కండక్టర్‌పై దాడి చేస్తున్న కానిస్టేబుల్
మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్‌నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి తీసుకోరని, వారెంట్ ఉంటే చూపించాలని కోరింది. అయితే నా దగ్గర వారెంట్ లేదు, పోలీస్ డ్రెస్ ఉంటే టికెట్ అడగరని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే ఇరువురి మధ్య మాటకు మాట పెరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ రజితకుమారి కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇరువురు ఘర్షణ పడుతున్న సమయంలో అందులో ఉండే ఓ ప్రయాణికుడు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఘటనలో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇరువురి మధ్య రాజీ కుదుర్చారు. అయితే నిబంధనల ప్రకారం పోలీస్ సిబ్బంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సమయంలో డ్రెస్‌లో ఉన్న, ఐడీ ఉన్న టికెట్ తీసుకోవాలని కేవలం దూరం ప్రయాణాలకు వెళ్లే సమయంలో వారెంట్ ఉంటే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఘటనపై ఎస్పీ అనురాధ విచారణకు ఆదేశించారు.