Lady Police
-
శాంతి పావురం
మరో కొత్త బ్యాచ్ బయటికొచ్చింది. నూట ముప్పై ఒక్క మంది ఐపీఎస్‌లు. హైదరాబాద్‌లో పాసింగ్ అవుట్ పరేడ్. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ. ఒకటే సలహా ఇచ్చారు. ‘సింగం’ హీరోలం అనుకోకండి.. పీపుల్ ఫ్రెండ్లీ అవండి.. అని. అంటే.. ఎలా?! మోనికా భరద్వాజ్లా అనుకోవచ్చు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కొత్త డీసీపీ ఆమె. యూనిఫామ్‌లో.. శాంతి పావురం!! పార్కింగ్ దగ్గర గొడవ. ఢిల్లీ పోలీస్‌లకు, లాయర్లకు! పైకి పార్కింగే, వెనకేం ఉందో.. పెద్ద ఘర్షణ మొదలైంది. వెంటవెంటనే మూడొందల మంది లాయర్లు పోగయ్యారు. ఉన్నది పది మంది పోలీసులు. వాహనాలు దగ్ధం అయ్యాయి. పాత ఢిల్లీ తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో నల్ల కోటు, తెల్ల ప్యాంటు ధరించి ఉన్న లాయర్లు పోలీసుల మీదకు ఉరికారు. అప్పుడొచ్చారు ఒక పోలీస్ ఆఫీసర్. మహిళా పోలీస్ ఆఫీసర్. పోలీసులకంటే ముందు వెళ్లి, మీదకి వస్తున్న లాయర్లకు అడ్డుగా నిలబడ్డారు! ‘ప్లీజ్.. స్టాప్’ అంటూ చేతులు జోడించారు. లాయర్లు ఆగలేదు. ఆమె మీదకు వచ్చారు. ఆమెను తోసుకుంటూ వచ్చారు. నెట్టుకుంటూ వచ్చారు. ఆమె కాలర్ పట్టుకుని లాగారు. మామూలు కాలర్ కాదది. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కాలర్. ఆమె ఒళ్లు గీసుకుపోయింది. కొన్ని చోట్ల కందిపోయింది. యూనిఫామ్ చెదిరిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఇదంతా క్లియర్‌గా ఉంది. ఆ మహిళా ఆఫీసర్.. మోనికా భరద్వాజ్, ఐపీసీ. వెస్ట్ ఢిల్లీ డీసీపీ. ‘‘వాళ్లు కావాలని నన్నలా చేయలేదు. తోపులాటలో అలా జరిగింది’’ అని విచారణలో చెప్పారు మోనిక! సామరస్య పరిష్కారం. ఏడాది కిందటి సంగతి ఇది. నాలుగేళ్లక్రితం పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో పంకజ్ నారంగ్ అనే నలభై ఏళ్ల డెంటిస్టుపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. మత కలహాలు చెలరేగడానికి తగినంతగా ఆ ఘటనలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అప్పటి నుంచే వెస్ట్ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ! దోషుల్ని తక్షణం అరెస్ట్ చేశారు. ఏ క్షణమైనా ‘మతం’ రాజుకోవచ్చని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఆమె.. ‘ఇందులో మతపరమైన కోణం లేనే లేదు. డాక్టర్ హత్యకేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిలో నలుగురు మైనర్లే. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వందతులను నమ్మకండి’’ అని ట్వీట్ చేశారు. వెంటనే ఆమెపై ఒక వర్గం నుంచి తిరుగు తిట్ల ట్వీట్లు కురిశాయి. ట్రోల్స్ వచ్చాయి. ‘‘పట్టించుకోకు అని కిరణ్ బేడి’’ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేశారు. క్రికెట్లో బంగ్లాదేశ్‌పై ఇండియా గెలిచిన పర్యవసానంగా మొదలైన తగవులాటలే ఆనాడు డాక్టర్ హత్యకు దారి తీసిన కారణం. మోనిక ఆ ట్వీట్ పెట్టినందువల్లే సిటీ శాంతించింది. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మోనికా భరద్వాజ్ ఇప్పుడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కొత్త డీసీపీ. కొద్ది రోజుల క్రితమే చార్జి తీసుకున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచికి తొలి మహిళా డీసీపీ! 2016లో వెస్ట్ ఢిల్లీ డీసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా.. కిరణ్ బేడీ తర్వాత ఆ పోస్ట్‌లోకి వెళ్లిన రెండో మహిళగా ఆమెకు గుర్తింపు లభించింది. అంతకన్నా ముందు మోనిక పుదుచ్చేరిలో చేశారు. 21 ఏళ్ల మహిళపై జరిగిన సామూహిక లైంగిక దాడిలో నిందితుల్ని పట్టుకోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్లోకి మరో చురుకైన మహిళా ఐ.పి.ఎస్. వచ్చినట్లయింది. మోనిక 2009 బ్యాచ్ ఆఫీసర్. కొంతకాలం యు.ఎస్.లో ఉండి వచ్చారు. రొహ్టాక్ జిల్లాలోని (హర్యానా) సంప్లా ఆమె స్వస్థలం. స్కూలంతా రొహ్టాక్లో, డిగ్రీ ఢిల్లీలో. అక్కడి నుంచే సివిల్స్‌కి ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించారు. రెండు తరాలుగా వాళ్లది పోలీస్ కుటుంబం. మోనిక మూడో తరం. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను చేసుకున్నారు. ఐదేళ్ల క్రితమే పెళ్లయింది. నిజాయితీ, సత్యసంధత, నిరంతర ప్రయత్నం ఇవి మూడూ ఉండాలి పోలీస్ ఆఫీసర్‌కి అంటారు మోనిక. ‘‘పోలీస్ శాఖలోకి మరింత మంది మహిళలు రావాలి. జనాభాలో సగంగా ఉన్న మనం, డిపార్ట్మెంట్లో పది శాతం కూడా లేకపోవడం ఏమిటి?’’ అని నవ్వుతారు. స్పూర్తిని కలిగించే నవ్వు అది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ : మోనికా భరద్వాజ్ (సీసీ టీవీ ఫుటేజ్ : 2019 నవంబర్ 2) -
