– ఆమె పీఏ రవికుమార్ సైతం నిందితుడిగా గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఇన్వాయిస్‌లతో కుట్ర పూరితంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు (అస్కీ) చెందిన రూ.88.91 లక్షలు స్వాహా చేసిన కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) శుక్రవారం మాజీ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మిని అరెస్టు చేసింది. ఈ గోల్‌మాల్‌లో ఆమె పీఏగా పని చేసిన ఎం.రవికుమార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించామని డీసీపీ ఎన్.శ్వేత పేర్కొన్నారు.
అస్కీ ఆధీనంలో సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్, సెంటర్ ఫర్ అడ్రికల్చర్ రూరల్ డెవలప్‌మెంట్ పేర్లతో కేంద్రాలు పని చేస్తున్నాయి. అస్కీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన భాగ్యలక్ష్మి ఎక్స్‌టెన్షన్‌పై వీటికి డైరెక్టర్‌గా పని చేశారు. 2021–24 మధ్య ఈమె హయాంలో అనేక శిక్షణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు జరిగాయి. ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి పలు ఏజెన్సీలు, కన్సల్టెంట్లతో పాటు పలువురు విక్రేతలు సేవల్ని వినియోగించుకున్నారు. ఆయా ఏజెన్సీలు, విక్రేతలు ఇచి్చన ఇన్వాయిస్‌ల ఆధారంగా అస్కీ నిధుల నుంచి చెల్లింపులు చేశారు.
ఈ విక్రేతలు, కన్సల్టెంట్స్ జాబితాలో హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన షేక్ అభిషేక్ ఇమ్లాక్, నగరానికి చెందిన బల్లపు శృతి, నలమస రజని, మాదాపూర్‌కు చెందిన ఎం.బుర్రయ్య, పాండురంగనగర్‌కు చెందిన ధనలక్ష్మి ఉన్నారు. వీరు ఇచ్చిన ఇన్వాయిస్‌ల ఆధారంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి 2021 మార్చి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.88.91 లక్షల చెల్లింపులు చేశారు. తన పీఏ రవికుమార్ సాయంతో ఆ నగదును వారి నుంచి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చెల్లింపులతో పాటు ఇతర కార్యకలాపాల నేపథ్యంలో భాగ్యలక్ష్మిని ఈ ఏడాది ఆగస్టు 16న అస్కీ విధుల నుంచి తొలగించింది. శుక్రవారం ఆమెను అరెస్టు చేసిన సీసీఎస్ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది.
Comments
Please login to add a commentAdd a comment