దీనివల్ల అన్ని ఆస్పత్రుల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఇక నుంచి ప్రతి నెలా జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. తొలిసారిగా పాలకొండ ఆస్పత్రిని పరిశీ లించానని, వచ్చేనెలలో టెక్కలి డివిజన్లో, ఆ తరువాత శ్రీకాకుళంలో పర్యవేక్షణ చేస్తానని వెల్లడించారు. వైద్య సేవలు మెరుగుపడాలన్నారు. జిల్లా ఆధికారులు ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించమని హెచ్చరించారు. శాఖల మధ్య దాగుడూ మూతలు కట్టిపెట్టాలని, మరోసారి వచ్చేసరికి మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యుల కొరత నివారించేందుకు చర్య తీసుకుం టామని చెప్పారు. శాఖాధిపతులు, ఎస్పీహెచ్వోలు ఆయా పరిధిలోని వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి రిఫరల్ విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.
అన్నిస్థారుుల అధికారుల్లో జవాబుదారీత నం పెరగాలన్నారు. ఉద్యోగం చేస్తున్నంతకాలం నిబంధనలకు కట్టుబడి పని చేయాలన్నారు. ఎస్పీహెచ్వోలు సమీక్షలు, తనిఖీలు నిర్వహించాలని, రోజువారీ వైద్యం తో పాటుగా క్షయ, ఎయిడ్స్, సీజనల్ వ్యాధులపై నివేదికలు తయారు చేయాలని, పతినెలా నివేదికలు జిల్లా వైద్యాధికారికి అందజేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌లో 13వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చుల వివరాల వినియోగత ధ్రువపత్రాలు అందజేయాలని కోరారు. సకాలంలో నిధులు ఖర్చు చేయకపోతే తిరిగి వెళ్లిపోతాయనే విషయూన్ని గమనించాలన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జిల్లాలోని ఆస్పత్రుల పరిస్థితులను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గీతాంజలి నిధుల విని యోగాన్ని వివరించారు. సమావేశంలో జిల్లా వైద్యశాలల సమన్వాయాధికారిణి సునీల, రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ పాల్గొన్నారు.
రిమ్స్, ఐటీడీఏ ఉద్యోగుల వినతులు
వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యాన్ని రిమ్స్‌లో కాంట్రాక్టు విధానంతో పనిచేస్తున్న వివిధ విభాగాల ప్రొఫెసర్లు కలిశారు. కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలని, ఆరున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను అక్రమంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని..దీన్ని విరమించుకోవాలని కోరారు. ఆయన్ని కలిసిన వారిలో వాసవీ భవానీ, వినోద్, ప్రభాకర్, పట్నాయక్, రూప తదితరులున్నారు. అలాగే ఐటీడీపీలో 2012లో నియమింపబడిన 45 మంది హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగులు 15 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని, రెన్యూవల్ చేయాలని లక్ష్మీ నారాయణ, శంకరరావు, లక్ష్మణరావు, ఆనందరావు తదితరులు కోరారు.
‘వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు’
పాలకొండ: స్థానిక వంద పడకల ఆస్పత్రిలో వైద్యుల తీరుపై వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీస సేవలు అందించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలు, కావాల్సిన అవసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంటిలేటర్లు అందజేయాలని, సర్జికల్ మందులు కొనుగోలుకు నిధులు కేటాయించాలని, మత్తు వైద్యులను నియమించాలని కోరారు.
వీటిపై స్పందించిన ఆయన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురాకుండా ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. వైద్యుల తీరు సక్రమంగా లేకపోవడంతో సేవ చేయాలనే తపన ఉన్న ఐదుగురితో కమిటీ నియమిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా అభివృద్ధికి ఈ కమిటీ దోహదపడేలా చేయాలన్నారు. అనుమతులు లేకుండా నర్సింగ్ హోమ్ నిర్మించడంపై స్త్రీ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ భారతిని ప్రశ్నించారు. వైద్యుల క్లీనిక్‌ల నిర్వహణపై ఆరా తీశారు. కనీసం రోగులకు రిఫర్ చేయకుండా ఆస్పత్రుల్లో సేవ చేయలేరా అంటూ నిలదీశారు. జ్వరంతో చేరిన వారిని కూడా రిఫర్ చేయడం అలవాటు చేసుకున్నారని, ఈ పద్ధతిని వీడాలని మందలించారు.