పుష్కరాల్లో ఈదేదెలా | Gaja swimmer's preposterous wages Money | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో ఈదేదెలా

Published Tue, Jul 21 2015 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

పుష్కరాల్లో ఈదేదెలా

పుష్కరాల్లో ఈదేదెలా

- గజ ఈతగాళ్లకు అందని కూలి సొమ్ము
- పడవలు తెచ్చి మరీ విధులు నిర్వర్తిస్తున్న మత్స్యకారులు
- జిల్లాలో రూ.99.61 లక్షల బకాయిలు
కొవ్వూరు :
పుష్కరాల సందర్భంగా భక్తులు స్నానాలు చేసే సమయంలో ప్రమాదంబారిన పడితే రక్షించేందుకు ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లకు ఇప్పటి వరకు కూలి సొమ్ము చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళితే వచ్చే ఆదాయం కంటే కూలి తక్కువైనా అధికారుల మాటకు విలువనిచ్చి విధులు నిర్వహిస్తున్నామని, కనీసం అల్పాహారం కూడా సక్రమంగా అందజేయడం లేదని వారు వాపోతున్నారు.
 
2 వేల ఈతగాళ్లు.. 700 పడవలు
జిల్లావ్యాప్తంగా ఉన్న 97 స్నానఘట్టాల్లో 2 వేల మంది గజఈతగాళ్లు, 700 పడవలను ఏర్పాటు చేశారు.  ఇందుకోసం ప్రభుత్వం మత్య్సశాఖకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. గజ ఈతగాళ్లకు రోజుకి రూ.449, పడవకి రూ.700 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకి రూ.14.23 లక్షల చొప్పున గడిచిన వారం రోజులకు రూ. 99.61 లక్షలు బకాయిలు చెల్లించాలి.

నాలుగు రోజులకోసారి కూలి సొమ్ము చెల్లిస్తామని అధికారులు ముందుగా హామీ ఇచ్చారు. జిల్లాలో ఏ గ్రేడు 14 స్నానఘట్టాల్లో ఒక్కో షిఫ్ట్‌కి 12 మంది, 54 బి గ్రేడ్ స్నానఘట్టాల్లో షిఫ్ట్‌కి 8 మంది చొప్పున  రోజుకి మూడు షిఫ్టులకు, సి గ్రేడ్‌లో ఉన్న 29 స్నాన ఘట్టాల్లోనూ, మరో 15 చోట్ల   ఏర్పాటైన తాత్కాలిక స్నాన ఘట్టాల్లో వీరంతా విధులు నిర్వర్తిస్తూ పుష్కర భక్తులకు సేవలందిస్తున్నారు. అంతేకాకుండా నదిలో భక్తులు విడిచిపెట్టిన పువ్వులు, పూజా ద్రవ్యాలు నెట్ వలలతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ నది కాలుష్యంలో చిక్కుకోకుండా కాపాడుతున్నారు.
 
గతంలోనూ ఇంతే
2003 పుష్కర సమయంలో కూడా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో విధులు నిర్వహించిన మత్స్యకారులకు సగం సొమ్ములు ఇవ్వకపోవడంతో గజఈతగాళ్లు ఆందోళనకు దిగారు. కూలి సొమ్ములు, పడవల అద్దె కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగామని వాడబలిజ సంఘం అధ్యక్షుడు పరిమెళ్ల నాగరాజు గుర్తు చేశారు.
 
అడ్వాన్సులు అందిస్తాం
పుష్కర విధుల్లో ఉండడం వల్ల సకాలంలో కూలి డబ్బులు, పడవలకు అద్దె చెల్లించలేకపోయాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ అడ్వాన్సులు చెల్లిస్తాం. పుష్కరాలు ముగిసిన వెంటనే మిగిలిన సొమ్ము చెల్లిస్తాం.
- ఎస్‌కే.లాల్ మహ్మద్, ఇన్‌చార్జ్ డెప్యూటీ డెరైక్టర్ మత్య్సశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement