ఒక్క ఆగస్టులోనే హైదరాబాద్‌లో 84,852 పాస్‌పోర్ట్‌ల జారీ
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం జాతీయ రికార్డు నెలకొల్పింది. ఒక్క ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో 84,752 పాస్‌పోర్ట్‌లను జారీ చేసిన ఘనతను దక్కించుకుంది. దేశంలో 37 పాస్‌పోర్ట్ కార్యాలయాలంటే ఇప్పటివరకూ ఏ పాస్‌పోర్ట్ కార్యాలయం కూడా ఒకే నెలలో ఇన్ని పాస్‌పోర్ట్‌లను జారీ చేయలేదు. మార్చి నెలలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచే అత్యధికంగా 65,700 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. ఇప్పుడు 84,752 పాస్‌పోర్ట్‌లను జారీ చేసి తన రికార్డును తానే తిరగరాసుకుంది. ఎక్కువ పాస్‌పోర్ట్‌లను జారీ చేసేందుకు పాస్‌పోర్ట్ కార్యాలయ ఉద్యోగులు అదనపు గంటలు పనిచేశారని, సెలవు దినాలైన శని, ఆదివారాల్లోనూ పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ విభాగం అధికారి డా.ఎ.శిరీష్ తెలిపారు. జాతీయ రికార్డు సృష్టించినందుకు ఉద్యోగులను పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు అభినందించారు.
దరఖాస్తుదారులకు మరింత మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది 7.5 లక్షలకుపైగా పాస్‌పోర్ట్‌ల జారీకి అవకాశముంది. ప్రస్తుతం ఈ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో 18 జిల్లాలున్నాయి. ఆరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి.