శాంతి పావురం | Special Story About Monika Bhardwaj From Delhi Crime Branch | Sakshi
Sakshi News home page

శాంతి పావురం

Published Sun, Sep 6 2020 12:37 AM | Last Updated on Sun, Sep 6 2020 7:44 AM

Special Story About Monika Bhardwaj From Delhi Crime Branch - Sakshi

మోనికా భరద్వాజ్, డీసీపీ. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌

మరో కొత్త బ్యాచ్‌ బయటికొచ్చింది. నూట ముప్పై ఒక్క మంది ఐపీఎస్‌లు. హైదరాబాద్‌లో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ. ఒకటే సలహా ఇచ్చారు. ‘సింగం’ హీరోలం అనుకోకండి.. పీపుల్‌ ఫ్రెండ్లీ అవండి.. అని. అంటే.. ఎలా?! మోనికా భరద్వాజ్‌లా అనుకోవచ్చు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ కొత్త డీసీపీ ఆమె. యూనిఫామ్‌లో.. శాంతి పావురం!!

పార్కింగ్‌ దగ్గర గొడవ. ఢిల్లీ పోలీస్‌లకు, లాయర్‌లకు! పైకి పార్కింగే, వెనకేం ఉందో.. పెద్ద ఘర్షణ మొదలైంది. వెంటవెంటనే మూడొందల మంది లాయర్లు పోగయ్యారు. ఉన్నది పది మంది పోలీసులు. వాహనాలు దగ్ధం అయ్యాయి. పాత ఢిల్లీ తీస్‌ హజారీ కోర్టు ప్రాంగణంలో నల్ల కోటు, తెల్ల ప్యాంటు ధరించి ఉన్న లాయర్లు పోలీసుల మీదకు ఉరికారు. అప్పుడొచ్చారు ఒక పోలీస్‌ ఆఫీసర్‌. మహిళా పోలీస్‌ ఆఫీసర్‌. పోలీసులకంటే ముందు వెళ్లి, మీదకి వస్తున్న లాయర్‌లకు అడ్డుగా నిలబడ్డారు!

‘ప్లీజ్‌.. స్టాప్‌’ అంటూ చేతులు జోడించారు. లాయర్‌లు ఆగలేదు. ఆమె మీదకు వచ్చారు. ఆమెను తోసుకుంటూ వచ్చారు. నెట్టుకుంటూ వచ్చారు. ఆమె కాలర్‌ పట్టుకుని లాగారు. మామూలు కాలర్‌ కాదది. డ్యూటీలో ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ కాలర్‌. ఆమె ఒళ్లు గీసుకుపోయింది. కొన్ని చోట్ల కందిపోయింది. యూనిఫామ్‌ చెదిరిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఇదంతా క్లియర్‌గా ఉంది. ఆ మహిళా ఆఫీసర్‌.. మోనికా భరద్వాజ్, ఐపీసీ. వెస్ట్‌ ఢిల్లీ డీసీపీ. ‘‘వాళ్లు కావాలని నన్నలా చేయలేదు. తోపులాటలో అలా జరిగింది’’ అని విచారణలో చెప్పారు మోనిక! సామరస్య పరిష్కారం. ఏడాది కిందటి సంగతి ఇది. 

నాలుగేళ్లక్రితం పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో పంకజ్‌ నారంగ్‌ అనే నలభై ఏళ్ల డెంటిస్టుపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. మత కలహాలు చెలరేగడానికి తగినంతగా ఆ ఘటనలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అప్పటి నుంచే వెస్ట్‌ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ! దోషుల్ని తక్షణం అరెస్ట్‌ చేశారు. ఏ క్షణమైనా ‘మతం’ రాజుకోవచ్చని ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్‌ వచ్చింది. వెంటనే ఆమె.. ‘ఇందులో మతపరమైన కోణం లేనే లేదు.

డాక్టర్‌ హత్యకేసులో అరెస్ట్‌ అయిన తొమ్మిది మందిలో నలుగురు మైనర్‌లే. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వందతులను నమ్మకండి’’ అని ట్వీట్‌ చేశారు. వెంటనే ఆమెపై ఒక వర్గం నుంచి తిరుగు తిట్ల ట్వీట్‌లు కురిశాయి. ట్రోల్స్‌ వచ్చాయి. ‘‘పట్టించుకోకు అని కిరణ్‌ బేడి’’ ఆమెకు మద్దతుగా ట్వీట్‌ చేశారు. క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా గెలిచిన పర్యవసానంగా మొదలైన తగవులాటలే ఆనాడు డాక్టర్‌ హత్యకు దారి తీసిన కారణం. మోనిక ఆ ట్వీట్‌ పెట్టినందువల్లే సిటీ శాంతించింది. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది.

మోనికా భరద్వాజ్‌ ఇప్పుడు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ కొత్త డీసీపీ. కొద్ది రోజుల క్రితమే చార్జి తీసుకున్నారు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచికి తొలి మహిళా డీసీపీ! 2016లో వెస్ట్‌ ఢిల్లీ డీసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా.. కిరణ్‌ బేడీ తర్వాత ఆ పోస్ట్‌లోకి వెళ్లిన రెండో మహిళగా ఆమెకు గుర్తింపు లభించింది. అంతకన్నా ముందు మోనిక పుదుచ్చేరిలో చేశారు. 21 ఏళ్ల మహిళపై జరిగిన సామూహిక లైంగిక దాడిలో నిందితుల్ని పట్టుకోవడంతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి మరో చురుకైన మహిళా ఐ.పి.ఎస్‌. వచ్చినట్లయింది. మోనిక 2009 బ్యాచ్‌ ఆఫీసర్‌. కొంతకాలం యు.ఎస్‌.లో ఉండి వచ్చారు.

రొహ్టాక్‌ జిల్లాలోని (హర్యానా) సంప్లా ఆమె స్వస్థలం. స్కూలంతా రొహ్టాక్‌లో, డిగ్రీ ఢిల్లీలో. అక్కడి నుంచే సివిల్స్‌కి ప్రిపేర్‌ అయి ఐపీఎస్‌ సాధించారు. రెండు తరాలుగా వాళ్లది పోలీస్‌ కుటుంబం. మోనిక మూడో తరం. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను చేసుకున్నారు. ఐదేళ్ల క్రితమే పెళ్లయింది. నిజాయితీ, సత్యసంధత, నిరంతర ప్రయత్నం ఇవి మూడూ ఉండాలి పోలీస్‌ ఆఫీసర్‌కి అంటారు మోనిక. ‘‘పోలీస్‌ శాఖలోకి మరింత మంది మహిళలు రావాలి. జనాభాలో సగంగా ఉన్న మనం, డిపార్ట్‌మెంట్‌లో పది శాతం కూడా లేకపోవడం ఏమిటి?’’ అని నవ్వుతారు. స్పూర్తిని కలిగించే నవ్వు అది.
 ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ : మోనికా భరద్వాజ్‌ (సీసీ టీవీ ఫుటేజ్‌ : 2019 నవంబర్‌ 2)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement