pass ports
-
పాస్‌పోర్టులు స్వాధీనం
నిజామాబాద్ అర్బన్: విదేశాల నుంచి వచ్చి జిల్లాలో ఐసోలేషన్‌లో ఉంటున్న వారి పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం 235 మంది పాస్‌పోర్ట్‌లు తీసుకున్న రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు నాలుగు నెలల వరకు విదేశాలకు వెళ్లవద్దని వారికి సూచించారు. మరో 2,460 మంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. యువకుడికి అనుమానిత లక్షణాలు డిచ్పల్లి : డిచ్పల్లి మండలం నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నడిమితండాకు చెందిన యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు కన్పించాయి. అప్రమత్తమైన అధికారులు అతడిని వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి నుంచి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు వెళ్లగా యువకుడు జ్వరంతో ఉండి కరోనా లక్షణాలు కనిపించాయి. -
రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్టు మాయం
సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్ రెండవ కూతురు, దర్శకురాలు సౌందర్య, ఆమె భర్త విశాకన్ పాస్‌పోర్టు మాయమైంది. విశాకన్, సౌందర్యరజనీకాంత్ మూడు రోజుల కిందట ఎమరాల్డ్స్ విమానంలో చెన్నై నుంచి లండన్‌కు వెళ్లారు. లండన్‌లో విమానం దిగగానే సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్టు చూపించడానికి దాన్ని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా కనిపించలేదు. సూట్‌కేస్‌లో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లకు చెందిన పాస్‌పోర్టులు, సహా రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయట. దీంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్ విమానాశ్రయంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ అధికారులకు తమ పాస్‌పోర్టులను చూపకపోవడంతో ఆ అధికారులు వారిని విమానాశ్రయ విశ్రాంతి గదికి పంపారు. ఈ విషయం అక్కడి భారతీయ రాయబారులకు, నటుడు రజనీకాంత్‌కు తెలియజేశారు. తాత్కాలిక పాస్‌పోర్టులను ఏర్పాటు చేయయడంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లను లండన్ విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు పంపివేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
జపాన్ పాస్‌పోర్ట్.. మోస్ట్ పవర్ఫుల్
పాస్‌పోర్ట్‌కు పవర్ ఏంటి అనుకుంటున్నారా? పాస్‌పోర్ట్‌లకు కూడా పవర్ ఉంటుంది. అంటే.. పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా అవసరం లేని ప్రయాణాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో ఆ దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. ఆ ప్రాతిపదికన ప్రస్తుతం జపాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. జపాన్ దేశస్తులు వీసా అవసరం లేకుండా వెళ్లే 190వ దేశంగా మయన్మార్‌కు ఇటీవలే గుర్తింపు లభించింది. అంటే, జపాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 190 దేశాలకు వీసా లేకుండా కానీ, ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలోనే వీసా పొందే అవకాశంతో కానీ ప్రయాణం చేయొచ్చు. ఈ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ దేశాల జాబితాలో రెండో స్థానంలో 189 దేశాలతో సింగపూర్, మూడో స్థానంలో 188 దేశాలతో ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికాలు నిలిచాయి. మన భారత్ స్థానం ఏంటని ఆలోచిస్తున్నారా? మన పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా కానీ, వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా కానీ 59 దేశాలకు వెళ్లొచ్చు. అంటే పవర్ఫుల్ పాస్ పోర్ట్ ఉన్న దేశాల జాబితాలో మన స్థానం 76. ఈ మధ్యే 78 నుంచి 76వ స్థానానికి ఎదిగాం. అగ్రదేశాలైన అమెరికా లేదా బ్రిటన్ల పాస్‌పోర్ట్‌తో 186 దేశాలను వీసా లేకుండా చుట్టేయొచ్చు. ప్రస్తుతం ఈ దేశాల స్థానం ఐదు కాగా, 2015లో ఈ రెండే అగ్రస్థానంలో ఉన్నాయట. విశేషమేంటంటే.. ఈ రేసులో ముందంజలో ఉంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం 2006లో ఉన్న 62వ స్థానం నుంచి వేగంగా ముందంజ వేసి ఇప్పుడు 21వ స్థానానికి చేరింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ ర్యాంకింగ్‌లు రూపొందించింది. లాభాలేంటి? సాధారణంగా వీసా లేనిదే విదేశీ పర్యటనలు సాధ్యం కాదు. దాని కోసం డబ్బు కట్టి దరఖాస్తు చేసుకుని అవసరమైతే ఇంటర్వ్యూ, ఆపై ప్రాసెసింగ్ పూర్తయితే వీసా వస్తుంది. అలాంటి వీసా అవసరమే లేకుండా పాస్‌పోర్ట్‌తోనే విదేశీ పర్యటనలకు వెళ్లడం ఈజీ కదా. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో వీసా ఫ్రీ పర్యటనకు అవకాశం లభిస్తుంది. -
‘ఆరెంజ్ పాస్‌పోర్ట్’.. బీజేపీ వివక్షే: రాహుల్
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ చెక్ అవసరం ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణిని ఇది సూచిస్తోందని విమర్శించారు. ‘వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యలు బీజేపీ వివక్షాపూరిత ఆలోచన ధోరణిని సూచిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. -
ఒక వ్యక్తి...26 పాస్‌పోర్టులు
నిబంధనలకు విరుద్ధంగా 26 పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తిని కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. బుధవారం స్థానిక విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ పనపిల్ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను కేరళలోని కన్నూరు వాసిగా పేర్కొన్న అతను.. దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చానని విచారణలో వెల్లడించాడు. మంగళూరు నుంచి కన్నూరుకు వెళ్లి.. అక్కడి నుంచి మక్కాకు వెళ్లనున్నటు చెప్పాడు. అతని మాటలు, నడవడిక అనుమానాస్పదంగా ఉండడంతో లగేజీను సోదా చేశారు. 26 పాస్‌పోర్టులు లభ్యమయ్యాయి. అందులో రెండు అమెరికాకు చెందినవి కాగా, మిగిలిన 24 భారత దేశానికి చెందినవని అధికారులు గుర్తించారు. దీంతో అతన్ని భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీలో ఐఎస్ఐఎస్!
వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆధునిక టెక్నాలజీని అన్ని రకాలుగా వాడుకోవడంలో ముందుంటుంది. ప్రచారంలో సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న ఈ ఉగ్రవాదసంస్థ గురించి తాజాగా విస్మయ పరిచే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల కోసం తమ సభ్యులకు నకిలీ పాస్‌పోర్ట్‌లను సైతం ఐఎస్ఐఎస్ తయారు చేస్తుందని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇంటలిజెన్స్ విభాగం తెలిపింది. సిరియాలోని ప్రభుత్వ భవనాలను కొన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐస్ ఉగ్రవాదులు అక్కడి పౌరుల వివరాలను మొత్తం సేకరించారని, పాస్‌పోర్ట్ తయారీ యంత్రాలను, పాస్‌పోర్ట్ బ్లాంక్ పుస్తకాలను కూడా సమకూర్చుకున్నారని, తద్వారా సులభంగా పాస్‌పోర్ట్‌లను తయారు చేసుకోగలుగుతున్నారని నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే పలువురు నకిలీ పాస్‌పోర్ట్‌ల ద్వారా అమెరికాలోకి ప్రవేశించి ఉంటారనే అనుమానాన్ని ఎఫ్‌బీఐ వ్యక్తం చేస్తోంది. త్వరలోనే చిప్‌తో కూడినటువంటి పాస్‌పోర్ట్‌లను తయారు చేసి, నకిలీ సమాచారానికి తావు లేకుండా బయోమెట్రిక్ విధానం ద్వారా సమాచారాన్ని నిక్షిప్తం చేయాలనే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
పాస్‌పోర్ట్‌ల జారీలో జాతీయ రికార్డు
ఒక్క ఆగస్టులోనే హైదరాబాద్‌లో 84,852 పాస్‌పోర్ట్‌ల జారీ సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం జాతీయ రికార్డు నెలకొల్పింది. ఒక్క ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో 84,752 పాస్‌పోర్ట్‌లను జారీ చేసిన ఘనతను దక్కించుకుంది. దేశంలో 37 పాస్‌పోర్ట్ కార్యాలయాలంటే ఇప్పటివరకూ ఏ పాస్‌పోర్ట్ కార్యాలయం కూడా ఒకే నెలలో ఇన్ని పాస్‌పోర్ట్‌లను జారీ చేయలేదు. మార్చి నెలలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచే అత్యధికంగా 65,700 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. ఇప్పుడు 84,752 పాస్‌పోర్ట్‌లను జారీ చేసి తన రికార్డును తానే తిరగరాసుకుంది. ఎక్కువ పాస్‌పోర్ట్‌లను జారీ చేసేందుకు పాస్‌పోర్ట్ కార్యాలయ ఉద్యోగులు అదనపు గంటలు పనిచేశారని, సెలవు దినాలైన శని, ఆదివారాల్లోనూ పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ విభాగం అధికారి డా.ఎ.శిరీష్ తెలిపారు. జాతీయ రికార్డు సృష్టించినందుకు ఉద్యోగులను పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు అభినందించారు. దరఖాస్తుదారులకు మరింత మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది 7.5 లక్షలకుపైగా పాస్‌పోర్ట్‌ల జారీకి అవకాశముంది. ప్రస్తుతం ఈ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో 18 జిల్లాలున్నాయి. ఆరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. -
మలేసియాలో మనోళ్ల అగచాట్లు
ఉన్న ఊరిలో ఉపాధి దొరకక కన్నవారిని, కట్టుకున్న వారిని వదిలి పరాయి దేశం వెళ్లిన జిల్లావాసులు అక్కడ పడరాని పాట్లు పడుతున్నారు. కంపెనీ వీసాలని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ వారికి విజిటింగ్ వీసాలు అంటగట్టడంతో కొద్ది రోజులు పనులు చేసినవారు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పగటి పూట దొంగతనంగా కూలీ పనులు చేస్తూ.. రాత్రి పూట అడవుల్లో తలదాచుకుంటున్నారు. మలేసియా నుంచి కొందరు బాధితులు ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. కోనరావుపేట, న్యూస్‌లైన్ : కోనరావుపేట మండలం మరిమడ్ల, వెంకట్రావుపేట, కోనరావుపేట ప్రాంతాలకు చెందిన సుమారు 15 మంది మలేసియా నుంచి వచ్చిన ఓ ఏజెంట్‌కు రూ.80 వేల చొప్పున చెల్లించారు. కంపెనీలో ఉద్యోగం, మంచి జీతమని చెప్పిన ఏజెంట్ వారిని 2012 అక్టోబర్‌లో తీసుకెళ్లాడు. మలేసియాలో వారి పాస్‌పోర్టులు తీసుకుని కంపెనీలో వదిలేశాడు. రెండు నెలలు పనిచేసిన తర్వాత వీసాల గడువు ముగిసిందని చెప్పి కంపెనీ నుంచి వెళ్లగొట్టారు. బయటకు వచ్చిన వారు ఏదైనా పని చేసుకుందామంటే మలేసియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విజిటింగ్‌పై వచ్చిన వారు వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పాస్‌పోర్టు లేక వారు కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. గదుల్లో ఉంటే పోలీసులకు దొరుకుతామని భయపడి రాత్రిపూట సమీప అడవుల్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పోస్‌పోర్టు ఇవ్వని ఏజెంట్ మలేసియాలో చిక్కుకున్న యువకులు ఇటు రాలేక, అక్కడ ఉండలేక అవస్థలు పడుతున్నారు. పాస్‌పోర్టులు దగ్గర పెట్టుకున్న ఏజెంట్.. కంపెనీ వీసాల పేరుతో డబ్బులు తీసుకుని విజిట్ వీసాలు అంటగట్టి పాస్‌పోర్టులు ఇవ్వాలంటే ఇప్పుడు మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. బతకడానికే నానా అగచాట్లు పడుతున్న వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ప్రవాసాంధ్ర శాఖ వారు స్పందించి తమను విముక్తులను చేస్తే సొంతూరిలో ఏదో ఒక పని చేసుకుని బతుకుతామని కోనరావుపేటకు చెందిన దండు విజయ్, వెంకట్రావుపేటకు చెందిన మంతెన మల్లేశం, పల్లం రాము, లక్ష్మణ్, రాగెల్ల మనోజ్, కర్నాల రమేశ్, రామస్వామి, సతీశ్, సకినాల శ్రీనివాస్ వేడుకుంటున్నారు. -
సౌదీలో విస్తృతంగా తనిఖీలు
సాక్షి, సిటీబ్యూరో: సౌదీ ఆరేబియాలో నూతన కార్మిక చట్టం నతాఖా గడువు ముగియడంతో సోమవారం నుంచి లేబర్ అధికారులు ముమ్మర తనిఖీలు మొదలుపెట్టారు. దేశంలోని ప్రధాన పట్టణాలైన ధమామ్, రియాద్, జిద్దా, ఆయిల్, తైఫ్. ఆల్ఖుబర్ తదితర ప్రాంతాల్లో విసృ్తతంగా సోదాలు జరిపారు. సౌదీలో అక్రమంగా ఉంటున్నవారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్ధమవడంతో రాష్ట్రంలోని బాధిత కుంటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రత్యేక నిష్ర్కమణ కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. అరెస్టుల కార్యక్రమాన్ని దశల వారిగా దీర్ఘకాలికంగా కొనసాగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి రోజు రోడ్లపై పికెటింగ్ నిర్వహించి కనిపించిన వారి గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు తదితర పత్రాలను పరిశీలించారు. తొలిరోజు పెద్దగా అరెస్టులు లేనప్పటికీ కార్మికుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. మూడు దశల్లో తనిఖీలు సౌదీ ప్రభుత్వం దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించేందుకు ప్రతి నగరంలో మూడు శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు అదేశాలు జారీ చేసింది. కార్మిక , పోలీసు, పాస్‌పోర్టు శాఖల సిబ్బందితో కూడిన కమిటీ ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ కమిటీ మూడు దశల్లో చర్యలు చేపట్టనుంది. తొలి దశలో పికెటింగ్ ద్వారా తనిఖీలు, పరిశీలన, రెండో దశలో కంపెనీల్లో తనిఖీలు, మూడో దశలో క్యాంపుల్లో సోదాలు నిర్వహించనుంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు కంపెనీలు, వ్యాపార సముదాయాలకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. కంపెనీ వీసాలు లేనివారికి తాత్కాలిక కార్మికులుగా ఉపాధి కల్పించ వద్దని, వెంటనే వారిని పనిలో నుంచి తొలగించాలని అదేశాలు జారీ చేశారు. ఒకవేళ నతాఖా చట్టానికి విరుద్ధంగా ఉపాధి కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కంపెనీ లెసైన్స్‌లను రద్దు చేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో ఆయా కంపెనీలు సోమవారం క్యాజువల్ కార్మికులను పనిలోకి రానివ్వలేదు. దీంతో కార్మికులు తమ నివాసాల నుంచి బయటికి రాకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
పాస్‌పోర్టుకూ సమైక్య సెగ!
సాక్షి, విశాఖపట్నం: పాస్‌పోర్టుల జారీకీ సమైక్య సెగ తగులుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమండ్రి అర్బన్, ఉభయగోదావరి జిల్లాల వాసుల పాస్‌పోర్ట్ కార్యకలాపాలకు విశాఖలోనే కార్యాలయం ఉంది. బస్సుల బంద్ కారణంగా అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నా ఆన్లైన్ సేవలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని రకాల పాస్‌పోర్ట్ పనులకు సంబంధించి సమయం మించిపోతే ఆన్లైన్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. దీంతో వివిధ జిల్లాల నుంచి పాస్‌పోర్టు కోసం వస్తున్న అభ్యర్థులు మురళీనగర్‌లో ఉన్న పాస్‌పోర్ట్ సేవాకేంద్రం (పీఎస్కే), మర్రిపాలెం రైతు బజార్ వద్ద ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. పాస్‌పోర్ట్ కార్యాలయం వారానికి ఐదురోజులే పనిచేస్తుంది. ఇటీవల సమైక్యవాదులు కేంద్ర కార్యాలయాలనూ మూయించే ప్రయత్నం చేశారు. ఈ కారణంగా సిబ్బంది కొద్దిసేపు షట్టర్ దించేసి విధులు బహిష్కరించారు. సమ్మె సమయంలో పోలీస్ బందోబస్తు మధ్య విధులు నిర్వహిస్తున్నారు. సమైక్య ఆందోళన ఊపందుకుంటే పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పీఎస్కేలో నిత్యం సుమారు 700 లావాదేవీలు జరుగుతుంటాయి. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఉన్న అభ్యర్థులకు పెద్దగా ఇబ్బందుల్లేకున్నా మిస్‌లీనియన్ కార్యకలాపాలకు నష్టం వాటిల్లనుంది. స్పౌజ్ కోటాలో ఎవరికి పాస్‌పోర్ట్ కావాలన్నా మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది కూడా ఉద్యమంలో ఉండడంతో ఈ తరహా పాస్‌పోర్ట్‌లు పొందడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. కొత్త జంటకు పాస్‌పోర్ట్ కావాలన్నా సర్టిఫికెట్ కావాల్సి ఉన్నప్పటికీ ఎనెగ్జర్-టి నోటరీ రూపంలో అధికారులు భర్తీ చేస్తున్నారు. అత్యవసర కోటా కింద ఈ తరహా సర్టిఫికెట్లను కొన్ని చోట్ల ఐజీ స్థాయి పోలీస్ అధికారులు ఇస్తున్నారు. ఇక్కడా ఈ సౌకర్యం అమలు చేస్తే బావుంటుందని కోరుతున్నారు. పీసీసీకి మర్రిపాలెం కార్యాలయం పీఎస్కేలో ఒకేరోజు పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు, పాస్‌పోర్ట్‌ల కార్యకలాపాలకు డిమాండ్ ఉండడంతో రద్దీ ఏర్పడుతోంది. దీంతో ఇక పీసీసీ పత్రాల కోసం మర్రిపాలెంపాస్పోర్ట్ కార్యాలయంలోనే పొందాల్సి ఉంటుంది. ఉదయం 9నుంచి 11గంటల మధ్యే పీసీసీలు జారీ చేస్తున్నారు. పాస్‌పోర్ట్ జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పీసీసీ జారీకి పీఎస్కే మంచిదా..రద్దీని తట్టుకునేందుకు ప్రధాన కార్యాలయం అనువైనదా అన్న విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.