సౌదీలో విస్తృతంగా తనిఖీలు
సాక్షి, సిటీబ్యూరో: సౌదీ ఆరేబియాలో నూతన కార్మిక చట్టం నతాఖా గడువు ముగియడంతో సోమవారం నుంచి లేబర్ అధికారులు ముమ్మర తనిఖీలు మొదలుపెట్టారు. దేశంలోని ప్రధాన పట్టణాలైన ధమామ్, రియాద్, జిద్దా, ఆయిల్, తైఫ్. ఆల్‌ఖుబర్ తదితర ప్రాంతాల్లో విసృ్తతంగా సోదాలు జరిపారు. సౌదీలో అక్రమంగా ఉంటున్నవారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్ధమవడంతో రాష్ట్రంలోని బాధిత కుంటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రత్యేక నిష్ర్కమణ కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. అరెస్టుల కార్యక్రమాన్ని దశల వారిగా దీర్ఘకాలికంగా కొనసాగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి రోజు రోడ్లపై పికెటింగ్ నిర్వహించి కనిపించిన వారి గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు తదితర పత్రాలను పరిశీలించారు. తొలిరోజు పెద్దగా అరెస్టులు లేనప్పటికీ కార్మికుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది.
మూడు దశల్లో తనిఖీలు
సౌదీ ప్రభుత్వం దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించేందుకు ప్రతి నగరంలో మూడు శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు అదేశాలు జారీ చేసింది. కార్మిక , పోలీసు, పాస్‌పోర్టు శాఖల సిబ్బందితో కూడిన కమిటీ ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ కమిటీ మూడు దశల్లో చర్యలు చేపట్టనుంది. తొలి దశలో పికెటింగ్ ద్వారా తనిఖీలు, పరిశీలన, రెండో దశలో కంపెనీల్లో తనిఖీలు, మూడో దశలో క్యాంపుల్లో సోదాలు నిర్వహించనుంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు కంపెనీలు, వ్యాపార సముదాయాలకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. కంపెనీ వీసాలు లేనివారికి తాత్కాలిక కార్మికులుగా ఉపాధి కల్పించ వద్దని, వెంటనే వారిని పనిలో నుంచి తొలగించాలని అదేశాలు జారీ చేశారు. ఒకవేళ నతాఖా చట్టానికి విరుద్ధంగా ఉపాధి కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కంపెనీ లెసైన్స్‌లను రద్దు చేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో ఆయా కంపెనీలు సోమవారం క్యాజువల్ కార్మికులను పనిలోకి రానివ్వలేదు. దీంతో కార్మికులు తమ నివాసాల నుంచి బయటికి రాకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.