మలేసియాలో దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర వాసులు
ఉన్న ఊరిలో ఉపాధి దొరకక కన్నవారిని, కట్టుకున్న వారిని వదిలి పరాయి దేశం వెళ్లిన జిల్లావాసులు అక్కడ పడరాని పాట్లు పడుతున్నారు. కంపెనీ వీసాలని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ వారికి విజిటింగ్ వీసాలు అంటగట్టడంతో కొద్ది రోజులు పనులు చేసినవారు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పగటి పూట దొంగతనంగా కూలీ పనులు చేస్తూ.. రాత్రి పూట అడవుల్లో తలదాచుకుంటున్నారు. మలేసియా నుంచి కొందరు బాధితులు ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. వారి కథనం ప్రకారం..
కోనరావుపేట, న్యూస్‌లైన్ : కోనరావుపేట మండలం మరిమడ్ల, వెంకట్రావుపేట, కోనరావుపేట ప్రాంతాలకు చెందిన సుమారు 15 మంది మలేసియా నుంచి వచ్చిన ఓ ఏజెంట్‌కు రూ.80 వేల చొప్పున చెల్లించారు. కంపెనీలో ఉద్యోగం, మంచి జీతమని చెప్పిన ఏజెంట్ వారిని 2012 అక్టోబర్‌లో తీసుకెళ్లాడు. మలేసియాలో వారి పాస్‌పోర్టులు తీసుకుని కంపెనీలో వదిలేశాడు. రెండు నెలలు పనిచేసిన తర్వాత వీసాల గడువు ముగిసిందని చెప్పి కంపెనీ నుంచి వెళ్లగొట్టారు. బయటకు వచ్చిన వారు ఏదైనా పని చేసుకుందామంటే మలేసియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విజిటింగ్‌పై వచ్చిన వారు వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పాస్‌పోర్టు లేక వారు కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. గదుల్లో ఉంటే పోలీసులకు దొరుకుతామని భయపడి రాత్రిపూట సమీప అడవుల్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
పోస్‌పోర్టు ఇవ్వని ఏజెంట్
మలేసియాలో చిక్కుకున్న యువకులు ఇటు రాలేక, అక్కడ ఉండలేక అవస్థలు పడుతున్నారు. పాస్‌పోర్టులు దగ్గర పెట్టుకున్న ఏజెంట్.. కంపెనీ వీసాల పేరుతో డబ్బులు తీసుకుని విజిట్ వీసాలు అంటగట్టి పాస్‌పోర్టులు ఇవ్వాలంటే ఇప్పుడు మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. బతకడానికే నానా అగచాట్లు పడుతున్న వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ప్రవాసాంధ్ర శాఖ వారు స్పందించి తమను విముక్తులను చేస్తే సొంతూరిలో ఏదో ఒక పని చేసుకుని బతుకుతామని కోనరావుపేటకు చెందిన దండు విజయ్, వెంకట్రావుపేటకు చెందిన మంతెన మల్లేశం, పల్లం రాము, లక్ష్మణ్, రాగెల్ల మనోజ్, కర్నాల రమేశ్, రామస్వామి, సతీశ్, సకినాల శ్రీనివాస్ వేడుకుంటున్నారు.