నకిలీ పాస్పోర్ట్ల తయారీలో ఐఎస్ఐఎస్!
వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆధునిక టెక్నాలజీని అన్ని రకాలుగా వాడుకోవడంలో ముందుంటుంది. ప్రచారంలో సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న ఈ ఉగ్రవాదసంస్థ గురించి తాజాగా విస్మయ పరిచే వాస్తవాలు వెల్లడవుతున్నాయి.
ఉగ్రవాద కార్యకలాపాల కోసం తమ సభ్యులకు నకిలీ పాస్పోర్ట్లను సైతం ఐఎస్ఐఎస్ తయారు చేస్తుందని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇంటలిజెన్స్ విభాగం తెలిపింది. సిరియాలోని ప్రభుత్వ భవనాలను కొన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐస్ ఉగ్రవాదులు అక్కడి పౌరుల వివరాలను మొత్తం సేకరించారని, పాస్పోర్ట్ తయారీ యంత్రాలను, పాస్పోర్ట్ బ్లాంక్ పుస్తకాలను కూడా సమకూర్చుకున్నారని, తద్వారా సులభంగా పాస్పోర్ట్లను తయారు చేసుకోగలుగుతున్నారని నివేదికలో వెల్లడించింది.
ఇప్పటికే పలువురు నకిలీ పాస్పోర్ట్ల ద్వారా అమెరికాలోకి ప్రవేశించి ఉంటారనే అనుమానాన్ని ఎఫ్బీఐ వ్యక్తం చేస్తోంది. త్వరలోనే చిప్తో కూడినటువంటి పాస్పోర్ట్లను తయారు చేసి, నకిలీ సమాచారానికి తావు లేకుండా బయోమెట్రిక్ విధానం ద్వారా సమాచారాన్ని నిక్షిప్తం చేయాలనే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.