మిషన్లలో ప్రాణాలు హరీ
యంత్రాలు (మిషన్) ఉత్పత్తికే కాదు మానవుల ప్రాణాలు తీయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పని ప్రదేశాల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో కార్మికులకు భద్రతా కరువైంది. కార్మిక శాఖ నిబంధనలు ఉన్నా బేఖాతరు చేస్తూ కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు వ్యాపారులు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి.గాలిలో దీపంలా కార్మికుల ప్రాణాలు అసంఘటితరంగ కార్మికులకు రక్షణ శూన్యం తరచు ప్రమాదాల బారిన కష్టజీవులు పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు, పోలీసులు మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం
పరిగి : ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులు కార్మికుల జీవితాలను కాటేస్తున్నాయి. అసంఘటిత కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక్క పరిగి మండలంలోనే భగీరథకు సంబంధించి పనుల్లో ఇప్పటివరకు 4 సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు జిల్లావాసులు బలయ్యారు. పని ప్రదేశంలో హక్కులు కానరావు. కార్మికుల రోదనలు అరణ్యరోదనలే. స్టీల్ కంపెనీలు, మిషన్ భగీరథ పనులు, పౌల్ట్రీ ఫాంలు, రోడ్డు నిర్మాణ పనులు, ఇటుక తయారీ బట్టీలు ఇలా పని చేసే చోటేదైనా.. కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు కార్మికుల హక్కులు కాలరాస్తూనే ఉన్నాయి కార్మికులు తరచూ మత్యువాత పడుతున్నా.. వారికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇవ్వకున్నా.. పనిప్రదేశంలో వేధింపులకు గురిచేసినా.. పట్టించుకునే వారు లేరు. తరచూ కార్మికుల మృతితో అసంఘటిత కార్మికుల్లో కలకలం రేపుతోంది.
కార్మిక అధికారులు, పోలీసులు పని ప్రదేశాల్లో మత్యువాత పడుతున్న అసంఘటిత కార్మికుల్లో అక్కడక్కడ స్థానికులు ఉంటున్నప్పటికీ.. ఎక్కువ శాతం ఉత్తారాది రాష్ట్రాల వారే ఉంటున్నారు. స్థానికంగా పరిచయాలు లేకపోవడంతో.. అధికారులు పట్టించుకోకపోవడంతో పని ప్రదేశంలో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు చోటుచేసుకుంటే గుట్టుచప్పడు కాకుండా మృతదేహాలను తరలించి యాజమాన్యాలు, కంపెనీలు చేతులు దులుపేసుకుంటున్నాయి. కార్మికులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పని ప్రదేశంలో కార్మికులు మత్యువాతపడినా.. వైకల్యం పొందినా.. వారికి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా.. కూలీ డబ్బులు ఎగ్గొట్టినా.. కార్మిక శాఖ పర్యవేక్షణ లేదు. పోలీసులు ప్రమాదాలు జరిగినప్పుడు కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లకు, కంపెనీ యాజమాన్యాలకే వంత పాడుతున్నారు.
నాలుగు ఘటనలు పని ప్రదేశంలో మృత్యువాత పడడం.. వికలత్వం రావడం తరచు జరుగుతున్నాయి. చాలా కేసులు ఉంటున్నా వీటిల్లో చాలా తక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క మిషన్ భగీరథ పనుల్లోనే ఇటీవల నాలుగు ఘటనలు చోటుచేసుకున్నాయి. గత అక్టోబర్‌లో కాళ్లాపూర్ సమీపంలో మిషన్ భగీరథ పనుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు దిలీప్‌సింగ్ మృతిచెందాడు. తాజాగా గత బుధవారం జాపర్‌పల్లిలో కార్మికుడు జిగార్ అలీ మృతిచెందాడు. వీరిద్దరు రాత్రి సమయంలోనే పనులు చేస్తూ మృతి చెందారు. తొండపల్లి సమీపంలో ఒకరు, సయ్యద్ మల్కాపూర్ సమీపంలో ఒకరు మిషన్ భగీరథ పనుల్లో వినియోగించే క్రేన్ తగలడంతో మృత్యువాత పడ్డారు. పరిగి, పూడూరు మండలాల పరిధిలో ఉన్న స్టీల్ కంపెనీల్లోనూ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై కార్మిక శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.