గురుకులాల్లోనూ ‘వెనుకబాటే’
అవగాహన లోపంతో దరఖాస్తు కూడా చేసుకోలేని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, వసతిగృహాలు అందరికీ చేరువ కావడం లేదు. వారి లోని కొందరికే ఈ ఫలాలు అందుతున్నాయి. మొత్తం 138 బీసీ కులాల్లో 20 నుంచి 25 కులాల వారే ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారన్నది ఓ అధ్యయనం వెల్లడించిన నిజం. రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ (సీజీజీ) ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం బీసీల్లోని ఎ, బి, సి, డి, గ్రూపుల కులాలు గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోవడంతో ప్రవేశం పొంద లేకపో తున్నారు. కొన్ని కులాల వారు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని తెలిసింది.
వెనుకబాటుతనమే కారణం:
ఒక్కసారి కూడా పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లను పొందని కులాలు 52 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడటం మూలనా అధిక శాతం కులాల వారు ఈ పాఠశాలల్లో చేరట్లేదని అధికారులు భావిస్తున్నారు. చదువుకోవాలనే ఆసక్తి కొరవడటం, ఈ పాఠశాలల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కనీస విషయాలు తెలియకపోవడం వల్ల దరఖాస్తుకు వెనకాడుతున్నారన్నారు. సంచార జాతులు గా ఆయా వృత్తులకు పరిమితం కావడం వంటి కారణాలతో చేరడం లేదనేది స్పష్టమైంది.
సీజీజీ నివేదిక ప్రకారం 36 కులాల వారు భిక్షాటనే ప్రధాన వృత్తిగా ఇప్పటికీ జీవితం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని భిక్షాటన నుంచి దూరం చేసి వారి పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివించే దిశగా ప్రభుత్వం నడుం బిగించింది. బీసీ గురుకులల్లో 5వ తరగతిలోకి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు మే 8వ తేదీ చివరితేదీ. ఆ లోగా ఈ 36 కులాలతో పాటు, ప్రవేశం పొందని కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీ చేశారు.