కార్మిక గళం మూగబోయింది
కోల్‌కతా: భారత కార్మికోద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని స్వగృహంలో గురువారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, గురుదాస్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గురుదాస్ ఐదుసార్లు పార్లమెంటుసభ్యుడిగా ఉన్నారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటులో ఆయన ఆవేశపూరిత ఉపన్యాసాలు కొన్నిసార్లు పార్టీ సైద్ధాంతిక సరిహద్దులను చెరిపేసేవి.
యాంగ్రీ యంగ్ మాన్
‘యాంగ్రీ యంగ్ మాన్’గా పేరున్న గురుదాస్ దాస్ గుప్తా 1936 నవంబర్ 3న అవిభాజ్య బెంగాల్‌లోని బరిషాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో పుట్టారు. విభజన అనంతరం ఈయన కుటుంబం పశ్చిమబెంగాల్‌కి మారింది. 50వ దశకం చివరల్లో వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆయన విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవిభాజ్య బెంగాల్ విద్యార్థి ఫెడరేషన్‌కి అ«ధ్యక్షుడిగానూ, కార్యదర్శిగా పనిచేశారు. కొన్ని సందర్భాల్లో రహస్య జీవితంలోకి వెళ్లారు.
1964 కమ్యూనిస్టు పార్టీ చీలికతో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించాక సీపీఐలో గురుదాస్ ఉండిపోయారు. 70వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాలరీత్యా కార్మికరంగ బాధ్యతలు చేపట్టారు. 2001లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి గురుదాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. కార్మికవర్గ సమస్యల పరిష్కారానికై జీవితమంతా పోరాడి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు.
రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మాజీ ప్రధాని వాజ్‌పేయితోనూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోనూ, పలువురు కాంగ్రెస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇటు పార్లమెంటులోనూ, అటు కార్మికవర్గంలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గురుదాస్ గుప్తా లేని లోటు కార్మికలోకానికి తీరని నష్టమన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గురుదాస్ దాస్‌గుప్తా∙మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు.
సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, రాజకీయాల్లో ఆయన విలువలకు ప్రతీకగా నిలిచారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.