పోలీస్ వర్సెస్ కండక్టర్.. వైరల్ వీడియో
-
పోలీస్ వర్సెస్ కండక్టర్.. వైరల్ వీడియో
మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్‌నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి తీసుకోరని, వారెంట్ ఉంటే చూపించాలని కోరింది. అయితే నా దగ్గర వారెంట్ లేదు, పోలీస్ డ్రెస్ ఉంటే టికెట్ అడగరని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇరువురి మధ్య మాటకు మాట పెరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ రజితకుమారి కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇరువురు ఘర్షణ పడుతున్న సమయంలో అందులో ఉండే ఓ ప్రయాణికుడు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఘటనలో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇరువురి మధ్య రాజీ కుదుర్చారు. అయితే నిబంధనల ప్రకారం పోలీస్ సిబ్బంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సమయంలో డ్రెస్‌లో ఉన్న, ఐడీ ఉన్న టికెట్ తీసుకోవాలని కేవలం దూరం ప్రయాణాలకు వెళ్లే సమయంలో వారెంట్ ఉంటే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఘటనపై ఎస్పీ అనురాధ విచారణకు ఆదేశించారు. -
లేడీ పోలీస్ ఎక్కడ?
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈవ్ టీజింగ్, వరకట్నపు హత్యలు, వేధింపులు, లైంగిక దాడులు, హత్యలు, గొలుసు దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. రోజురోజుకూ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకు తగినట్లుగా ఠాణాలలో మహిళా పోలీసుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. మహిళలు మగ పోలీసులతో సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్స్టేషన్లకు రావడానికే వెనుకడుగు వేస్తున్నారు. నిజామాబాద్ క్రైం : జిల్లాలో మహిళా పోలీసుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి ఠాణాలో మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తప్పనిసరిగా ఒక మహిళా రిసెప్షనిస్టు ఉండాలి. మహిళా సిబ్బంది ఉండాలి. కానీ ఎక్కడా లేడీ కానిస్టేబుళ్లు కనిపించడం లేదు. జి ల్లాలో ఒకే ఒక్క మహిళా ఠాణా ఉంది. అక్కడా సరి పడా సిబ్బంది లేరు. ఉన్నవారికి తగిన సౌకర్యాలు కూడా లేవు. ఎస్ఐకి కనీసం వాహనం కూడా లేదు. సీఐని రెండేళ్ల క్రితం బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇంకెవ్వరినీ నియమించలేదు, దీంతో బాధిత మ హిళలు పోలీసు స్టేషన్లకు రావడానికి జంకుతున్నారు. మగ పోలీసులకు తమ బాధలు చెప్పుకోలేక ఫిర్యాదు చేయడానికే వెనుకాడుతున్నారు. ఏటే టా మహిళలపై అ ఘాయిత్యాలు పెరుగుతునే ఉన్నాయి. నేరాలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోంది. మహిళా పోలీసులు తగి నంత సంఖ్యలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో కొన్ని సమస్యలు మరుగున పడిపోతున్నాయి. ఇదీ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం జిల్లాలో పురుషులు 12,52,192 మంది ఉండగా, మహిళలు 12,99,882 మంది ఉన్నారు. మగవారి కంటే ఆడ వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందుకు అనుగుణంగా ఠాణాలలో మహిళా సిబ్బందిని నియమించడంలో పాలకు లు విఫలమవుతున్నారు. అధికారులు కూడా ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లాలో మొత్తం 45 పోలీస్స్టేషన్లు ఉన్నా యి. 