ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు బలి
సాక్షి, హైదరాబాద్ : ఓ యువతి ర్యాష్ డ్రైవింగ్ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చెప్పులు కుట్టుకొని పొట్టబోసుకునే నిరుపేద కుటుంబానికి పెద్ద దిక్కుని దూరం చేసింది. అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న తండ్రీకొడుకుల పైకి యువతి నడుపుతున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి మరణించగా.. ఆయన కొడుకు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు యువతులున్నారు. వీరంతా మద్యం మత్తులో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తుండగా... డ్రైవింగ్ చేసిన యువతితోపాటు మరో ఇద్దరు మద్యం తాగలేదని పోలీసులు చెబుతున్నారు. నలుగురు యువతుల్లో ఒకరు నగరంలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ కూతురు కావడం గమనార్హం.
పబ్‌లో పార్టీ చేసుకొని తిరిగి వస్తుండగా..
హైదరాబాద్ శివారు ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న పతిరెడ్డి ఈశాన్య రెడ్డి, కె.సృజన, అమృత భారతి, హారికా రెడ్డి స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి ఏఎస్రావు నగర్లో ఉన్న హబ్లాంజ్ పబ్‌లో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఈశాన్య రెడ్డి తార్నాకలోని తన ఇంటికి కారులో (ఏపీ 29 ఏవై 5234) బయల్దేరింది. అర్ధరాత్రి 12.02 గంటల ప్రాంతంలో వీరి కారు కుషాయిగూడ డీఏఈ కాలనీ బస్టాప్ సమీపంలో అదుపు తప్పి పుట్‌పాత్ పైకి దూసుకుపోయింది. ఆ సమయంలో నార్త్ లాలాగూడ ఇందిరానగర్‌కు చెందిన అశోక్ (46) తన కొడుకు మహేశ్‌తో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నాడు. అశోక్ ఇక్కడే చెప్పులు కుట్టుకునే డబ్బా ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం పని పూర్తయ్యే సరికి పొద్దుపోవడంతో కొడుకుతో కలిసి అక్కడే నిద్రపోయాడు. కారు వీరిద్దరిపై నుంచి దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. సెకండ్ షో సినిమా చూసి వెళ్తున్న స్థానికులు ప్రమాదాన్ని గమనించి కారు వద్దకు చేరుకుని అంబులెన్స్‌లో క్షతగాత్రుల్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు.
సారీ.. సారీ.. అంటూ వెళ్లే యత్నం
ప్రమాదం జరిగ్గానే కారులోంచి కిందికి దిగిన నలుగురు యువతులూ ‘సారీ... సారీ’అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయే యత్నం చేశారు. అయితే స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే వారంతా మద్యం తాగి ఉన్నారని, అక్కడే వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు జరపాలని స్థానికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వారిని నచ్చచెప్పిన పోలీసులు యువతులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారికి శ్వాస పరీక్ష చేశామని, డ్రైవింగ్ చేస్తున్న ఈశాన్య రెడ్డి మద్యం తాగలేదని పోలీసులు వెల్లడించారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారులో ఉన్నవారంతా మద్యం మత్తులోనే ఉన్నారని ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో యువతులతోపాటు మరో యువకుడు ఉన్నాడని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం అమ్మాయిలు మాత్రమే ఉన్నారని స్పష్టంచేస్తున్నారు. కారుకు కుక్క అడ్డు రాగా.. దాన్ని తప్పించే క్రమంలోనే కంగారుపడి బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ నొక్కానని, అందువల్లే ప్రమాదం జరిగిందని ఈశాన్య రెడ్డి పోలీసులకు చెప్పింది. అయితే ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాను పరిశీలించగా అందులో కుక్క కనిపించట్లేదని చెబుతున్నారు. హారికా రెడ్డి తండ్రి నగరంలోని ఓ పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు.
పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం
ప్రమాదంలో చనిపోయిన అశోక్‌కు భార్య, ముగ్గురు కొడుకులున్నారు. కుమారుల్లో ఒకరు ఇంటర్, మరొకరు డిగ్రీ చదువుతుండగా.. మహేశ్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందంటూ అశోక్ భార్య లక్ష్మీబాయి కన్నీరుమున్నీరైంది. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరింది.