చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత | Suspension Lifted On Chandrababu Naidu Former PS Pendyala Srinivas, Govt Issued Orders | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

Published Mon, Sep 9 2024 1:19 PM | Last Updated on Mon, Sep 9 2024 6:28 PM

Suspension Lifted On Chandrababu Former PS

సాక్షి, విజయవాడ: చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. పెండ్యాల శ్రీనివాస్‌ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు అవినీతి కేసుల్లో పలు ఆరోపణలు ఉన్న శ్రీనివాస్‌పై తదుపరి చర్యలు నిలిపేసి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

గత టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్‌’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో పెండ్యాల శ్రీనివాస్‌ విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్‌’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్‌ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసింది.

2014-19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్‌ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై  సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది.

నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు షెల్‌ కంపెనీల ప్రతినిధి మనోజ్‌ పార్థసాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement