రాష్ట్రంలో మళ్లీ కల్తీ సారా పేదలను కాటేసింది. మరక్కానం సమీపంలోని జాలర్ల గ్రామంలో విక్రయిస్తున్న కాల్తీసార తాగి ఐదుగురు జాలర్లు విగత జీవులయ్యారు. 17 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. పది లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషి యా ప్రకటించారు. ఇక చెంగల్పట్టు జిల్లాలో మరో నలుగురు రోజువారీ కూలీలు కల్తీ మద్యం తాగి మరణించారు.
సాక్షి, చైన్నె: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో కల్తీసారా విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో విల్లుపురం జిల్లా పరిధిలోని సముద్ర తీర గ్రామాలలో సారా విక్రయాలు పెద్దఎత్తున సాగుతున్నట్లు గత కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా కొందరు పోలీసుల నిర్లక్ష్యానికి కల్తీ సారా తాగి ఐదుగురు జాలర్లు మరణించారు. వివరాలు.. విల్లుపురం జిల్లా మరక్కానం పరిధిలోని ఎక్కియార్ కుప్పం సముద్ర తీరంలోని అంబా మేడు పరిసరాల్లో పుదుచ్చేరి నుంచి సారా తీసుకొచ్చి మరీ విక్రయిస్తున్నారు. అదే ప్రాంతంలోకి మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన అమరన్(25) ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో శనివారం రాత్రి ఇతడు అమ్మిన సారాను పదుల సంఖ్యలో జాలర్లు తాగారు. రాత్రి సమయంలో ఎక్కియార్‌కుప్పం గ్రామానికి చెందిన శంకర్(55), ధరణి వేల్(50), సురేష్(60), ఇంద్రన్(61)తో పాటు ఆరుగురు పూటుగా కల్తీ సారా తాగి ఇళ్లకు చేరుకున్నారు. కాసేపటికి కడుపు నొప్పి, వంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని అర్థరాత్రి వేళ పుదుచ్చేరి జిప్మర్‌కు తరలించారు. వీరంతా కల్తీ సారా సేవించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. అదే సమయంలో చికిత్స పొందుతూ శంకర్, సురేష్, ధరణి వేల్ మరణించారు.
ఆందోళనతో ఉద్రిక్తత..
కల్తీ సారా తాగి ముగ్గురు మరణించారనే సమాచారంతో విల్లుపురం జిల్లా యంత్రాంగం కదిలింది. అంబా మేడు పరిఽధిలో సారా పూటుగా తాగి అపస్మారక స్థితిలో పడివున్న వారిని గుర్తించి చికిత్స నిమిత్తం మరాక్కానం, ముండియంబాక్కం ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పళణి, ఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కల్తీ సారా విక్రయదారులను అరెస్టు చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం జాలర్ల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సారా విక్రయదారుడు అమరన్‌ను అరెస్టు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో జాలర్లు ఆందోళన విరమించారు. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మరో ఇద్దరు మధ్యాహ్నం మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇక చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరి పరిస్థితి ఆందోళనకకరంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
అధికారులపై వేటు
మళ్లీ సారా సంస్కృతి తెర మీదకు రావడం, నలుగురు మరణించడంతో ప్రభుత్లంపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వతీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి వంటి మత్తు పదార్థాలు లభ్యమవుతూ వచ్చాయని, ఇప్పుడు సారా సంస్కృతి కూడా మళ్లీ తెర మీదకు వచ్చి నలుగురు బలికావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనను సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. డీజీపీ శైలేంద్రబాబుతో ఈ విషయంపై చర్చించారు. డీజీపీ ఆదేశాలతో మరక్కానం ఇన్‌స్పెక్టర్ అరుల్ వడివళగన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ దీపన్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ మరియా సోఫి మంజుల, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ తన సానుభూతి తెలియజేశారు. అలాగే తలా రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సారా రక్కసి నలుగురిని బలి కొనడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సారా తయారీ కేంద్రాలపై దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment