Labor money
-
రెక్కలకష్టం ఆపేశారు
♦ కూలి డబ్బులకు లక్షన్నర మంది ఎదురుచూపు ♦ రూ.26 కోట్లు బకాయిపడిన సర్కారు ♦ నిధుల ఆలస్యంతో ఉపాధి పనులపై ప్రభావం ♦ పనులకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గుముఖం గత నెల 29న ఉపాధి పనులకు 1.03 లక్షల మంది హాజరుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 75 వేలకు పడిపోయింది. నిధుల నిలిపివేతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో యంత్రాంగం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది.జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంది. బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లోనే బకాయిలు అధికం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కరువు కరాళ నృత్యంతో బతుకు బరువై.. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు డబ్బులివ్వకుండా సర్కారు పొట్టకొడుతోంది. ఎనిమిది వారాలుగా సుమారు లక్షన్నర మంది కూలీల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు రూ.26 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో జిల్లాలో ఈజీఎస్ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బకాయిలు పెరిగిపోవడంతో ఉపాధికి వచ్చే కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. దీంతో రైతులు కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు. ఈ క్రమంలో పనిదినాలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.06 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే ఈ సంఖ్య దాటిపోయింది. ఈ పనిదినాలను విశ్లేషిస్తే జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయవచ్చు. ఈ మండలాల్లో అధికం..! ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రబీ పంటల సాగు పడిపోయింది. దీంతో వ్యవసాయ కూలీలు సైతం ఉపాధి బాట పట్టారు. ఈ క్రమంలోనే జిల్లాలో రికార్డు స్థాయిలో పని దినాలు నమోదయ్యాయి. వ్యవసాయాధారిత ప్రాంతాలైన బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లో ఈజీఎస్ పనులు ముమ్మరంగా సాగాయి. అదే సమయంలో జిల్లాకు బకాయిపడిన రూ.26 కోట్లలో సింహభాగం ఇక్కడే చెల్లించాల్సివుంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా యాజ మాన్య సంస్థ (డ్వామా) 52,704 మందికి వంద రోజుల పనిదినాలను కల్పించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 2.89 లక్షల మంది జాబ్కార్డుదారుల్లో ఇప్పటివరకు 2.30 లక్షల మందికి ఉపాధి చూపించారు. రెండు నెలలుగా కూలి డబ్బుల్లేవు రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులివ్వలేదు. ఎట్టా బతకాలె. ఉపాధి పనులు చేసి పస్తులుండాల్సిన దుస్థితి. మాకు ఎనిమిది వారాలకు పైగా చేసిన పనులకు కూలి డబ్బులు రావాలి. ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకునేవారు లేరు. - మడ్డి యాదమ్మ, నక్కర్తమేడిపల్లి, యాచారం రెండు నెలలుగా ఇయ్యట్లే.. ఉపాధి హామీ పథకంలో రెండు నెలలు పనిచేసినం. ఇప్పటి వరకు కూలి డబ్బులు ఇయ్యలె. అసలే కరువు ఉంది.. ఈ యేడు ఎక్కడ కూడా పంటలు వెయ్యలె. కూలి చేయడం తప్ప వేరే బతుకుదెరువు లేదు. చేసిన పనులకు కూలి ఇవ్వండని ఎన్ని రోజులు అధికారుల సుట్టు తిరగాలె. వారం వారం ఇస్తామన్నారు.. ఎక్కడిస్తున్నారు? - చౌట వెంకటయ్య, అంతారం, కుల్కచర్ల మండలం ఎవ్వరూ పట్టించుకుంటలేరు.. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆరు వారాల కంటే ఎక్కువే అయింది. ప్రతి సోమవారం ప్రజాదర్బారులో అడుగుతున్నాం. ఉపాది సిబ్బంది తీరు బాగా లేదు. ఇలాగైతే ఎలా.. పెద్ద సార్లు పట్టించుకొని తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించాలె. - ఆంజనేయులు, మాలసోమారం, బంట్వారం మండలం -
కూలీల ఖాతాల్లోకే ‘ఉపాధి’ డబ్బు
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనులకు సంబంధించిన కూలీ డబ్బులను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని మరింత మెరుగ్గా, పారదర్శకంగా అమలు చేసేందుకు, ఈ ప్రక్రియలో రాష్ట్రాలకు మరింత సాధికారత కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉపాధి హామీ నిధులు మొదట రాష్ట్రాల ఉపాధి హామీ నిధికి, అక్కడి నుంచి కార్మికుల ఖాత్లాలోకి పే ఆర్డర్ విడుదలైన మర్నాడే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. కాగా, న్యాయవాదుల స్థాయి నుంచి హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందినవారికి పెన్షన్ ప్రయోజనాల్లో తేడాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఇతర ఇతర నిర్ణయాలు.. * మధ్యవర్తిత్వ చట్ట సవరణలకు ఉద్దేశిం చిన ప్రతిపాదనకు ఆమోదం. 18 నెలల్లో గా కేసులను పరిష్కరించాలనే ప్రతిపాదనను ఇందులో పొందుపర్చారు. * డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ‘సెంటర్ ఫర్ వరల్డ్ నేచురల్ హెరిటేజ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఆసియా- పసిఫిక్ రీజియన్’ను ఏర్పాటు చేసేందుకు యునెస్కోతో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనకు అంగీకారం. -
పుష్కరాల్లో ఈదేదెలా
- గజ ఈతగాళ్లకు అందని కూలి సొమ్ము - పడవలు తెచ్చి మరీ విధులు నిర్వర్తిస్తున్న మత్స్యకారులు - జిల్లాలో రూ.99.61 లక్షల బకాయిలు కొవ్వూరు : పుష్కరాల సందర్భంగా భక్తులు స్నానాలు చేసే సమయంలో ప్రమాదంబారిన పడితే రక్షించేందుకు ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లకు ఇప్పటి వరకు కూలి సొమ్ము చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళితే వచ్చే ఆదాయం కంటే కూలి తక్కువైనా అధికారుల మాటకు విలువనిచ్చి విధులు నిర్వహిస్తున్నామని, కనీసం అల్పాహారం కూడా సక్రమంగా అందజేయడం లేదని వారు వాపోతున్నారు. 2 వేల ఈతగాళ్లు.. 700 పడవలు జిల్లావ్యాప్తంగా ఉన్న 97 స్నానఘట్టాల్లో 2 వేల మంది గజఈతగాళ్లు, 700 పడవలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం మత్య్సశాఖకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. గజ ఈతగాళ్లకు రోజుకి రూ.449, పడవకి రూ.700 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకి రూ.14.23 లక్షల చొప్పున గడిచిన వారం రోజులకు రూ. 99.61 లక్షలు బకాయిలు చెల్లించాలి. నాలుగు రోజులకోసారి కూలి సొమ్ము చెల్లిస్తామని అధికారులు ముందుగా హామీ ఇచ్చారు. జిల్లాలో ఏ గ్రేడు 14 స్నానఘట్టాల్లో ఒక్కో షిఫ్ట్‌కి 12 మంది, 54 బి గ్రేడ్ స్నానఘట్టాల్లో షిఫ్ట్‌కి 8 మంది చొప్పున రోజుకి మూడు షిఫ్టులకు, సి గ్రేడ్‌లో ఉన్న 29 స్నాన ఘట్టాల్లోనూ, మరో 15 చోట్ల ఏర్పాటైన తాత్కాలిక స్నాన ఘట్టాల్లో వీరంతా విధులు నిర్వర్తిస్తూ పుష్కర భక్తులకు సేవలందిస్తున్నారు. అంతేకాకుండా నదిలో భక్తులు విడిచిపెట్టిన పువ్వులు, పూజా ద్రవ్యాలు నెట్ వలలతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ నది కాలుష్యంలో చిక్కుకోకుండా కాపాడుతున్నారు. గతంలోనూ ఇంతే 2003 పుష్కర సమయంలో కూడా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో విధులు నిర్వహించిన మత్స్యకారులకు సగం సొమ్ములు ఇవ్వకపోవడంతో గజఈతగాళ్లు ఆందోళనకు దిగారు. కూలి సొమ్ములు, పడవల అద్దె కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగామని వాడబలిజ సంఘం అధ్యక్షుడు పరిమెళ్ల నాగరాజు గుర్తు చేశారు. అడ్వాన్సులు అందిస్తాం పుష్కర విధుల్లో ఉండడం వల్ల సకాలంలో కూలి డబ్బులు, పడవలకు అద్దె చెల్లించలేకపోయాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ అడ్వాన్సులు చెల్లిస్తాం. పుష్కరాలు ముగిసిన వెంటనే మిగిలిన సొమ్ము చెల్లిస్తాం. - ఎస్కే.లాల్ మహ్మద్, ఇన్చార్జ్ డెప్యూటీ డెరైక్టర్ మత్య్సశాఖ -
‘ఉపాధి’ డబ్బు ఏమైంది..?
మంచాలః మంచాల మండలంలో ఉపాధిహామీ పథకం పనితీరు కంచె చేను మేసిన చందంగా తయారైంది. కూలీల కు అందాల్సిన డబ్బు మాయం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి,రెండు కాదు...లక్షలాది రూపాయలు నేటికీ కూలీలకు అందక వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మంచాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 983 శ్రమ శక్తి సంఘాలు ఉన్నాయి. 20,778 మంది కూలీలు వీటిలో నమోదై ఉన్నారు. ఇందులో లోయపల్లిలో 1200 మంది కూలీలు ఉన్నారు. వారందరూ ఈ పథకం కింద పని చేశారు. పనిచేసి ఏడాదైనా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. అధికారులు సైతం కూలీలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోయపల్లిలోనే ఈ ఏడాది ఆగస్టు 14వరకు కోటి 19లక్షల35వేల268 రూపాయలు పని జరిగింది.వాటిలో 55శాతం మాత్రమే కూలి డబ్బులు వచ్చాయి. మిగిలిన 45శాతం కూలీలకు కూలి డబ్బులు రాలేదు. వస్తాయోరావో కూడా తెలియక కూలీ లు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా లోయపల్లిలోనే 2013 జూన్ వరకు కూలీలకు రూ.26,07,243ల కూలి డ బ్బులు రావాల్సి ఉంది. అంతలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. దీంతో కూలీల డబ్బును సంబంధితాధికారులు వాపసు తీసుకెళ్లారు. గ్రామా ల్లో ఎక్కడా సక్రమంగా తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల డబ్బులు పంపిణీ వ్యవహారం యాక్సిస్ బ్యాంకు నుండి మణిపాల్ బ్యాంకుకు మారింది. ఈ క్రమంలోనే కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు మాయమయ్యాయి. ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది అందినకాడికి చేజి క్కించుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ గ్రామస్తులు ఈ డబ్బుల వ్యవహారం లో యాక్సిస్ బ్యాంకు వారిని నిలదీ యగా తాము ఇచ్చామని 26 పే ఆర్డర్ల తో పాటు ఎఫ్టీఓ నంబర్లు కూడా ఇచ్చారు. కానీ వాటికి సంబంధించిన డ బ్బులు కూలీలకు అందలేదు. కూలీలు నేటికీ కూలి డబ్బుల కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో కూలీలకు ఎనిమిది నుండి పది వేల రూపాయల వరకు కూలి డబ్బులు రావాల్సి ఉంది. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. చివరకు ప్లేస్ల్విప్పుల జిరాక్స్ తీసి అధికారులకు అందజేశారు. డబ్బు మాయంపై విచారణ జరిపించి కూలీ లకు రావాల్సిన కూలిని తక్షణం చెల్లిం చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఏపీఓ వీరాంజనేయులును వివరణ కోరగా రూ. 10లక్షల వ రకు కూలీలకు కూలి డబ్బు రావాల్సి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈనెల 25న గ్రామానికి వెళ్లి పూర్తి స్థా యిలో విచారణ చేసి అందరికీ డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.