Womens Worlds Congress
-
చరిత్రాత్మకం.. అపూర్వం
సిటీ అందాలపై కొరియన్ల మాట విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ ముగిసింది. అందరూ పునశ్ఛరణలో.. గతంలో జరిగిన విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌కి, దీనికి వ్యత్యాసాలు, మంచిచెడులు బేరీజువేసుకొనే పనిలోపడ్డారు. అంతేకాదు నగర అందాలను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తూ కనిపించారు. అలా కనిపించిందే ఈ కొరియన్ జంట. పేర్లు.. ఉన్ షిల్ కిమ్, జియన్ రో. ‘హైదరాబాద్‌లో చరిత్రాత్మక కట్టడాల గురించి విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చిందని’ నగర విశిష్టతను వీరు కొనియాడారు. ఉన్ షిల్ కిమ్... సియోల్‌లోని ఇవా ఉమన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్. కొరియన్ విమెన్స్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ కూడా. జియన్ రో అదే యూనివర్సిటీలో ఏషియన్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ సీనియర్ కోఆర్డినేటర్. 2005లో జరిగిన విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌కి కొరియానే ఆతిథ్యమిచ్చింది. ఆ సదస్సులో ఉన్ షిల్ కిమ్, జియన్ రోలు ఇద్దరూ కీలకపాత్ర పోషించారు. ఇండియన్ విమెన్ ఆర్ పవర్ఫుల్ నాటి సదస్సు నేటి సదస్సుకు ఉన్న తేడాలను వివరించింది ఉన్ షిల్ కిమ్...‘1981 నుంచి ఇప్పటిదాకా జరిగిన విమెన్స్ కాంగ్రెస్లన్నిటిలోకి కొరియాలో జరిగిందే పెద్దది. 75 దేశాల నుంచి మూడువేల మంది డెలిగేట్స్ వచ్చారు. ‘ఎంబ్రేసింగ్ ద ఎర్త్.. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్’ మా కాంగ్రెస్ థీమ్. ప్రపంచంలోని అభివృద్ధి, వెనుకబాటు ఉన్న మహిళలను ఒక్క దగ్గరికి చేర్చి ఐక్యం చేయాలన్నదే ఆ కాంగ్రెస్ లక్ష్యం. అంతలా విజయవంతమవడానికి వచ్చిన ఫెమినిస్టులు, రైటర్స్,ఉపన్యాసకులు, మహిళలకు సంబంధించి కృషిచేస్తున్న ఎన్జీవోలూ కారణం. అలాంటిదే నేను ఇక్కడా ఎక్స్పెక్ట్ చేశా. వెరీ బ్యాడ్ అండ్ శాడ్! ఆ స్పిరిటే కనిపించలేదు. బయటి నుంచి వచ్చిన వాళ్లు తప్ప లోకల్ రిప్రజెంటేషనే లేదు. ఇండియన్ విమెన్ ఆర్ వెరీ పవర్ఫుల్ విమెన్. ఎంతలా అంటే వరల్డ్ సినారియోనే చేంజ్ చేయగలిగేంత! మంచి శక్తియుక్తులున్న ఇండియన్ విమెన్‌కి ఇలాంటి సదస్సు మంచి స్పేస్నిస్తాయి. వరల్డ్ విమెన్‌తో ఇంటరాక్ట్ అయ్యే చాన్స్ వస్తుందికదా.. దీన్ని ఉపయోగించుకోవాలి’’ అన్నది. గ్రేట్ హైదరాబాద్ హైదరాబాద్ గురించి జియన్ రో మాట్లాడుతూ.. ‘ఉన్ ఇండియాకు చాలాసార్లు వచ్చింది కానీ నేను రావడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే హైదరాబాద్ విజిట్ ఇద్దరికీ ఫస్ట్‌టైమే. గ్రేట్.. చాలా బాగుంది. ఇక్కడి చారిత్రక కట్టడాల గురించి వినడమే.. ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది. ఫుడ్, కల్చర్ అన్నీ నచ్చాయ్. వి ఆర్ ఎంజాయింగ్ లాట్’ అని చెప్పింది! -
మంచి ముత్యాలు
విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన విదేశీ వనితలు సిటీలో షాపింగ్ సరదా తీర్చుకుంటున్నారు. హెచ్‌సీయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జువెలరీ.. క్లాత్ సెంటర్లలో విదేశీ వనితలు తమ అభిరుచికి తగ్గట్టుగా షాపింగ్ చేసుకుంటున్నారు. అక్కడే ఓ షాపులో ఖాదీ వస్త్రాలను, ముత్యాలహారాలను తీసుకుంటున్న కెనడాకు చెందిన షానూన్ పోలే, జామై రుక్లను సిటీప్లస్ పలకరించింది. ‘హైదరాబాద్‌కు వచ్చి ముత్యాలు కొనకుండా వెళ్తామా’ అంటూ షానూన్ పోలే ముత్యాలహారాన్ని మురిపెంగా చూశారు. ఇంత అందమైన, నాణ్యమైన వస్త్రాలను కొనకుండా ఎలా ఉండగలమన్నారు జామై రుక్మన్. వారు కొన్న వస్తువులను పేపర్ సంచుల్లో పెట్టి ఇవ్వడాన్ని మరింత ఎంజాయ్ చేశారు. -
లేడీ పోలీస్
క్షమయా ధరిత్రిగా పేరొందిన మహిళ.. ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు.. సమాజాన్ని కంట్రోల్ చేయడంలోనూ రాణిస్తున్నారు. లాఠీ చేత పట్టి లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేస్తున్నా.. నారీమణులను అబలలుగానే చూసేవారెందరో ఉన్నారు. విమెన్స్ వర ల్డ్స్ కాంగ్రెస్‌కు హాజరైన విదేశీ వనితలు సమావేశాల మధ్య విరామంలో ఇదే టాపిక్ డిస్కషన్‌కి వచ్చింది. అంశం ‘లేడీ పోలీస్’ అయితే వారి ఆశయం విమెన్ ఇన్ ఆల్ అయ్యింది. రసవత్తరంగా సాగిన వీరి మాటలకు సిటీప్లస్ వేదికయ్యింది. ఉగాండాకు చెందిన ప్రొఫెసర్ ముఖాస చర్చను మొదలు పెడుతూ.. ‘నెలరోజుల కిందట మా దేశ పార్లమెంటు దగ్గర గార్డ్‌గా పనిచేస్తున్న మహిళ గర్భవతి అయినట్టు తెలియగానే వెంటనే అధికారులు ఆమెను మరోచోటికి బదిలీ చేశారు. గర్భవతి అయిన ఉద్యోగి పార్లమెంట్ విధులకు అనర్హురాలని వారి అభిప్రాయం. కానీ ఆ మహిళా గార్డ్ న్యాయం కోసం కోర్టుకెక్కింది. న్యాయస్థానం ఆమెను పార్లమెంట్లో తన విధులు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. మా దేశంలో విమెన్ పోలీస్ చాలా స్ట్రాంగ్. మిలటరీలోనూ మహిళల సంఖ్య ఎక్కువే. ఉన్నత పదవుల్లో మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు. ఫిట్‌నెస్‌లో కూడా స్ట్రాంగే’ అంటూ తన దేశంలోని పోలీసుల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు ముఖాస. ముఖాస మాటలను అన్వయిస్తూ టర్కీ మహిళలు తమ దేశంలోని లేడీ పోలీసుల పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ‘మా దేశంలో మహిళలను పోలీస్ డిపార్ట్మెంట్ వరకైతే ఓకే గానీ డిఫెన్స్‌లో చూడటానికి పెద్దగా ఇష్టపడరు. మహిళలకు మిలటరీలో చోటు ఉండకూడదని చట్టాలు కూడా ఉన్నాయి. మహిళల మనసు సున్నితమైందని.. వారు శత్రువులపై దాడి చేయలేరని వారి అభిప్రాయం. ఇక లేడీ పోలీసుల సేవలను కూడా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో చాలా పరిమితంగా ఉపయోగించుకుంటున్నార’ని తమ దేశంలో విమెన్ పోలీస్ దుస్థితిని వివరించారు టర్కీకి చెందిన జెనిప్ ఉస్కిల్. కెనడాలో పవర్ఫుల్ తమ దేశంలో లేడీ పోలీసులు పవర్ఫుల్ అని గర్వంగా చెప్పారు కెనడాకు చెందిన ప్రొఫెసర్ ఇసబెల్లా మ్యూసివెస్సిగే. ‘పోలీస్ డిపార్డ్మెంటే కాదు.. మిలటరీలో కూడా మహిళలు దూసుకుపోతున్నారు. పురుషులకు మించి ప్రతిభ చాటుకుంటున్న వారూ ఉన్నారు. మా లేడీ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పిన ఇసబెల్లా మాటలను కొనసాగిస్తూ.. ‘అవును అక్షరాల నిజం.. విధి నిర్వహణలో మహిళలు మగవాడి కంటే కఠినంగా ఉండగలరని మా వాళ్లు చాలా సందర్భాల్లో నిరూపించారు’ అంటూ తన అభిప్రాయాన్ని జోడించారు కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు. తమ దేశంలో మహిళా పోలీసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు బ్రెజిల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు మిరైన్ గ్నోస్సి. రక్షణ విభాగంలో చోటు కోసం లేడీ పోలీసులు బోలెడన్ని సాహసాలు చేస్తున్నారని అక్కడి పరిస్థితులు షేర్ చేసుకున్నారు.