లేడీ పోలీస్ | Lady Police | Sakshi
Sakshi News home page

లేడీ పోలీస్

Published Tue, Aug 19 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

లేడీ పోలీస్

లేడీ పోలీస్

క్షమయా ధరిత్రిగా పేరొందిన మహిళ.. ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు.. సమాజాన్ని కంట్రోల్ చేయడంలోనూ రాణిస్తున్నారు. లాఠీ చేత పట్టి లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేస్తున్నా.. నారీమణులను అబలలుగానే చూసేవారెందరో ఉన్నారు. విమెన్స్ వర ల్డ్స్ కాంగ్రెస్‌కు హాజరైన విదేశీ వనితలు సమావేశాల మధ్య విరామంలో ఇదే టాపిక్ డిస్కషన్‌కి వచ్చింది. అంశం ‘లేడీ పోలీస్’ అయితే వారి ఆశయం విమెన్ ఇన్ ఆల్ అయ్యింది. రసవత్తరంగా సాగిన వీరి మాటలకు సిటీప్లస్ వేదికయ్యింది.
 
ఉగాండాకు చెందిన ప్రొఫెసర్  ముఖాస చర్చను మొదలు పెడుతూ.. ‘నెలరోజుల కిందట మా దేశ పార్లమెంటు దగ్గర గార్డ్‌గా పనిచేస్తున్న మహిళ గర్భవతి అయినట్టు తెలియగానే వెంటనే అధికారులు ఆమెను మరోచోటికి బదిలీ చేశారు. గర్భవతి అయిన ఉద్యోగి పార్లమెంట్ విధులకు అనర్హురాలని వారి అభిప్రాయం. కానీ ఆ మహిళా గార్డ్ న్యాయం కోసం కోర్టుకెక్కింది. న్యాయస్థానం ఆమెను పార్లమెంట్‌లో తన విధులు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది.

మా దేశంలో విమెన్ పోలీస్ చాలా స్ట్రాంగ్.

మిలటరీలోనూ మహిళల సంఖ్య ఎక్కువే. ఉన్నత పదవుల్లో మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు. ఫిట్‌నెస్‌లో కూడా స్ట్రాంగే’ అంటూ తన దేశంలోని పోలీసుల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు ముఖాస. ముఖాస మాటలను అన్వయిస్తూ టర్కీ మహిళలు తమ దేశంలోని లేడీ పోలీసుల పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ‘మా దేశంలో మహిళలను పోలీస్ డిపార్ట్‌మెంట్ వరకైతే ఓకే గానీ డిఫెన్స్‌లో చూడటానికి పెద్దగా ఇష్టపడరు. మహిళలకు మిలటరీలో చోటు ఉండకూడదని చట్టాలు కూడా ఉన్నాయి. మహిళల మనసు సున్నితమైందని.. వారు శత్రువులపై దాడి చేయలేరని వారి అభిప్రాయం. ఇక లేడీ పోలీసుల సేవలను కూడా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో చాలా పరిమితంగా ఉపయోగించుకుంటున్నార’ని తమ దేశంలో విమెన్ పోలీస్ దుస్థితిని వివరించారు టర్కీకి చెందిన జెనిప్ ఉస్కిల్.

కెనడాలో పవర్‌ఫుల్

తమ దేశంలో లేడీ పోలీసులు పవర్‌ఫుల్ అని గర్వంగా చెప్పారు కెనడాకు చెందిన ప్రొఫెసర్ ఇసబెల్లా మ్యూసివెస్సిగే. ‘పోలీస్ డిపార్డ్‌మెంటే కాదు.. మిలటరీలో కూడా మహిళలు దూసుకుపోతున్నారు. పురుషులకు మించి ప్రతిభ చాటుకుంటున్న వారూ ఉన్నారు. మా లేడీ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పిన ఇసబెల్లా మాటలను కొనసాగిస్తూ.. ‘అవును అక్షరాల  నిజం.. విధి నిర్వహణలో మహిళలు మగవాడి కంటే కఠినంగా ఉండగలరని మా   వాళ్లు చాలా సందర్భాల్లో నిరూపించారు’ అంటూ తన అభిప్రాయాన్ని జోడించారు కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు. తమ దేశంలో మహిళా పోలీసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు బ్రెజిల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు మిరైన్ గ్నోస్సి. రక్షణ విభాగంలో చోటు కోసం లేడీ పోలీసులు బోలెడన్ని సాహసాలు చేస్తున్నారని అక్కడి పరిస్థితులు షేర్ చేసుకున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement