ladyfinger crop
-
ఎర్రటి బెండకాయలు.. లాభాలెన్నో.. ధర ఎంతంటే!
బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది నిపుణుల మాట. రక్తహీనతను నివారించడంలోనూ.. చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. అదే విధంగా జీర్ణకోశానికి మేలు చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరచడంలోనూ బెండకాయల పాత్ర మరువలేనిది. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి గనుకే చాలా మంది బెండకాయలతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. ఒకే తరహాలో కాకుండా కూరలు, వేపుళ్లు, పులుసు.. ఇలా రకారకాలుగా ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు భిన్న రుచులను ఆస్వాదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. బెండకాయలను పచ్చిగాను, ఊరవేసుకుని కూడా తింటారు. ఎర్ర బెండీలు.. భలే భలే.. ఇక బెండకాయలను భారత్‌తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా ఆకుపచ్చని రంగులో ఉండే బెండకాయలే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు.. ఎర్రని బెండకాయలు పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మిస్రిలాల్ రాజ్‌పుత్ ఈ కొత్తరకం సాగుతో అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వారణాసిలోని వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కిలో ఎర్ర బెండీ గింజలు తీసుకువచ్చిన ఆయన.. 40 రోజుల్లోనే పంట చేతికి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మిస్రిలాల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ సాధారణమైన ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉండే బెండీలను పండించడం కొత్తగా అనిపిస్తోంది. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీపీ సమస్యలు, షుగర్ పేషెంట్లు, కొలెస్ట్రాల్‌తో బాధపడే వారికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. జూలై మొదటి వారంలో ఎర్రటి బిండీ విత్తనాలను నాటాను. ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండానే వీటిని పండించాను’’ అని రెడ్ లేడీఫింగర్ గురించి చెప్పుకొచ్చారు. చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్ తాగితే.. సాధారణ బెండకాయలు అయితే, మామూలు బెండకాయలకంటే వీటి ధర మాత్రం 5- 7 రెట్లు ఎక్కువగా ఉంటుందని మిస్రీలాల్ చెబుతున్నారు. కొన్ని సూపర్మార్కెట్లలో ఎర్ర బెండీల ధర అరకేజీకి కనిష్టంగా రూ. 70- 80, గరిష్టంగా.. 300- 400 రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక సాగు విషయానికొస్తే.. ఎకరా స్థలంలో ఒక పంటకు 70- 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. సాధారణంగా బెండకాయల్లో ఉండే పోషకాలు ►బెండకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. ►విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయని ప్రతీతి. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
బెండ.. సిరుల కొండ
సస్యరక్షణతో అధిక దిగుబడులు పరిమిత మందులే ఎంతో మేలు సలహాలు, సూచనలు తప్పనిసరి టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్ టేక్మాల్: బెండ సాగు రైతన్నకు ఎంతో అండగా నిలుస్తుందని టేక్మాల్ ఏఈఓ సునిల్‌కుమార్ (99499 68674) తెలిపారు. కాస్త మెలకువలు పాటిస్తే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందవచ్చునన్నారు. మోతాదుకు మించి మందులను వాడకుండా తగిన మోతుదులో వాడుతూ పంటలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమయానికి సహజ ఎరువులకు అధిక ప్రాధాన్యతనిస్తూ పండిస్తే మరింత దిగుబడులు పెరుగుతాయన్నారు. బెండసాగులో పురుగుల దాడిపై ఆయన అందించిన సలహ, సూచనలు మీకోసం.. మొవ్వు, కాయతొలుచు పురుగు: నాటిన 30 రోజుల నుంచి కోతదశ వరకు ఈ పురుగు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత, కాతదశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందకి తుంచాలి. లీటరు నీటికి కార్బరిల్ 3 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లి లేదా లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాయలు కోసిన తరువాత పిచికారి చేయాలి. పంట కాపునకు రాని దశలో థయోడికార్బ్ గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దీపపు పురుగులు: ఆకుపచ్చ రంగులో వుండే చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగ చేస్తాయి. ఆకులు పైకి ముడుచుకొని పోయి, పండుబారి రాలిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మిథైల్ డెమెటాన్ 2 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. ఎర్రనల్లి: పంట చివరి దశలో చిన్న, సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చి వేయడంవల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ: పంటలో పూతకు ముందు చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడంవల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంఖురోగాన్ని వ్యాప్తి చెందిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. తీవ్రదశలో ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజు గానీ, ఆముదం గానీ పూసి తెల్లదోమలను ఆకర్షింపచేసి నాశనం చేయాలి. తెగుళ్ళు బూడిద తెగులు: ఆకులపైన, అడుగు భాగాన బూడిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి.దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి. శంఖు లేదా పల్లాకు తెగులు: తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5గ్రా ఎసిఫేట్ కలిపి పిచికారి చే యడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు.వర్షాకాల పంటను జులై 15 ముందుగా విత్తటం ద్వారా ఈ తెగులును కొంత వరకు నివారించవచ్చు. ఎండు తెగులు: మొలక దశలో మొక్కలు మొత్తం కొద్ది సమయంలో ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు విత్తనశుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ళ వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరానికి 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి. సమగ్ర సస్యరక్షణ: కిలో విత్తనానికి 5 గ్రా చొప్పున ఇమిడాక్లోప్రిడ్(గౌచ్) మందును వాడి విత్తనశుద్ధి చేయాలి. ఎకరానికి 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షణ బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం లేదా గ్రీజు పూసి పెట్టి తెల్లదోమను ఆకర్షింపజేయాలి. రసం పీల్చేపురుగుల నివారణకు ఫాసలోన్,ఫిప్రొనిల్,డైమిధోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5గ్రా ఎసిఫేట్‌ను 1.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్ 3గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.