27 ఠాణాలలో నామమాత్రంగా మహిళా సిబ్బంది ఉండగా, 18 ఠాణాలలో ఒక్క మహి ళా పోలీస్ కూడా లేరు. మొత్తంగా 66 మంది సివిల్ మహిళా పోలీసులు, 68 మంది మహిళా హోంగార్డులు అందుబాటులో ఉన్నారు. అంటే ప్రతి తొమ్మిది వేల మహిళా జనాభాకు ఒక పోలీస్ అన్నమాట. మరో 19 మంది శిక్షణలో ఉన్నారు. ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలోనే మహిళల కౌన్సెలింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలలో మ హిళా ఎస్ఐతోపాటు, మహిళా న్యాయవాది, మహిళా వైద్యురాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సమక్షంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మహిళ పోలీసులపైనే పనిభారం పడుతోంది. అత్యవసర సమయం లో ఒక్కరోజు కూడా సెలవు దొరకని పరిస్థితి. మహిళా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసే సమయంలో వారిని కట్టడి చేసేందుకు నా నా తంటాలు పడవల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా ఠాణాలు, పోలీసుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. -
లేడీ పోలీస్
క్షమయా ధరిత్రిగా పేరొందిన మహిళ.. ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు.. సమాజాన్ని కంట్రోల్ చేయడంలోనూ రాణిస్తున్నారు. లాఠీ చేత పట్టి లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేస్తున్నా.. నారీమణులను అబలలుగానే చూసేవారెందరో ఉన్నారు. విమెన్స్ వర ల్డ్స్ కాంగ్రెస్‌కు హాజరైన విదేశీ వనితలు సమావేశాల మధ్య విరామంలో ఇదే టాపిక్ డిస్కషన్‌కి వచ్చింది. అంశం ‘లేడీ పోలీస్’ అయితే వారి ఆశయం విమెన్ ఇన్ ఆల్ అయ్యింది. రసవత్తరంగా సాగిన వీరి మాటలకు సిటీప్లస్ వేదికయ్యింది. ఉగాండాకు చెందిన ప్రొఫెసర్ ముఖాస చర్చను మొదలు పెడుతూ.. ‘నెలరోజుల కిందట మా దేశ పార్లమెంటు దగ్గర గార్డ్‌గా పనిచేస్తున్న మహిళ గర్భవతి అయినట్టు తెలియగానే వెంటనే అధికారులు ఆమెను మరోచోటికి బదిలీ చేశారు. గర్భవతి అయిన ఉద్యోగి పార్లమెంట్ విధులకు అనర్హురాలని వారి అభిప్రాయం. కానీ ఆ మహిళా గార్డ్ న్యాయం కోసం కోర్టుకెక్కింది. న్యాయస్థానం ఆమెను పార్లమెంట్లో తన విధులు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. మా దేశంలో విమెన్ పోలీస్ చాలా స్ట్రాంగ్. మిలటరీలోనూ మహిళల సంఖ్య ఎక్కువే. ఉన్నత పదవుల్లో మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు. ఫిట్‌నెస్‌లో కూడా స్ట్రాంగే’ అంటూ తన దేశంలోని పోలీసుల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు ముఖాస. ముఖాస మాటలను అన్వయిస్తూ టర్కీ మహిళలు తమ దేశంలోని లేడీ పోలీసుల పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ‘మా దేశంలో మహిళలను పోలీస్ డిపార్ట్మెంట్ వరకైతే ఓకే గానీ డిఫెన్స్‌లో చూడటానికి పెద్దగా ఇష్టపడరు. మహిళలకు మిలటరీలో చోటు ఉండకూడదని చట్టాలు కూడా ఉన్నాయి. మహిళల మనసు సున్నితమైందని.. వారు శత్రువులపై దాడి చేయలేరని వారి అభిప్రాయం. ఇక లేడీ పోలీసుల సేవలను కూడా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో చాలా పరిమితంగా ఉపయోగించుకుంటున్నార’ని తమ దేశంలో విమెన్ పోలీస్ దుస్థితిని వివరించారు టర్కీకి చెందిన జెనిప్ ఉస్కిల్. కెనడాలో పవర్ఫుల్ తమ దేశంలో లేడీ పోలీసులు పవర్ఫుల్ అని గర్వంగా చెప్పారు కెనడాకు చెందిన ప్రొఫెసర్ ఇసబెల్లా మ్యూసివెస్సిగే. ‘పోలీస్ డిపార్డ్మెంటే కాదు.. మిలటరీలో కూడా మహిళలు దూసుకుపోతున్నారు. పురుషులకు మించి ప్రతిభ చాటుకుంటున్న వారూ ఉన్నారు. మా లేడీ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పిన ఇసబెల్లా మాటలను కొనసాగిస్తూ.. ‘అవును అక్షరాల నిజం.. విధి నిర్వహణలో మహిళలు మగవాడి కంటే కఠినంగా ఉండగలరని మా వాళ్లు చాలా సందర్భాల్లో నిరూపించారు’ అంటూ తన అభిప్రాయాన్ని జోడించారు కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు. తమ దేశంలో మహిళా పోలీసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు బ్రెజిల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు మిరైన్ గ్నోస్సి. రక్షణ విభాగంలో చోటు కోసం లేడీ పోలీసులు బోలెడన్ని సాహసాలు చేస్తున్నారని అక్కడి పరిస్థితులు షేర్ చేసుకున్నారు.